ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారం సభలో హీరోలా కనిపిస్తారు. ఆయన హవా నడుస్తున్నట్లే ఉంటుంది. నియోజకవర్గంలో మాత్రం ఏ పనీ చేయకుండా జీరోగా మిగిలిపోతున్నారన్న ఆరోపణలు పెరుగుతున్నాయి. అనుకున్నది సాధించలేక జనానికి ఏమీ చేయలేక ఆయన త్రిశంకు స్వర్గంలో కొట్టుమిట్టాడుతున్నారు. తమ్మినేని సీతారాం ఆముదాలవలస నియోజకవర్గం నుంచి 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. అధిష్టానం నిర్ణయంతో ఇష్టం లేకున్నా స్పీకర్ పదవిలో కొనసాగుతున్నారు. అయితే తమ్మినేనికి ఇపుడు ఆముదాలవలస నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. ఇచ్చిన ప్రధాన హామీల్లో ఒక్కటి కూడా నెరవేరకపోవటం నియోజకవర్గ వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల జోక్యం మితిమీరిపోవటం వంటి అంశాలు తమ్మినేనికి ప్రతికూల పరిస్ధితులను తెచ్చిపెడుతున్నాయి. 1983లో టీడీపీ ఆవిర్భావం తర్వాత తమ్మినేని సీతారాంను అనేక కీలక పదవులు వరించాయి. వివిధ శాఖలకు మంత్రిగా పని చేసిన అనుభవం తమ్మినేని సొంతం. అయితే తన రాజకీయ జీవితంలో తీసుకున్న తప్పుడు ఇర్ణయాలు కారణంగా రెండు దశాబ్ధాల పాటు ప్రత్యక్ష రాజకీయాలకు ఆయన దూరం కావాల్సి వచ్చింది. ఆయన రాజకీయ జీవితం ముగిసిపోయిందని భావిస్తున్న తరుణంలోనే తమ్మినేని వైసీపీలో చేరారు.
2019 లో గెలిచిన తర్వాత మళ్లీ తమ్మినేనికి పూర్వ వైభవం ఖాయమని ఆయన అభిమానులు భావించారు. అయితే గడచిన నాలుగేళ్లలో తమ్మినేని నియోజకవర్గంలో ఆశించిన మేర ఆయన మార్పు చూపించలేకపోయారు. దీనికి తోడు నియోజకవర్గంలో తమ్మినేనికి వ్యతిరేకంగా మూడు గ్రూపులు పని చేస్తున్నాయి. ఈసారి టిక్కెట్ ఇస్తే సహకరించలేమని తేల్చి చెప్పేస్తున్నాయి. మరోవైపు ఆముదాలవలసలో అసమ్మతి నేతలు ప్రత్యేక కార్యాయాలు ఏర్పాటు చేసుకుని మరీ సొంత కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆముదాలవలస ప్రజలకు సహకార చక్కెర కర్మాగారం ప్రధాన హామీగా ఉంటుంది. జగన్ పాదయాత్ర సమయంలో ఆముదాలవలసలో బహిరంగ సభ నిర్వహించారు. తాను అధికారంలోకి వస్తే షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తానని హామీ ఇచ్చారు. దీంతో నియోజకవర్గ ప్రజలు గంప గుత్తగా ఓట్లు వేసి సీతారాంను గెలిపించారు. నాలుగేళ్లు వైకాపా పాలన పూర్తయినా నేటికీ షుగర్ ఫ్యాక్టరీ అంశం అలానే ఉంది. స్ధానిక ఎమ్మెల్యేగా ఉన్న తమ్మినేని షుగర్ ఫ్యాక్టరీ పునః ప్రారంభం విషయంలో కనీస శ్రద్ద కనపరచటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఏపీఐఐసీ బృంధం మూతపడ్డ షుగర్ ఫ్యాక్టరీని పరిశీలించింది. తెరిపించటం సాధ్యం కాదని చెబుతూనే ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తామని చెప్పి చేతులు దులిపేసింది. దీంతో షుగర్ ఫ్యాక్టరీ అంశం కనీసం ప్రభుత్వం పరిశీలనలో కూడా లేకపోవటం నియోజకవర్గ ప్రజలను తీవ్ర అసహనానికి గురి చేస్తోంది.
ఆముదాలవలస నియోజకవర్గంలో గతంలో తమ్మినేని మార్కు రాజకీయం స్పష్టంగా కనిపించేది. అనేక కీలక మంత్రిత్వ శాఖలు నిర్వహించిన సీతారాం టీడీపీలో ఉన్న సమయంలో ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు చేపట్టారు. కానీ నాలుగేళ్లలో నియోజకవర్గంలో రాజకీయ షోలు తప్పా చేసిందేమీ లేదన్న భావన వ్యక్తమౌతోంది. ఆముదాలవలస శ్రీకాకుళం ప్రధాన రహదారి విస్తరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. స్పీకర్ ప్రతిరోజూ ఇదే రహదారిపై ప్రయాణిస్తున్నా పనులు జాప్యంపై ప్రజలు మండిపడుతున్నారు. మీడియా సమావేసాల్లో బహిరంగ సభల్లో మైకుల ముందు హావ భావాలు ప్రదర్శించే తమ్మినేని చేతల్లో మాత్రం తన సత్తా చూపించలేకపోతున్నారు. సభలో చంద్రబాబుపై తమ్మినేని ఒంటికాలి మీద లేచేవారు. ప్రతిపక్ష నేతకు మాట్లాడే అవకాశం ఇచ్చేవారు కాదు. టీడీపీ నేతలను కసిరిపారేసేవారు. ఇవన్నీ ఆయన వ్యక్తిత్వంపై ప్రభావం చూపాయి. ఆముదాలవలన జనం కూడా తమ్మినేని మర్యాదస్తుడు కాదన్న ఆలోచనలో పడిపోయారు. అలాంటి చర్యలే ఇప్పుడాయనకు ప్రతికూలాంశాలవుతున్నాయి. 2024లో ఆయన గెలిచే అవకాశాలు సన్నగిల్లుతున్నాయి.