కర్నాటక ఎన్నికల్లో అధికారాన్ని చేజార్చుకున్న కమలదళం మరో దక్షిణాది రాష్ట్రమైన తెలంగాణాలోనైనా సత్తా చాటి అధికారంలోకి రావాలని పట్టుదలగా ఉంది. అందుకోసం వ్యూహాలకు పదును పెడుతున్నారు. కాంగ్రెస్, బి.ఆర్.ఎస్.లను వెనక్కి నెట్టి కర్నాటకలో కాంగ్రెస్ విజయానికి తెలంగాణాలో ప్రతీకారం తీర్చుకోవాలని కసిగా ఉన్నారు. ఇందుకోసం పార్టీలో అవసరమైన మార్పుల దిశగా వేగంగా అడుగులు వేస్తోంది బీజేపీ నాయకత్వం. కర్ణాటకలో కోల్పోయిన అధికారాన్ని తెలంగాణలో ఎలాగైనా సాధించాలని బీజేపీ వ్యూహాలు సిద్ధం చేస్తోంది. ఇందు కోసం పార్టీలో మార్పులు చేయాలని నిర్ణయించింది. బీఆర్ఎస్ వ్యూహాలను పసిగట్టి తిప్పికొట్టగలిగిన సీనియర్ నేత ఈటలకు కీలక బాధ్యతలు అప్పగించాలని భావిస్తోంది. మరికొందరు నేతలకు చేతినిండా పని అప్పగించాలని బీజేపీ పెద్దలు నిర్ణయించారు. ఇందులో భాగంగానే అగ్రనేత అమిత్ షా ఈటలను ఢిల్లీకి పిలిపించి మాట్లాడారని మరికొందరు నేతలతోనూ మాట్లాడతారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.
తెలంగాణాలో కొత్త నియామకాలు చేపట్టడంతో పాటు ముఖ్య నేతలకు కీలక బాధ్యతలు అప్పగించే పనిలో పడింది బీజేపీ నాయకత్వం. పార్టీ చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్‌కు కీలక బాధ్యతలు కట్టబెట్టే విషయంపై వారం, పది రోజుల్లోనే జాతీయ నాయకత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడి అవకాశం ఉంది. అమిత్ షాతో సమావేశమైన ఈటల రాష్ట్ర రాజకీయాలు చేరికలు ఎన్నికల్లో వ్యూహ రచన నేతలకు బాధ్యతలపై చర్చించినట్టు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీని పూర్తిస్థాయిలో సమాయత్తం చేసేందుకు కొందరిని బాధ్యతల నుంచి తప్పించడంతో పాటు మరికొందరు నేతలకు కీలక బాధ్యతలు అప్పగించాలన్న అంశంపైనే అమిత్ షాతో ఈటల చర్చించినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి ఎన్నికల కమిటీ ప్రచార కమిటీ చైర్మన్ వరకు కీలక నియామకాలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామన్న సంకేతాలను అమిత్ షా ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. వీటిలో ఏదో ఒక బాధ్యతను ఈటలకు అప్పగిస్తామని అమిత్ షా హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. రాష్ట్ర బీజేపీలో చేపట్టబోయే కీలక మార్పులు, ముఖ్యమైన బాధ్యతలను అప్పగింతపై మరికొందరు ముఖ్య నేతలను ఢిల్లీకి పిలిపించి సంప్రదింపులు జరిపే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఆయా నేతల అభిప్రాయాలు కూడా తీసుకున్నాక అధికారిక ప్రకటన ఉండొచ్చనే మాటలు వినపడుతున్నాయి.
ఇతర పార్టీల నుంచి ముఖ్య నేతల చేరికలపై అమిత్ షాతో భేటీలో కొంత స్పష్టత వచ్చినట్టు తెలుస్తోంది. పొంగులేటి, జూపల్లితో పాటు బీఆర్ఎస్ అసంతృప్త నేతలతో భేటీ అయి చేరికల ప్రక్రియను వేగవంతం చేయాలని ఈటలకు అమిత్ షా సూచించినట్టు తెలుస్తోంది. తాను నెలాఖరులో లేదంటే వచ్చే నెల తొలివారంలో తెలంగాణ పర్యటనకు వస్తానని చెప్పినట్టు సమాచారం. తెలంగాణ పర్యటన సందర్భంగా ఎన్నికల వ్యూహాలు, మేనిఫెస్టోతో పాటు ముఖ్య నేతల బహిరంగ సభలు, ఇతర అంశాలపై అమిత్ షా దిశానిర్దేశం చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు కూడా జాతీయ నేతల నుంచి పిలుపు వచ్చిందని ఆయన ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారని ప్రచారం జరుగు తోంది. అయితే తాను ఆరోగ్యపరమైన అంశంపై ఢిల్లీ వెళ్లాలని ముందుగానే నిర్ణయించుకున్నానని రాజకీయాలతో సంబంధం లేదని సంజయ్ తన సన్నిహితులకు తెలిపారు.
బీజేపీలో చేరినప్పటి నుంచీ ప్రాధాన్యత లభించడం లేదని జాతీయ నాయకత్వం వద్ద ఈటల అసంతృప్తి వెలిబుచ్చినట్టు తెలిసింది. ఇదే సమయంలో పార్టీ ముఖ్య నేతల మధ్య సత్సంబంధాలు కొరవడటం పాత కొత్త నేతల మధ్య సమన్వయ లేకపోవడం ఇతర పార్టీల నుంచి చేరికలు ఆగిపోవడం ముఖ్య నేతలు వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యతనివ్వడాన్ని జాతీయ నాయకత్వం గుర్తించినట్టు తెలుస్తోంది. దీనికి తోడు తాజాగా కర్ణాటకలో అధికారాన్ని కోల్పోవడంతో అసంతృప్తులతో చర్చించడం సమన్వయాన్ని నెలకొల్పడం కీలకమనే నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. ఇందులో భాగంగానే పార్టీలో మార్పుచేర్పులకు సిద్ధమైనట్టు తెలుస్తోంది.