దేశమంటే ‘మోదీ’ కాదోయ్

By KTV Telugu On 18 May, 2023
image

బిహార్ సీఎం నితీశ్ కుమార్ కాలిగి బలపం కట్టుకు తిరుగుతున్నాయి. మమతా దీదీ కూడా షరతులు వర్తిస్తాయని అంటూనే కాంగ్రెస్ తో కలిసిపనిచేసేందుకు సిద్ధమంటున్నారు. యూపీ మాజీ సీఎం అయిన పవర్ ఫుల్ సమాజ్ వాదీ పార్టీనేత అఖిలేష్ యాదవ్ ఇప్పుడు దారికి వచ్చినట్లే కనిపిస్తున్నారు. కాంగ్రెస్ తో కలిసి పనిచేసందుకు ఎలాంటి ఇబ్బందులు లేవని ప్రకటించేశారు ఇదీ ఒక కోణం. మోదీ నేతృత్వ బీజేపీ-ఎన్డీయే ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు విపక్షాలు ఎంచుకున్న మార్గం అది కావచ్చు. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించిన తర్వాత ప్రాంతీయ శక్తులకు క్లారిటీ వచ్చి ఉండొచ్చు. చాలా మంది విశ్లేషకుల ఊహకు అందిన కోణం మరోటి ఉంది. అదే బీజేపీ పతనం. మోనార్క్ గా తమను తాము ఊహించుకునే మోదీ, అమిత్ షా నాయకత్వానికి గండి పడిందీ కర్ణాటక నుంచి కాదని చాలా రోజులుగా చాపకింద నీరులా బీజేపీ ప్రభ మసకబారిపోతోందని తెలుస్తూనే ఉంది. 2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ మిషన్ 350 అంటూ ప్రచారం మొదలు పెట్టుకోవాల్సిన టైమ్ లోనే కర్ణాటక ఓటర్లు దెబ్బకొట్టారు. జేడీఎస్ అనే అవకాశవాద పార్టీని పక్కకు నెట్టి ముఖాముఖి పోటీగా మార్చి చివరకు బీజేపీని కన్నడ దేశం నుంచి వెళ్లగొట్టారు. ఈ క్రమంలో దక్షిణాదిలో ఎక్కడా బీజేపీ లేకుండా పోయింది. రెండు కాళ్లు గాల్లో పెట్టుకోవడం తప్ప నేలమీద నిలబడటం చేతకాని కమలం పార్టీ నేతలు ఇప్పుడు నేలమీద నడుస్తున్నారు.

బీజేపీకి ఇప్పుడు ఉత్తరాఖండ్, హరియాణాలోని సంకీర్ణం, ఉత్తరప్రదేశ్, అధికారాన్ని కాంగ్రెస్ నుంచి లాగేసుకున్న మధ్యప్రదేశ్, అధికారాన్ని శివసేన నుంచి లాగేసుకున్న మహారాష్ట్ర, మోదీ స్వరాష్ట్రం గుజరాత్ మాత్రమే ఉన్నాయి. ఈశాన్య రాష్ట్రాల కూడా కమలం ఖాతాలో ఉన్నప్పటికీ అక్కడి పరిస్తితులు వేరు. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఈశాన్య పార్టీలు అటు వైపు ఉంటూ తమకు కావాల్సిన ప్రయోజనాలు పొందుతాయి. రేపు కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఈశాన్య రాష్ట్రాలు అటు వైపు వెళ్లిపోతాయి. బీజేపీ పరిస్థితి ఓసారి పరిశీలిస్తే దేశంలోని 43 శాతం భూభాగం ఆపార్టీ ఆధీనంలో ఉంది. మిగతా  57 శాతం విపక్ష పార్టీలు లాగేసుకున్నాయి. దేశ జనాభాలో 44 శాతం బీజేపీ పాలనలో ఉంటే 56 శాతం బీజేపీయేతర పార్టీల పాలనలో ఉన్నాయని చెప్పక తప్పదు. ఇది ప్రస్తుత పరిస్థితి. ఈ ఏడాది ఆఖరుకు జరిగే కీలక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో పరిస్థితి ఎలా ఉంటుందో. అక్కడ బీజేపీకి అధికారం దక్కకపోతే మోదీ నాయకత్వంపై నిజంగానే అనుమానాలు వస్తాయి. విపక్షాలు బలం కాదు, అదీ మోదీ చేతగానితనమన్న వాదన బలపడి 2024 నాటికి బీజేపీకి గడ్డు కాలం తప్పదు. కర్ణాటక ఫలితాలు అనేక ప్రశ్నలను కూడా ఆవిష్కరించాయి కర్ణాటక ఫలితాల అనుభవంతో తాను ఇచ్చిన కాంగ్రెస్ విముక్త భారత్ నినాదం సరైనదా అని బీజేపీ పునరాలోచించాల్సిన తరుణం ఆసన్నమైంది.

కన్నడ ఓటర్లు ఇచ్చిన ఊపిరితో కాంగ్రెస్ ఇతర రాష్ట్రాల్లో పునరుత్థానం చెందే ప్రయత్నాలు చేయకమానదు. మరో వైపు పలు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు కూడా తమ అస్తిత్వాన్ని నిలబెట్టుకునేందుకు పోరాడక తప్పదు. దీనితో 2024 ఎన్నికలు అత్యంత సంక్లిష్టంగా రసవత్తరంగా ఉంటాయనడంలో సందేహం లేదు. మోదీ అమ్ముల పొదిలోని అస్త్రాలన్నీ అయిపోయిన పరిస్థితులు ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత రాజకీయాల్లో తన పాత్రను, ముఖ్యంగా తన పార్టీ పాత్రను మోదీ అమిత్ షా బేరీజు వేసుకోవాలి. కాంగ్రెస్ ప్రస్తుతం దూకుడు మీద ఉండొచ్చు. కాకపోతే ఆ పార్టీలో ఆంతర్గత సంఘర్షణ బాగా పెరిగిపోతోంది. సామంత రాజులు స్వాతంత్య్రం ప్రకటించుకున్నట్లుగా రాష్ట్రాల్లో ఎవరికి వారు మోనార్కులుగా తయారవుతున్నారు. ఆ పరిస్థితి నుంచి కాంగ్రెస్ బయటపడటమెలా ఉన్నా కర్ణాటక ఫలితాలతో బీజేపీ ముఖ్యంగా మోదీ అమిత్ షా నేర్చుకోవాల్సిన పాఠాలు చాలానే ఉన్నాయి. దేశమంటే మోదీ మాత్రమేనన్న ఫీలింగ్ నుంచి ప్రధానమంత్రి బయటకు రావాలి. దేశమంటే ప్రజలన్న సంగతిని ఆయన గుర్తించాలి. మతతత్వ రాజకీయాలు, రెచ్చగొట్టే ఉపన్యాసాలు మానుకుని పరిపాలన, అభివృద్ధి, సంక్షేమం ఆధారంగా ప్రజల్లోకి వెళ్లగలిగే మార్గాలను అన్వేషించాలి. తమకే తప్ప మరెవరికీ దేశభక్తి లేదని నిందించే బూటకపు ప్రచారాన్ని మానుకోవాలి. విపక్షాలను విడగొట్టి, డబ్బులిచ్చి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే సంస్కృతికి ఇకనైనా స్వస్తి చెప్పాలి. మోదీ అంటే నియంతృత్వం కాదు ప్రజాస్వామ్యమన్న విశ్వాసం కలిగించాలి. అప్పుడు 2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ అనుకున్నది సాధించగలరు. లేని  పక్షంలో విపక్షాలు కొంతమేర ప్రయత్నించినా వాళ్లే గెలవడం  ఖాయం.