బీజేపీ నిర్మించుకుంది పేక మేడేనా.. రాజకీయ వాస్తవం ఇదే

By KTV Telugu On 18 May, 2023
image

భారతీయ జనతా పార్టీ వరుసగా మూడో సారి అధికారంలోకి వస్తుందని ఎక్కువ మంది నమ్ముతున్నారు. ఉత్తరాది హిందీ చానెళ్లు కొన్ని సర్వేలను కూడా ప్రకటిస్తున్నాయి. మరోసారి మూడు వందల వరకూ సీట్లు బీజేపీకి వస్తాయని అంటున్నాయి. బీజేపీ ప్రభావం ఎలా ఉందో చెబుతూ మ్యాపులు రిలీజ్ చేస్తున్నారు. నిజానికి తరచి చూస్తే బీజేపీ బలం చాలా కొద్ది రాష్ట్రాలకే పరిమితమైంది. లోతైన విశ్లేషణ చేస్తే బీజేపీ ఇంత బలహీనంగా ఉండి కూడా ఎందుకు ఇంత బలంగా ప్రొజెక్ట్ అవగలుగుతుంది అనే సందేహం వస్తుంది. ఇప్పుడు ఉన్న రియాలిటీ ప్రకారం చూస్తే బీజేపీ సొంత బలంతో అధికారంలో ఉన్నది కేవలం ఆరు రాష్ట్రాల్లోనే.

సోషల్ మీడియాలో కొన్ని మ్యాప్‌లు ఎన్నికల సమయంలో వైరల్ అవుతూ ఉంటాయి. ఏయే రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉందో చెబుతూ ఆ మ్యాప్ ఉంటుంది. దాన్ని చూస్తే మొత్తం కాషాయరంగులోనే ఉంటుంది. కానీ నిజం ఏమిటంటే దేశంలో ఉన్న మొత్తం 29 రాష్ట్రాల్లో బీజేపీ అదికారంలో సొంత బలంతో నెట్టుకొస్తున్నది కేవలం ఆరు అంటే ఆరు రాష్ట్రాల్లో. నిన్నటిదాకా ఏడు రాష్ట్రాల్లో అధికారంలో ఉండేది. కానీ కర్ణాటక ఓటమి తర్వాత అది ఆరుకు పడిపోయింది. మిత్రపక్షాలతో కలిసి మరో తొమ్మిది రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. అంటే మొత్తంగా బిజెపి అధికారం 15 రాష్ట్రాల్లోనే మిగిలింది. సొంత బలంతో 6 రాష్ట్రాల్లో మిత్రపక్షాలతో 9 రాష్ట్రాల్లో బిజెపి ప్రభుత్వం నడుస్తోంది. దక్షిణ భారతదేశంలోని ఏ రాష్ట్రంలోనూ బిజెపి ప్రభుత్వంలేదు. ఈశాన్య రాష్ట్రాల్లో బిజెపి అధికారం ఉన్నా అక్కడ ఉన్న బిజెపియేతర ప్రభుత్వాలను అడ్డదారుల్లో కూల్చి అధికారమెక్కినవే అధికం.

2014లో బీజేపీ అధికారంలోకి వచ్చాక జరిగిన ప్రతీ రాష్ట్రంలోనూ గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నించారు. ముఖ్యంగా హిందీ రాష్ట్రాల్లో గెలుపును వదిలి పెట్టలేదు. కుదరని చోట్ల ప్రభుత్వాలను కూల్చి తాము సొంతం చేసుకున్నారు. కానీ 2018 నుంచి రాత మారిపోయింది. బీజేపీకి కంటి తుడుపు విజాయలు మాత్రమే లభిస్తున్నాయి. మే 2018 నుంచి మే 2023 వరకు అంటే ఐదేళ్లలో 31 రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఇందులో అందులో ఆరు రాష్ట్రాల్లో మాత్రమే బిజెపి సంపూర్ణ మెజారిటీ సాధించింది. మరో 16 రాష్ట్రాల్లో ఇతరుల మద్దతుతో ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం దేశంలో 30 శాసన సభలు ఉన్నాయి. వీటిల్లో రెండు కేంద్రపాలిత ప్రాంతాలైన ఢిల్లీ పుదుచ్చేరి కూడా ఉన్నాయి. కర్ణాటక ఫలితాల తర్వాత 15 రాష్ట్రాల్లో బిజెపి అధికారంలో ఉంది. ఇందులో ఒక్కటి దక్షిణ భారతదేశంలో ఉన్న రాష్ట్రాలు లేవు. 2018లో బిజెపి 21 రాష్ట్రాలను దేశ జనాభాలో 71శాతం మందిని పాలించింది. ఇప్పుడు ఆ జనాభా 45 శాతానికి తగ్గిపోయింది. అంటే బీజేపీ క్రేజ్ ఎలా తగ్గిపోతోందో అర్థం చేసుకోవచ్చు.

భారత దేశంలో ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. అక్కడ చిన్న చిన్న రాష్ట్రాలు ఉంటాయి. మొత్తం ఎనిమిది రాష్ట్రాలు ఉన్నాయి. అక్కడ అత్యధికులు క్రిస్టియన్ ముస్లిం ఇతర తెగలు ఉంటారు. వీరంతా సహజంగా బీజేపీకి వ్యతిరేకులు. కానీ దేశమంతా ఓ రాజకయం ఈశాన్య రాష్ట్రాల్లో మరో రాజకీయం బీజేపీ చేస్తుంది. అంతకు ముందు అసలు పట్టు లేని ఈశాన్య ప్రాంతంలో కేంద్రంలో అధికారంలోకి వచ్చాక పార్టీ నేతల్ని ఫిరాయింప చేసి బలోపేతం చేసుకున్నారు. ఈశాన్యంలోని 8 రాష్ట్రాల్లో మొత్తం 498 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో బిజెపి నుంచి 206 మంది ఎమ్మెల్యేలు అంటే 41.3% ఉన్నారు. ఈశాన్య రాష్ట్రాల నుంచి మొత్తం 25 మంది ఎంపిల్లో బిజెపికి 15 మంది ఎంపిలు అంటే 60% ఉన్నారు. ఒక్క మిజోరమ్ మినహా అన్ని చోట్లా బీజేపీ ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉంది.

ఈశాన్యలో ఓటర్లు చాలా తక్కువగా ఉంటారు. వారిని బీజేపీ ఎలాగైనా ప్రభావితం చేయగలదు. కానీ ఉత్తరాదిలో అది సాధ్యం కాదు. ఉత్తర భారతదేశంలో హర్యానా, ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌లు బిజెపి పాలనలో ఉన్నాయి. ఇక్కడ మొత్తం 818 మంది ఎమ్మెల్యేల్లో బిజెపి నుంచి 377 మంది అంటే 46% ఉన్నారు. మొత్తం 189 ఎంపిల్లో బిజెపికి 98 మంది అంటే 52% ఉన్నారు. యూపీలో బీజేపీ తిరుగులేని ఆధిక్యం సాధిస్తోంది. అక్కడ యోగి ఆదిత్యనాథ్ రాష్ట్రంపై పూర్తి పట్టు సాధించారు. ఇక ఉత్తరాఖండ్, హర్యనాల్లో బీజేపీ పరిస్థితి మెరుగ్గా ఉందని చెప్పలేము. మధ్యప్రదేశ్‌లో బిజెపి ప్రభుత్వం, ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉన్నాయి. ఇక్కడ మొత్తం 420 మంది ఎమ్మెల్యేల్లో 144 మంది బిజెపి నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అంటే 34% మంది ఉన్నారు. మొత్తం ఎంపీలన్నీ బీజేపీకే ఉన్నాయి. కానీ ఇక్కడ వచ్చే ఎన్నికల్లో పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పడం కష్టం. డిసెంబర్‌లో మధ్య ప్రదేశ్ లో ఎన్నికలు జరగనున్నాయి. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చి అక్కడ శివారాజ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కర్ణాటకలోనూ అదే చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ పునాదులు కదిలిపోతాయన్న ప్రచారం జరుగుతోంది.

బీహార్‌, బెంగాల్‌, జార్ఖండ్‌, ఒడిశా రాష్ట్రాల్లో బీజేపీకి గడ్డు పరిస్థితులే ఉన్నాయి. బీహార్‌లో మహాకూటమి ప్రభుత్వం, పశ్చిమ బెంగాల్‌లో టిఎంసి ప్రభుత్వం, జార్ఖండ్‌లో జెవిపి ప్రభుత్వం ఉంటే ఒడిశాలో బిజెడి ప్రభుత్వం ఉన్నాయి. అంటే తూర్పు భారతదేశంలో ఎక్కడా బిజెపి ప్రభుత్వం లేదు. మహారాష్ట్ర, గుజరాత్‌, రాజస్థాన్‌ లలో ఒక్క గుజరాత్‌లో మాత్రమే ఆధిపత్యం చూపిస్తోంది. మహారాష్ట్రలో షిండే నేతృత్వంలోని శివసేనతో బిజెపి ప్రభుత్వం ఉంది. కానీ ప్రభుత్వ మార్పు వ్యవహారం ఆ పార్టీపై తీవ్ర ప్రభావం చూపించడం ఖాయంగా కనిపిస్తోంది. గుజరాత్‌లో బిజెపికి, రాజస్థాన్‌లో కాంగ్రెస్‌కు పూర్తి మెజారిటీ ప్రభుత్వం ఉంది. ఇక్కడ వచ్చే ఎన్నికల్లో ఎన్ని పార్లమెంట్ సీట్లు సాధిస్తారో బీజేప నేతలకే అంతుబట్టడం లేదు.

కర్ణాటక ఓటమి తర్వాత దక్షిణాదిలో బిజెపి ప్రభుత్వం లేదు. దక్షిణ భారతదేశంలోని 5 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం ఉన్నాయి. ఇక్కడ మొత్తం 130 మంది లోక్‌సభ ఎంపీలు వచ్చారు. వీరిలో బిజెపికి 29 మంది అంటే 22% మాత్రమే ఉన్నారు. వీరిలో కర్ణాటక నుంచి 25 మంది, తెలంగాణ నుంచి నలుగురు ఎంపీలు ఉన్నారు. దక్షిణ భారతదేశంలో మొత్తం 923 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇందులో కేవలం 95 మంది బిజెపి నుంచి ఉన్నారు. అంటే కేవలం 10 శాతం మంది మాత్రమే ఉన్నారు. ర్వత్రికానికి ముందే దక్షిణాది రాష్ట్రాలో తొలిదశగా కర్ణాటకలో అడుగుపెట్టాలని వేసిన బిజెపి వ్యూహం కాస్త బెడిసికొట్టింది. ఈ గణాంకాలను నిశితంగా పరిశీలిస్తే బీజేపీ అజేయ శక్తి కాదని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. అయితే బీజేపీ బలహీనతల్ని క్యాష్ చేసుకునే ప్రతిపక్ష పార్టీనే ఇంకా కనిపించడం లేదని అనుకోవచ్చు.