కర్ణాటక విజయం వెనుక ముస్లిం ఓట్ ఫ్యాక్టర్

By KTV Telugu On 18 May, 2023
image

 

రకరకాల సర్వేల అంచనాలను తల్లకిందులు చేస్తూ కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ విజయాన్ని బహుశా కాంగ్రెస్ పార్టీ కూడా ఊహించి ఉండకపోవచ్చునంటున్నారు రాజకీయ పండితులు. కర్నాటకలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న బలమైన నాయకత్వం గెలిచి తీరాలన్న పంతం వారికి విజయాన్ని తీసుకురావడంలో పాత్ర పోషించాయి. పార్టీ అగ్రనేతలు డి.కె.శివకుమార్, మాజీ సిఎం సిద్ధరామయ్యలు పార్టీని ఏకతాటిపై నడిపించి జనంతో మమేకం కావడం పార్టీకి కలిసొచ్చింది. రాహుల్ గాంధీ జోడో యాత్ర ప్రియాంక గాంధీ పంచ్ లతో కూడిన ఎన్నికల ప్రచారం పార్టీకి తిరుగులేని బలాన్నిచ్చాయి. బిజెపి పాలన పట్ల ఉన్న వ్యతిరేకత సహజంగానే కాంగ్రెస్ కు అయాచిత వరంగా మారింది. అయితే వీటితో పాటు పైకి కనిపించని మరో అంశం చాలా కీలకంగా పనిచేసింది. అదే మైనారిటీ ఓటు బ్యాంకు. కర్నాటకలో ముస్లిం మైనారిటీలు జనాభాలో 13 శాతం మంది ఉన్నారు. క్రైస్తవులు రెండు శాతం మంది ఉన్నారు. ఈ రెండు వర్గాలూ కూడా ఈ ఎన్నికల్లో గంపగుత్తగా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచారు. అదే కాంగ్రెస్ ఘన విజయాన్ని తేలిక చేసిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కర్నాటకలో చాలా ఏళ్లుగా జనతాదళ్ ఎస్ కు ముస్లింలు మద్దతు నిస్తున్నారు. ఒక విధంగా ముస్లిం ఓటు బ్యాంకు జేడీఎస్ కు బలంగా ఉండేది. పాత మైసూరు ప్రాంతంలో ముస్లింలు 11 శాతం మేరకు ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఈ ప్రాంతంలో మెజారిటీ ముస్లింలు జేడీఎస్ ను కాదని కాంగ్రెస్ కు ఓటు వేశారు. అది జేడీఎస్ తో పాటు కాంగ్రెస్ కు కూడా షాకే.

ముస్లింలు ఝలక్ ఇవ్వడం వల్లనే గత ఎన్నికల్లో 37 స్థానాలు గెలుచుకున్న జేడీఎస్ ఈ సారి 19 స్థానాలకు పరిమితం కావలసి వచ్చింది. ఎప్పుడూ జేడీఎస్ కు ఓటు వేసే ముస్లింలు ఈ సారి కాంగ్రెస్ ను ఎంచుకోడానికి కారణాలు లేకపోలేదు. పొరపాటున తమ ఓటును జేడీఎస్ కు వేస్తే ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత జేడీఎస్ వెళ్లి బిజెపికి మద్దతు ఇవ్వచ్చని ముస్లింలు భయపడ్డారు. బిజెపిని రాష్ట్రంలో అధికారంలో లేకుండా చేయడమే తమ అజెండాగా ఎంచుకున్న ముస్లింలు అందుకే జేడీఎస్ ను కాదని కాంగ్రెస్ కు జై కొట్టారు. నిజానికి ముస్లిం ఓటర్లను ఒక విధంగా బిజెపి విధానాలే కాంగ్రెస్ వైపు మొగ్గు చూపేలా చేశాయంటున్నారు రాజకీయ పండితులు. కర్నాటకలోని బిజెపి ప్రభుత్వం గతంలో కాలేజీల్లో హిజాబ్ ను నిషేధించింది అది వివాదస్పదమైంది. మైనారిటీలు నిరసనలతో హోరెత్తించారు. అయితే బిజెపి ప్రభుత్వం ఆందోళనలను అణచివేసిందే తప్ప మైనారిటీల కోణంలో ఆలోచనలు చేయలేదు. ఇది చాలదన్నట్లు ముస్లింలకు ఉన్న నాలుగు శాతం రిజర్వేషన్లను   తొలగించి వాటిని లింగాయత్, వొక్కళిగలకు పంచి పెడతామని బిజెపి ప్రకటించింది. ఇది కూడా ముస్లింలకు ఆగ్రహం తెప్పించింది. టిప్పు సుల్తాన్ విషయంలోనూ బిజెపి ముస్లింలను ఇబ్బంది పెట్టేలా వ్యాఖ్యలు చేస్తూ వచ్చింది. ఇలా అయిన దానికీ కాని దానికీ బిజెపి తమని వెంటాడి వేటాడి వేధిస్తోందన్న భావన ముస్లింలలో వచ్చింది. బిజెపి మరోసారి రాష్ట్రంలో అధికారంలోకి వస్తే తమని ఇంకెన్ని విధాలుగా ఇబ్బంది పెడుతుందోనన్న భయం ముస్లింలలో మొదలైంది. ఈ కారణంతోనే దశాబ్ధాల తర్వాత ముస్లింలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి దగ్గరుండి గెలిపించారు. ముస్లింలతో పాటు క్రైస్తవులు కూడా ఏకపక్షంగా కాంగ్రెస్ కు ఓటు వేశారు. కర్నాటకలో మొత్తం 224 నియోజక వర్గాలుంటే అందులో 65 నియోజకవర్గాల్లో ముస్లిం ఓటర్లు చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నారు. చాలా నియోజక వర్గాల్లో గెలుపు ఓటములను నిర్ధేశించే సంఖ్యలో ఉన్నారు. వారంతా కాంగ్రెస్ ను కటాక్షించడంతోనే కన్నడ నాట సర్వే అంచనాలను సైతం మించి కాంగ్రెస్ అద్భుత విజయం సాధించగలిగింది. ముస్లింలు కాంగ్రెస్ కు దగ్గర కావడం అనేది బిజెపి స్వయంకృతమే అంటున్నారు రాజకీయ పండితులు. కాంగ్రెస్ తరపున మొత్తం 15 మంది ముస్లిం అభ్యర్ధులు ఎన్నికల బరిలో దిగితే అందులో తొమ్మిది మంది విజయం సాధించి ఎమ్మెల్యేలు అయిపోయారు. అదే జేడీఎస్ తరపున 22 మంది ముస్లింలు పోటీ చేస్తే ఒక్కరంటే ఒక్కరు కూడా విజయం సాధించలేకపోయారు. ముస్లింలు ఎంత ప్రణాళికా బద్ధంగా ఓటు వేశారో దీన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చు.

కన్నడ విజయంతో కాంగ్రెస్ పార్టీలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ఎన్నికల అనంతరం ఫలితాలను సమీక్షించుకున్న కాంగ్రెస్ పార్టీకి ఈ సారి ముస్లింలు తమవైపు మొగ్గు చూపారన్న అంశం తెలుసుకుని మురిసిపోతున్నారు. ఈ ఏడాది జరగనున్న అయిదు రాష్ట్రాల ఎన్నికల్లోనూ వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లోనూ ముస్లింలు ఇదే ట్రెండ్ ను కొనసాగిస్తే తమకి ఇక తిరుగే ఉండదని కాంగ్రెస్ వ్యూహకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.
అసలు ముస్లింలు , క్రైస్తవులు మొదట్నుంచీ కూడా కాంగ్రెస్ పార్టీకి సంప్రదాయ ఓటు బ్యాంకు గా ఉంటూ వచ్చారు. కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘకాలం పాటు దేశాన్ని పాలించడానికి అది కూడా ఓ కారణం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే 1991లో అయోధ్యలోని బాబరీ మసీదు విధ్వంసాన్ని నిలువరించడంలో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ముస్లింలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడం వల్లనే బాబరీ మసీదు దుర్ఘటన చోటు చేసుకుందని వారు భావించారు. తమని వంచించిన కాంగ్రెస్ పార్టీకి ఇక ఓటు వేయకూడదని ముస్లింలు భీష్మించుకున్నారు. అప్పట్నుంచి ముస్లిం ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి దూరం అయ్యారు. కర్నాటకలో ముస్లిం ఓటర్లు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడానికి  స్థానిక సమస్యలే కారణమంటున్నారు రాజకీయ పండితులు. మొన్నటి దాకా అధికారంలో ఉన్న బొమ్మయ్ ప్రభుత్వం ముస్లిం రిజర్వేషన్లు ఎత్తివేయడం, హిజాబ్ ను నిషేధించడం వంటి అంశాల కారణంగానే ముస్లింలో బిజెపికి దూరమై కాంగ్రెస్ కు దగ్గరయ్యారని వారు విశ్లేషిస్తున్నారు. అయితే అన్ని రాష్ట్రాల్లోనూ ఇటువంటి పరిస్థితి ఉండే అవకాశాలు ఉండకపోవచ్చునని విశ్లేషకులు అంటున్నారు. ఒక్కో రాష్ట్రంలోనూ ముస్లింలు ఒక్కో పార్టీకి అండగా ఉన్నారని వారు గుర్తు చేస్తున్నారు. బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి, ఉత్తర ప్రదేశ్ లో సమాజ్ వాది పార్టీకి, బిహార్ లో ఆర్జేడీకీ ముస్లింలు మద్దతు ఇస్తున్నారు. ఆ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ గురించి ముస్లిం ఓటర్లు ఆలోచించే పరిస్థితి ఉండకపోవచ్చునన్నది రాజకీయ పండితుల వాదన. అందుకే ఆ తర్వాత నుంచి కాంగ్రెస్ పార్టీ  కేంద్రంలో అధికారంలోకి వచ్చినా పూర్తి స్థాయి మెజారిటీతో రాలేదు. అతి పెద్ద పార్టీగా అవతరించి ఇతర పార్టీల మద్దతుతో సంకీర్ణ ప్రభుత్వాలనే ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ. 2004లో యూపీయే వన్, 2009లో యూపీయే టూ ప్రభుత్వాలు అలా ఏర్పాటు అయినవే. కాంగ్రెస్ పార్టీకి దూరం అయిన ముస్లింలు అదే సమయంలో తమ ప్రయోజనాలు కాపాడేందుకు కృషి చేసిన ఇతర పార్టీల వైపు అడుగులు వేశారు. బిహార్ లో లాలూ ప్రసాద్ యాదవ్, ఉత్తర ప్రదేశ్ లో ములాయం సింగ్ యాదవ్ లు ముస్లింలకు ప్రత్యామ్నాయాలుగా కనిపించారు.

బాబరీ మసీదు విధ్వంసానికి ముందు నాటి బిజెపి అగ్రనేత లాల్ కృష్ణ అధ్వానీ రామ మందిర నినాదంతో చేపట్టిన రథయాత్రను లాలూ ప్రసాద్ యాదవ్   అడ్డుకున్నారు. అద్వానీ యాత్రను సమాజ్ వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ కూడా వ్యతిరేకించారు. అందుకే కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పిన ముస్లింలు యూపీలో సమాజ్ వాది పార్టీకి బిహార్ లో ఆర్జేడీకి సంప్రదాయ ఓటు బ్యాంకు గా మారిపోయారు. అయితే దీన్ని బ్రేక్ చేయడానికి బిజెపి హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోన్న మజ్లిస్ పార్టీని రంగంలోకి దింపి ముస్లిం ఓట్లు చీల్చడం ద్వారా తాను లబ్ధిపొందుతూ వచ్చిందని విశ్లేషకులు అంటున్నారు. ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, బిహార్ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ ఎన్నికల బరిలో దిగి ముస్లిం ఓట్లను చీల్చడం వల్ల బిజెపి లబ్ధి పొందింది. అయితే ఈ ఫార్ములా పశ్చిమ బెంగాల్ లో వర్కవుట్ కాలేదు. అక్కడ మజ్లిస్ పార్టీని బెంగాల్ ముస్లింలు తిరస్కరించడంతో బిజెపికి లాభం లేకపోయింది. కర్ణాటక అనుభవం తర్వాత మజ్లిస్ ఆలోచనల్లోనూ మార్పు రావచ్చంటున్నారు. లేదా ముస్లిం సమాజంలోనే కొత్త ఆలోచనలు రావచ్చు అంటున్నారు విశ్లేషకులు.