అవసరం లేని విషయాలు మాట్లాడటంలో కేసీఆర్ దిట్ట అంటారు. ఆయన ఏదో విధంగా అసలు సంగతిని డైవర్ట్ చేయగలరంటారు. ఆయన ఎప్పుడు ఏ పనిచేస్తారో ఏ మీటింగ్ ఎందుకు పెడతారో అర్థం కాదంటారు. ఇటీవలి కాలంలో కేసీఆర్ తీరుపై ఆనేక విశ్లేషణలు వినిపిస్తున్నాయి. పైగా కొత్త కొత్త నినాదాలను జనంలోకి తీసుకురావడంలోనూ కేసీఆర్ నెంబర్ వన్. దశాబ్దంలో శతాబ్దం అభివృద్ధి సాధించామని ఇప్పుడాయన చెప్పుకుంటున్నారు. అది నిజమో కాదో వేరే విషయం. బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో కేసీఆర్ అనేక కీలకాంశాలు ప్రస్తావించారు.105 స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుందని ధీమాగా ఉన్నారు. పైగా ఎవరూ ఆడగకుండానే కర్ణాటక ఎన్నికల ఫలితాలను పట్టించుకోవాల్సిన పనిలేదని వాటి ప్రభావం తెలంగాణపై ఉండదని కేసీఆర్ ప్రకటించడం కూడా చర్చనీయాంశమైంది. కార్యకర్తలను నేతలను యాక్టివ్ గా ఉంచడానికి తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను 21 రోజుల పాటు అట్టహాసంగా నిర్వహించాలని ఆయన ఆదేశించినప్పటికీ జనం జారి పోకుండా చూసుకోవాలన్న భయం అందులో దాగొందని చెబుతున్నారు. నిజానికి కర్ణాటకలో కాంగ్రెస్ విజయంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అలర్టయ్యారు ఇప్పటికే తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి సారించిన గులాబీ బాస్ నియోజకవర్గాల వారీగా గెలుపోటములపై లెక్కలు వేసే పనిలో పడ్డారు. అందులో భాగంగానే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏ పార్టీ షిఫ్ట్ అవుతుంది. ఎవరికి లబ్ది చేకూరుతుంది అనే అంశంపై ఆరా తీస్తున్నారు. అయితే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలడం ద్వారా అధికార బీఆర్ఎస్ పార్టీకి నష్టం జరగకుండా వుండేందుకు కేసీఆర్ వ్యూహరచన చేస్తున్నారు. ఇప్పటికే వరుసగా రెండు సార్లు ప్రజా వ్యతిరేకతను అధిగమించి అధికారంలోకి వచ్చిన బిఆర్ఎస్ పార్టీకి మూడవసారి అధికారంలోకి రావడం అంత ఈజీ కాదనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.
తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్, బీజేపీలు సవాల్ విసురుతున్నాయని కేసీఆర్ కు బాగానే తెలుసు. గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ బలంగా వుంది. అయితే అర్బన్ ప్రాంతాల్లో బీజేపీకి కొంత సానుకూలత ఏర్పడింది. దీనితో బీఆర్ఎస్ ముందుగానే అలెర్ట్ అయింది.ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకు చీలడం ద్వారా అది అధికార పార్టీకి అనుకూలంగా మారుతుంది. కానీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఒక్క రాజకీయ పార్టీకి పడితే మాత్రం అధికార పార్టీకి ఇబ్బందులు తప్పవు. తాజాగా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకు మొత్తం కాంగ్రెస్ పార్టీ వైపుకు మళ్లింది. ఇంతకు ముందు కర్ణాటకలో ప్రాంతీయ పార్టీగా వున్న జేడీఎస్ కు సాంప్రదాయక ఓటుతో పాటు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు పడటంతో కింగ్ మేకర్ కాగలిగింది. కానీ ఈసారి మాత్రం పూర్తిగా కాంగ్రెస్ పార్టీ వైపుకు మాత్రమే ప్రభుత్వ వ్యతిరేక ఓటు పడటంతో కర్ణాటకలో బంపర్ మెజారిటీతో విజయం సాధించగలిగింది. ఆ సంగతి అర్థం చేసుకున్న కేసీఆర్ ఇప్పుడు పార్టీ శ్రేణుల దృష్టి మళ్లించే ప్రయత్నంలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి గ్రామీణ ప్రాంతాల్లో 30 నుండి 35 శాతం వరకు ఓటు బ్యాంకు వుందని అది ఎన్నికల నాటికి మరో 2 శాతం పెరిగినా తమకు ఇబ్బంది వుండదని గులాబీ పార్టీ భావిస్తుంది. అయితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీల మధ్య సమానంగా చీలితే తమకు నష్టం ఉండదని లాభం చేకూరుతుందని గులాబీ దళం అంచనా వేస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకు ట్రయాంగిల్ ఫైట్ లో కాంగ్రెస్ పార్టీకి కొంత ఎక్కువ వెళ్లినా తమకు నష్టం లేదని గులాబీ బాస్ భావిస్తున్నారు. కానీ ఏ ఒక్క పార్టీకి అది గంపగుత్తగా షిఫ్ట్ అయినా ప్రమాదంలో పడతామని ఆయన ఆందోళన చెందుతున్నారు.
తెలంగాణలో వరుసగా రెండు సార్లు అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీపై ప్రజా వ్యతిరేకత ఎంతవుంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు కాంగ్రెస్ పార్టీకి వెళ్తుందా బీజేపీకి వెళ్తుందా. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలితే అది బీఆర్ఎస్ ను తిరిగి అధికారంలోకి తెస్తుందా కాంగ్రెస్ కు అది ప్లస్ అవుతుందా, బిఆర్ఎస్ అధికారంలోకి రాకుండా నిలువరిస్తుందా అనే లెక్కలు తీస్తూ కేసిఆర్ విరుగుడు వ్యూహాలకు పదును పెడుతున్నారు. మరో పక్క కేసీఆర్ వంద సీట్లు వస్తాయని బింకంగా ప్రకటనలు చేయడం వెనక ఉన్నది ఆత్మవిశ్వాసం కాదని భయం అనే అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది. ఎందుకంటే 2018లో భిన్నమైన రాజకీయ పరిస్థితులు ఉన్నాయి. అప్పటికి తెలంగాణ సెంటిమెంట్ ఇంకా చల్లారలేదు. ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు జోక్యంతో సెంటిమెంట్ అనేది ప్రధాన ఓటింగ్ అంశం అయింది. ఇప్పుడు సెంటిమెంట్ ను కేసీఆర్ వదిలేశారు. టీఆర్ఎస్ పార్టీనే ఏకంగా బీఆర్ఎస్ అని మార్చేశారు. భారతీయ జనతా పార్టీ కూడా బలపడింది. దీంతో కేసీఆర్ పార్టీ నేతలు చేజారిపోకుండా ధైర్యం నటిస్తున్నారన్న వాదన వినిపిస్తోంది.