ప్రపంచంపై అతి పెద్ద బాంబు వేయనున్న అమెరికా – అదే జరిగితే

By KTV Telugu On 16 May, 2023
image

అమెరికాకు జలుబు చేస్తే ప్రపంచం అంతా దగ్గుతుందని ఓ నానుడి ఆర్థికపరమైన అంశాల విషయంలో ఎప్పటి నుంచో ఉంది. దీనికి కారణం అమెరికాపై ప్రపంచం అంతలా ఆధారపడటమ. ఇప్పుడు అమెరికా గతంలో ఎప్పుడూ లేనంత సంక్షోభాన్ని ఎదుర్కోబోతోందన్న విశ్లేషణలు వస్తున్నాయి. ఆర్ధిక పరిస్థితి సంక్షోభం దిశగా కదులుతోందని ఆర్ధిక వ్యవస్థ పతనం అంచున ఉందన్న రిపోర్టులు వస్తున్నాయి. ఇప్పుడు అమెరికా అప్పులు కూడా చేయలేని పరిస్థితి చేరిందని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు.

అమెరికా ప్రభుత్వం తీసుకునే రుణాలపై గరిష్ట పరిమితిని డెట్‌ సీలింగ్‌ అని వ్యవహరిస్తున్నారు. దీని ప్రకారం నిర్ధేశించిన పరిమితికి మించి ప్రభుత్వం అప్పులు చేయలేదు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, మిలిటరీ సిబ్బంది వేతనాలు, సామాజిక భద్రత, మెడికేర్‌, రుణాలపై వడ్డీల చెల్లింపులు, పన్ను రిఫండ్‌లు వంటి అనేక ఖర్చులు చెల్లింపుల కిందకు వస్తాయి. మరిన్ని అప్పులు చేసేందుకు అమెరికా చట్టసభ కాంగ్రెస్‌ ఆమోదం తప్పనిసరి. ఇప్పటికే అమెరికా పరిమితికి మించి అప్పులు చేసింది. ప్రపంచంలో అత్యధిక అప్పులున్న దేశాల్లో అమెరికా కూడా ఉంది. ప్రస్తుతం అమెరికా డెట్ సీలింగ్‌ 31.4 బ్రి లియన్‌ డాలర్లుగా ఉంది. అమెరికా చేసే అప్పుల మొత్తం దీని కంటే ఎక్కువగా ఉండేందుకు వీలులేదు. జనవరిలోనే ప్రభుత్వం ఈ రుణ సీలింగ్‌ పరిమితిని దాటేసింది. ప్రత్యేక చర్యల ద్వారా ఆర్ధిక శాఖ నిధులు సమకూర్చుతున్నది. రుణ పరిమితి పెంచకుంటే ప్రభుత్వం చేసే చెల్లింపుల పై ప్రభావం పడే అవకాశం ఉంది. ఫలితంగా ఆర్ధిక సంక్షోభం పెద్దదవుతుంది. ఆర్ధిక వ్యవస్థ వేగంగా పతనం అయ్యే ప్రమాదం ఉంటుంది. సకాలంలో రుణాల వడ్డీలు చెల్లించకుంటే దివాలాకు దారితీస్తుంది ఏజెన్సీలు అమెరికా క్రెడిట్‌ రేటింగ్‌ తగ్గిస్తాయి. దీని వల్ల కొత్త రుణాలపై అధిక వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. రిటైల్‌ రుణాల రేట్లు పెరుగుతాయి.

యావత్‌ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసించే అమెరికా స్వయంగా సంక్షోభంలో చిక్కుకుంది. కోవిడ్‌ తీవ్రత తగ్గడంతో ఆర్థిక వ్యవస్థ మళ్లి గాడిలో పడుతుందని అంతా అనుకున్నారు. అయితే అలా జరగలేదు. అమెరికాలో తాజాగా బ్యాంకింగ్‌ రంగంలో తీవ్ర సంక్షోభం నెలకొన్న పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇటీవల రెండు ప్రధాన బ్యాంకులు దివాళా తీశాయి. సిలికాన్‌ వ్యాలీ బ్యాంకుకు తాళాలు పడ్డ సంఘటన నుంచి జనం కోలుకోకముందే సిగ్నేచర్‌ బ్యాంక్‌ కూడా దివాళా తీసింది. సిగ్నేచర్‌ బ్యాంక్‌ను ది ఫెడరల్‌ డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ స్వాధీనం చేసుకుంది. న్యూయార్క్‌ కేంద్రంగా పని చేస్తోన్న సిగ్నేచర్‌ బ్యాంక్‌ ఎక్కువగా కృత్రిమ విలువ కలిగిన క్రిఎ్టో డిపాజిట్లను కలిగి ఉండటమే ఇందుకు కారణమని తెలుస్తోంది. సిగ్నేచర్‌ బ్యాంకు అంటే చిన్నా చితకా బ్యాంక్‌ కాదు. 2022 డిసెంబర్‌ ముగింపు నాటికి భారతీయ కరెన్సీలో దాదాపు తొమ్మిది లక్షల కోట్ల రూపాయలకు పైగా ఆస్తులు కలిగి ఉంది సిగ్నేచర్‌ బ్యాంక్‌. ఆస్తులతో పాటు దాదాపు 7.30 లక్షల కోట్ల రూపాయల మేరకు సిగ్నేచర్‌ బ్యాంకులో డిపాజిట్లు ఉన్నాయి. అయితే డిపాజిట్‌దారులు తమ సొమ్మును వెనక్కి తీసుకోవడానికి వీలుగా తాత్కాలికంగా బ్రిడ్జి బ్యాంక్‌ను ఏర్పాటు చేశారు బ్యాంక్‌ అధికారులు. రెండు ప్రముఖ బ్యాంకులు దివాళా తీయడాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంది అమెరికా ప్రభుత్వం. కానీ ఇలాంటి చర్యలు తీసుకుంటున్న సమయంలోనే ఫస్ట్‌ రిపబ్లిక్‌ బ్యాంక్ మూతపడింది. సిగ్నేచర్‌ బ్యాంక్‌, సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌లు మార్చి నెలలో వెంటవెంటనే పతనంకావడంతో డిపాజిట్‌దార్లలో ఆందోళన పెరిగి ఫస్ట్‌ రిపబ్లిక్‌ నుంచి భారీగా డిపాజిట్లు ఉపసంహరించుకున్నారు.

యూఎస్‌లో పెద్ద బ్యాంక్‌ల్లో గత ఏడాది చివరినాటికి ఫస్ట్‌ రిపబ్లిక్‌ది 14 వ ర్యాంక్‌. 8 రాష్ర్టాల్లోని 84 ఫస్ట్‌ రిపబ్లిక్‌ బ్యాంక్‌ శాఖలు జేపీ మోర్గాన్‌ ఛేజ్‌ బ్యాంక్‌ శాఖల్లా రీఓపెన్‌ అవుతాయని, డిపాజిటర్లు వారి డిపాజిట్లను ఉపయోగించుకోవచ్చని ఫెడరల్‌ డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ తెలిపింది. రెండు ప్రముఖ బ్యాంకులు ఒకదాని తరువాత మరొకటి దివాళా తీయడాన్ని ఇటీవలి కాలంలో అమెరికాలో సంభవించిన రెండో అతి పెద్ద షట్‌డౌన్‌గా పేర్కొంటున్నారు ఆర్థిక రంగ నిపుణులు. అమెరికా బ్యాంకింగ్‌ రంగంలో అతిపెద్ద సంక్షోభం 2008 సంవత్సరంలో వచ్చింది. ఆ ఏడాది లెమాన్‌ బ్రదర్స్‌ చేతులెత్తేసింది. లెమాన్‌ బ్రదర్స్‌ సంస్థ దివాళా తీసిన తరువాత అమెరికాతో సహా ప్రపంచం మొత్తం ఆర్థిక మాంద్యం ఏర్పడింది. అనేక దేశాల్లో ఆర్థిక వ్యవస్థ ఘోరంగా దెబ్బతిన్నది. మాంద్యంపై ముందుగానే హెచ్చరించిన లాయిడ్‌ బ్లాంక్‌ఫెయిన్‌ అనే ఆర్థిక వేత్త అమెరికా ప్రజలు, ఆర్థిక కంపెనీలు మాంద్యాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని మానసికంగా రెడీ చేశారు. పేక మేడలాంటి ఆర్థిక వ్యవస్థలో ఏదోనా మధ్యలో ఒకటి జారిపోతే ఆటోమేటిక్‌గా అన్నీ జారిపోతాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆమెరికాకు తమ ఆర్థిక వ్యవస్థకు సవాల్ గా మారింది.

అమెరికాలో ఆర్థిక మాంద్యం అంటూ వస్తే ఆ ప్రభావం అనేక దేశాలపై తప్పకుండా పడుతుంది. అమెరికా నుంచి పెట్టబడులు తగ్గుతాయి. అంతేకాదు అనేక రంగాలపై దీని ప్రభావం ఉంటుంది. 2008లో అమెరికాలో ఆర్థిక మాంద్యం వచ్చింది. మొదట బ్యాంకింగ్‌ రంగాన్ని సంక్షోభం ఆవహించింది. ఆ తరువాత టోటల్‌గా ఆర్థిక వ్యవస్థకు విస్తరించింది. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. కోవిడ్‌ తరువాత అమెరికాలో సప్లయ్‌ చెయిన్‌ వ్యవస్థ దెబ్బతిన్నది. మాంద్యం నుంచి అనేక దేశాలు కోలుకుంటున్న దశలో ఉక్రెయిన్‌పై రష్యా సైనిక దాడులు ప్రారంభమయ్యాయి. దీంతో రష్యా దాడుల ప్రభావం ఆయా దేశాలపై పడింది. ఫలితంగా అనేక దేశాల్లో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకాయి. ఆర్థిక మాంద్యం పేరుతో అమెజాన్‌, మైక్రోసాప్ట్‌, ట్విట్టర్‌ వంటి ప్రపంచవ్యాప్తంగా పేరొందిన అనేక టెక్‌ సంస్థలు పెద్ద సంఖ్యలో ఉద్యోగులను ఇంటికి పంపించాయి. సర్వీస్‌ సెక్టార్‌ దెబ్బతింటే దానిపై ఆధారపడ్డ అనేక పరిశ్రమలు అంటే ఫుడ్‌ ఇండస్ట్రీ, షాపింగ్‌ ఇండస్ట్రీ, హాస్పిటాలిటీ ఇండస్ట్రీ అన్నీ దెబ్బతింటాయి. అంతిమంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఘోరంగా దెబ్బతినడం ఖాయంగా కనిపిస్తోంది. అంటే ఓ రకంగా ఆర్థిక ముప్పు ప్రపంచం మొత్తానికి అమెరికా వైపు నుంచి ముంచుకొస్తోంది. దీన్ని ఎలా అధిగమించాలన్నది నిపుణులు, ప్రభుత్వాలు నిర్ణయించుకోవాల్సి ఉంది. లేకపోతే మొదటికే మోసం వస్తుంది.