కర్నాటక ఎన్నికల ఫలితాల ప్రకంపనలు మొదలయ్యాయి. సాటి దక్షిణాది రాష్ట్రమైన తెలంగాణాపైనా దాని ప్రభావం ఉంటుందని కాంగ్రెస్ నేతలు గంపెడు ఆశలు పెట్టుకున్నారు. అయితే రాజకీయ చాణక్యుడు కేసీయార్ తనదైన శైలిలో పాచికలు విసురుతున్నారు. తెలంగాణా కాంగ్రెస్ కు దిమ్మతిరిగేలా బి.ఆర్.ఎస్. సభలో పార్టీ నేతలకు దిశా నిర్దేశనం చేశారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా బి.ఆర్.ఎస్.కు 95 నుండి 105 స్థానాలు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. దాంతో పార్టీ నేతల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేశారు. కర్నాటకలో ఘన విజయం సాధించి అధికారాన్ని చేజిక్కించుకుంది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణాలోనూ అటువంటి విజయాన్నే రిపీట్ చేస్తామని తెలంగాణా కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇప్పటికే ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. ఇక తెలంగాణాలో పాలక పక్షంతో పాటు బిజెపి నుంచి కూడా కాంగ్రెస్ లోకి వలసలు మొదలవుతాయని ఇతర పార్టీల నేతలు గాంధీ భవన్ ఎదుట బారులు తీరుతారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.
బి.ఆర్.ఎస్.కు గుడ్ బై చెప్పిన పొంగులేటి శ్రీనివాస రెడ్డి, జూపల్లి కృష్ణారావులు సైతం కాంగ్రెస్ లో చేరుతున్నారని ప్రచారం జరుగుతోంది. కర్ణాటక పరాజయంతో తెలంగాణా బీజేపీ సైలెంట్ అయిపోయింది. బి.ఆర్.ఎస్. శ్రేణులపై కర్ణాటక ప్రభావం పడకుండా పార్టీ అధినేత కేసీఆర్ అత్యంత చాకచక్యంగా పావులు కదుపుతున్నారు. పార్టీ నేతలతో భేటీ నిర్వహించిన కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి ప్రసంగిస్తూ పలు సూచనలు చేశారు. కర్నాటక ఎన్నికల ఫలితాలను పక్కన పెట్టేయండి. వాటి గురించి చర్చించకండి. అక్కడ ఎవరు గెలిచినా ప్రజలకు ఒరిగేదేమీ ఉండదు అని సూచించారు కేసీయార్. ప్రతీ ఎమ్మెల్యే కూడా నెలలో కనీసం 21 రోజుల పాటు ప్రజల్లోనే ఉండేలా కార్యక్రమాలు రూపొందించుకోవాలని ఆదేశించారు. ఎక్కడికక్కడ రైతులను చెరువుల దగ్గరకు పిలిచి అక్కడే వనభోజనాలు ఏర్పాటు చేయాల్సిందిగా కేసీయార్ చెప్పారు. పనిలో పనిగా బి.ఆర్.ఎస్. ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలను వారికి తెలియ జెప్పాలని సూచించారు. కర్నాటకలో గెలిచిన కాంగ్రెస్ పార్టీకి తెలంగాణాలో అంత సీన్ లేదని స్పష్టం చేసిన కేసీయార్ దేశానికి ద్రోహం చేసిందే కాంగ్రెస్ పార్టీ అని దుయ్యబట్టారు. 70 ఏళ్లలో దేశానికి కాంగ్రెస్ చేసిందేమీ లేదని తూర్పారబట్టారు. వచ్చే ఎన్నికల్లో సిట్టింగులందరికీ టికెట్లు ఇస్తామని భరోసా ఇవ్వడం ద్వారా ఎమ్మెల్యేల్లో ఉత్సాహం నింపారు. టికెట్ రాదేమోనన్న బెంగతో డైలమాతో ఉన్న వారికి ఊరట నిచ్చారు.
అదే సమయంలో బయటి పార్టీలకు వలసలు పోకుండా తెలివిగా అడ్డుకట్ట వేశారని రాజకీయ పండితులు భావిస్తున్నారు. ఇది చాలా వ్యూహాత్మకంగా చేసిన వ్యాఖ్య అయి ఉండచ్చని భావిస్తున్నారు. ఏడాదికి పైగా కేసీయార్ కేంద్రంలోని బిజెపిని తిట్టి పోస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను ఏకి పారేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీని ఏ విషయంలోనూ విడిచి పెట్టడం లేదు. కేంద్రమంత్రులకూ చుక్కలు చూపించేలా ప్రసంగాలు చేస్తున్నారు. ఇంతకాలం తెలంగాణాలో అసలు కాంగ్రెస్ పార్టీ అన్నది ఒకటి ఉందన్న విషయమే తెలీనట్లు బి.ఆర్.ఎస్.-బిజెపిల మధ్యనే విమర్శలు ప్రతివిమర్శలూ సాగుతూ వచ్చాయి. చాలా కాలం తర్వాత మొదటి సారిగా కేసీయార్ కాంగ్రెస్ పార్టీపై ధ్వజం ఎత్తడం విశేషం. తమకి ప్రధాన పోటీ దారు బిజెపియే అని ఇంతకాలం భావించి ఉండడం వల్లనే బిజెపిని టార్గెట్ చేసుకుని ఉండచ్చని ఇపుడు కర్నాటక ఫలితాల తర్వాత కాంగ్రెస్ లో జోష్ పెరిగింది కాబట్టి కాంగ్రెస్ మరీ రెచ్చిపోకుండా అడ్డుకట్ట వేసేందుకే ఇపుడు కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తూ ఉండచ్చని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ పై లోక్ సభ సెక్రటేరియట్ అనర్హత వేటు వేసినపుడు కూడా కేసీయార్ బిజెపిని విమర్శించి రాహుల్ గాంధీకి సంఘీభావం వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ తో బి.ఆర్.ఎస్. అవగాహన కుదుర్చుకుంటుందేమోనని అనుమానాలు వ్యక్తం అయ్యాయి కూడా. అయితే అటు కాంగ్రెస్ కానీ ఇటు బి.ఆర్.ఎస్. కానీ రెండు పార్టీల మధ్య ఎలాంటి ఒప్పందాలు లేవని స్పష్టం చేశాయి.
రాహుల్ గాంధీ కర్నాటక ఎన్నికల ప్రచారనికి వెళ్తూ శంషాబాద్ విమానాశ్రయంలో కొద్ది సేపు తెలంగాణా కాంగ్రెస్ నేతలతో భేటీ అయినపుడు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ బి.ఆర్.ఎస్. తో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అటు బి.ఆర్.ఎస్. నాయకత్వానికి, ఇటు కాంగ్రెస్ శ్రేణులకు స్పష్టమైన సంకేతాలు ఇవ్వడానికే రాహుల్ గాంధీ అలా మాట్లాడి ఉంటారని రాజకీయ పరిశీలకులు భావించారు. కాంగ్రెస్-బి.ఆర్.ఎస్. లు కలిసి పోటీ చేస్తాయన్న ప్రచారం రావడానికి కారణాలు లేకపోలేదు. సీనియర్ కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 50 స్థానాలు రావచ్చునని జోస్యం చెప్పారు. అధికారంలోకి రావడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ కంటే తక్కువ స్థానాలు వస్తాయన్నది ఆయన వ్యాఖ్యల సారాంశం. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ లౌకిక వాద పార్టీలతోనే పొత్తులు పెట్టుకోవచ్చునని కూడా కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. అంటే బి.ఆర్.ఎస్. తో పొత్తు పెట్టుకునే అవకాశాలు ఉన్నాయని పరోక్షంగా చెప్పినట్లయ్యింది. ఇది సెల్ఫ్ గోల్ వేసుకోవడమే అని కోమటిరెడ్డిపై కాంగ్రెస్ సీనియర్లు మండి పడ్డారు. తెలంగాణా కాంగ్రెస్ నేతలు దీనిపై హై కమాండ్ కు ఫిర్యాదు కూడా చేశారు. ఆ తర్వాత కోమటిరెడ్డి తన వ్యాఖ్యలను సమర్ధించుకునే ప్రయత్నం చేసినా అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. అయితే కాంగ్రెస్ పార్టీ అదృష్టం కొద్దీ ఇపుడు కర్ణాటకలో తిరుగులేని విజయం సాధించడంతో తెలంగాణా కాంగ్రెస్ లోనూ ఉత్సాహం ఉరకలు వేస్తోంది.
అయితే కర్నాటక ఎన్నికల ఫలితాల ఆధారంగా తెలంగాణాలో రానున్న ఎన్నికల్లో ఫలితాలు ఉండవని రాజకీయ పండితులు అంటున్నారు. కర్నాటకలో అక్కడి స్థానిక సమస్యలు, అంశాల ఆధారంగానే అక్కడ బిజెపి పరాజయం పాలైందని ఆ పరిస్థితులు తెలంగాణాలో లేవని బి.ఆర్.ఎస్. నేతలు అంటున్నారు. తెలంగాణాలో బి.ఆర్.ఎస్. పాలన పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని దళిత బంధు, రైతు బంధు పథకాలు దేశానికే ఆదర్శమని పాలక పక్ష నేతలు చెబుతున్నారు. ఈ పథకాల గురించే జనంలోకి తీసుకెళ్లాలని కేసీయార్ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశనం చేశారు. కేసీయార్ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన సమయం చాలా కీలకమైనది. సరియైన సమయంలో సరియైన నిర్ణయం తీసుకోవడం అంటే ఇదే అంటున్నారు రాజకీయ పండితులు. బి.ఆర్.ఎస్. నేతల్లో ఎక్కడైనా అపోహలు ఉంటే అవన్నీ కూడా కేసీయార్ ప్రసంగంతో పటా పంచలైపోయి ఉంటాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. పార్టీ గెలుపుపై ధీమా కలిగించడంతో పాటు టికెట్ గురించి ఆందోళన చెందవద్దని సంకేతం ఇవ్వడం ద్వారా కేసీయార్ ఒకే దెబ్బకు రెండు పిట్టల్ని కొట్టినట్లయ్యిందని వారంటున్నారు. కర్నాటక ఫలితాలతో డీలా పడ్డ బిజెపి పైకి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తోంది. కర్నాటక ఫలితాల ప్రభావం తెలంగాణాపై ఉండదని తెలంగాణాలో అధికారంలోకి రాబోయేది తామేనని తెలంగాణా బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ఇప్పటికే పదే పదే చెప్పుకొస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇక గేర్ మార్చి దూసుకుపోవాలని భావిస్తోంది. జూన్ లో గాంధీల త్రయం హైదరాబాద్ రానుంది. ఆ పర్యటన నుంచి ఎన్నికల వరకు నిరాటంకంగా జనంలోనే ఉంటూ అధికారాన్ని సొంతం చేసుకోవాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. జూన్ రెండున తెలంగాణా ఆవిర్భావ దినోత్సవం. ఆ రోజుకి తెలంగాణా ఏర్పడి తొమ్మిదేళ్లు పూర్తవుతుంది. ఆరోజు నుండి తెలంగాణా దశాబ్ధి ఉత్సవాలను నిర్వహించాలని కేసీయార్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ ఉత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించనున్నారు. ఎన్నికల ఏడాది కావడంతో తెలంగాణా సాధించిన పార్టీగా బి.ఆర్.ఎస్.ను ప్రజల గుండెల్లోనే ఉంచేలా ఉత్సవాలు నిర్వహించాలన్నది ఆలోచన. జిల్లాల వారీగా ఉత్సవాలను ఆయా జిల్లాల నేతలు పర్యవేక్షించాలని కేసీయార్ ఆదేశించారు. జూన్ రెండున జరిగే పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి ఎమ్మెల్సీలు, ఎంపీలను సైతం పిలవాలని కేసీయార్ సూచించారు. పార్టీలో ఎవరెవరు ఏమేం చేస్తున్నారో అన్నీ పార్టీ గమనిస్తూనే ఉంటుందని పేర్కొన్న కేసీయార్ కొంతమంది ఎమ్మెల్యేలు ఎన్ని సార్లు సూచనలు చేసినా వాటిని పాటించడం లేదని, సరిగ్గా పనిచేయడం లేదని అసహనం వ్యక్తం చేశారు. అటువంటి కొద్దిమందికి మాత్రం టికెట్ ఇచ్చే ప్రసక్తి ఉండదన్నారు. హైదరాబాద్, నల్గొండ జిల్లాల ఎమ్మెల్యేలను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. మొత్తానికి ఎన్నికల ఏడాదిలో కేసీయార్ పార్టీని సమాయత్తం చేసేందుకు శంఖం పూరించారు.