చదివక ముందు కాకరకాయ చదివిన తర్వాత కీకర కాయ అన్నాడట వెనకటికో మేథావి. ఏపీలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడి వ్యవహారాలు చూస్తోంటే అదే అనిపిస్తోందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. పాలకపక్షమైన వైసీపీని ఉక్కిరి బిక్కిరి చేసి రాజకీయంగా లబ్ధి పొందాలన్న ఆలోచనతో ఆయన పార్టీ చేస్తోన్న పనులు, తీసుకుంటున్న నిర్ణయాలూ తెలుగుదేశం పార్టీకి గొడ్డలి పెట్టయ్యేలా ఉన్నాయంటున్నారు మేథావులు. టిడిపి అత్యుత్సాహం పరోక్షంగా వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీకి వరంగా మారుతోందంటున్నారు వారు. ఆంధ్రప్రదేశ్ లో చిత్ర విచిత్ర రాజకీయాలు జరిగిపోతున్నాయి. 2019 ఎన్నికల్లో 23 స్థానాలకు పరిమితమైన తెలుగుదేశం పార్టీ నాలుగేళ్ల తర్వాత కూడా కోలుకున్నట్లు కనపడ్డం లేదు. ఈ నాలుగేళ్లలో జరిగిన స్థానిక ఎన్నికలతో పాటు వివిధ ఉప ఎన్నికల్లో టిడిపి ఘోరపరాజయాలే దానికి నిదర్శనం అంటున్నారు రాజకీయ పండితులు.
ఈ మధ్యనే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా చాటి టిడిపి కాస్త ఫాంలోకి వచ్చినట్లు కనపడింది. కానీ రాజకీయ వ్యవహరాల పరంగా చూస్తే మాత్రం ఇప్పటికీ టిడిపి సెల్ఫ్ గోల్స్ వేసుకుంటోందంటున్నారు మేథావులు.
జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా 31 లక్షల మందికి పైగా ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి సిద్ధమైంది. అయితే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి వాటిని పంపిణీ చేయకుండా ఆపాలంటూ కేసులు వేయించి అడ్డుకున్నారు చంద్రబాబు. ఆ తర్వాత స్థానికసంస్థల ఎన్నికలు అయిపోయాయి. ఆ తర్వాత రక రకాల కారణాలు చూపి ఇళ్ల స్థలాల పంపిణీపై మళ్లీ న్యాయస్థానాల్లో కేసులు వేయించారు. వాటన్నింటినీ న్యాయ స్థానాల్లోనే తేల్చుకున్న ప్రభుత్వం చివరకు ఇళ్ల స్థలాలకు పట్టాలు పంపిణీ చేసింది. వాటిలో 22 లక్షల స్థలాల్లో ఇళ్ల నిర్మాణం కూడా మొదలైపోయింది. ఇక రాజధాని అమరావతిలో యాభైవేల మందికి పైగా పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోన్న సమయంలో అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తే సామాజిక సమతుల్యత దెబ్బతింటుందని హైకోర్టులో టిడిపి నేతలు కేసు వేయడం అక్కడ పేదలకు ఇవ్వద్దంటూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశించడం జరిగిపోయాయి.
అయితే దాన్ని తిరిగి హైకోర్టులోనే సవాల్ చేసింది ప్రభుత్వం. దాంతో అక్కడ పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకూడదని ఎలా అంటారు అని నిలదీసిన బెంచ్ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు నిచ్చింది. హై కోర్టు తీర్పుతో ప్రభుత్వం ఇళ్ల స్థలాల పంపిణీకి సన్నాహాలు చేస్తోన్న తరుణంలో సుప్రీం కోర్టులో అమరావతి రైతుల పేరిట కేసు వేయించారు. చివరకు సుప్రీం కోర్టు కసైతం రాజధాని అంటే అందరిదీఅక్కడ ఫలానా వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వకూడదని ఎలా అంటారు అని నిలదీసి పేదలకు అనుకూలంగా తీర్పు చెప్పింది. ఇపుడు అక్కడ పేదలకు సెంటు భూమి చొప్పున ప్లాట్లుగా విభజిస్తున్నారు. హైకోర్టు, సుప్రీంకోర్టులు రెండూ కూడా పేదలకు అనుకూలంగా తీర్పు నివ్వడంతో అది ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చాయని భావించారో ఏమో కానీ చంద్రబాబు నాయుడు చాలా నిస్పృహకు లోనైనట్లు కనిపిస్తున్నారు. ఈ తీర్పు వచ్చిన తర్వాత విశాఖ జిల్లాలో పర్యటిస్తూ సెంటు భూమి దేనికోసం మీరు ఛస్తే పాతి పెట్టడానికి స్మశానాలు కావాలి కదా దానికి పనికొస్తాయి అంటూ నోరు జారారు చంద్రబాబు. నలభై ఏళ్ల రాజకీయ అనుభవం జాతీయ రాజకీయాల్లో చక్రాలు తిప్పిన నైపుణ్యం ప్రత్యర్ధుల ఎత్తుగడలను చిత్తు చేయగల చాణక్యం చంద్రబాబు సొంతం అని అందరూ నమ్ముతారు. అటువంటి చంద్రబాబేనా ఇలా వ్యవహరిస్తున్నది అని ఆశ్చర్యం వేస్తోందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
అమరావతిలో అయినా మరో చోట అయినా నిరుపేదలకు ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇస్తానంటే వాటిపై ప్రతిపక్షం కోర్టుకెక్కితే ఏం జరుగుతుంది ఒకవేళ న్యాయస్థానాల్లో టిడిపికి అనుకూలంగా తీర్పు వచ్చిందే అనుకుందాం. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వద్దని తీర్పులు వచ్చాయనుకుందాం అపుడు పేదలు ఏమనుకుంటారు జగన్ మోహన్ రెడ్డి మాకు ఇళ్ల స్థలాలు ఇద్దామని అనుకుంటే చంద్రబాబు నాయుడు వాటిని అడ్డుకున్నారు అని అనుకోరా పేదలు ఇలా ఆక్రోశంలో ఉన్న సమయంలో రేపు ఎన్నికలు వస్తే దీని ప్రభావం టిడిపి పై ఎలా ఉంటుందో వేరే చెప్పాలా ఏ పేదలనైతే సెంటు భూమిని చనిపోయాక సమాధి కట్టుకోడానికి పనికొస్తుందని చంద్రబాబు అన్నారో అదే చంద్రబాబుకు చెందిన టిడిపికి పేదలు సమాధి కట్టే ప్రమాదం లేదా అని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు ఒక్కరే కాదు. టిడిపి మాజీ మంత్రులు, సీనియర్ నేతలు సైతం పేదలకు ఇళ్ల స్థలాల విషయంలో బ్యాలెన్స్ తప్పి వ్యతిరేకిస్తున్నారు. పార్టీ అధ్యక్షుడు అచ్చెంనాయుడు అయితే అమరావతిలో బలవంతంగా పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తే తాము అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిని స్వాధీనం చేసేసుకుంటామని హెచ్చరించారు. ఆయన హెచ్చరించింది వైసీపీని అని అనుకుని ఉంటారు. కానీ ఆ హెచ్చరిక పేదలను ఉద్దేశించే అవుతుందన్నది కామన్ సెన్స్ అంటున్నారు విశ్లేషకులు.
మూడు రాజధానులను వ్యతిరేకించడం తప్పు కాదు. అమరావతి ఒక్కటే రాజధానిగా ఉండాలన్నది టిడిపి రాజకీయ సిద్ధాంతం కాబట్టి దానికి కట్టుబడి ఉన్నట్లు అవుతుంది. అమరావతిలోనే రాజధాని ఉండాలని పట్టుబట్టడం తప్పు కాదు. కానీ పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడాన్ని న్యాయస్థానాలను అడ్డుపెట్టుకుని ఆపడాన్ని తెలివి అనుకోవాలా రాజకీయంగా ఆత్మహత్యాయత్నం అనుకోవాలా ఎవరైనా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే సరిదిద్దాల్సిన చంద్రబాబు నాయుడే ఇలా బహిరంగంగా పేదలకు అడ్డు పడుతున్నట్లు వ్యవహారాలు నడపడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి రాజకీయచాణక్యుడికి ఏమైంది 2024 ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనైనా గెలిచి మరో సారి ముఖ్యమంత్రి కావాలని కలలు కంటోన్న చంద్రబాబు నాయుడు తన మొత్తం రాజకీయ జీవితంలో ఇంత తెలివి తక్కువగా అనాలోచితంగా వ్యవహరించిన దాఖలాలు లేవంటున్నారు ఆయన గురించి బాగా తెలిసిన వారు. 2018లోనూ ఇంతే చక్కగా ఎన్డీయే ప్రభుత్వంలో ప్రశాంతంగా ఉన్న చంద్రబాబు నాయుడు తన కుమారుడి వయసున్న ప్రతిపక్ష నాయకుడు జగన్ మోహన్ రెడ్డి వ్యూహంలో చిక్కుకుని బిజెపికి కటీఫ్ చెప్పారు. రాజకీయంగా అది ఘోరమైన తప్పిదమని అర్ధం అయ్యే సరికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అప్పుడైనా సంయమనంతో ఉండకుండా 2019 ఎన్నికల్లో గెలిచే అవకాశాలున్న నరేంద్ర మోదీ ఓడిపోతారని భావించి మోదీపై వ్యక్తిగత దూషణలు చేసి కాంగ్రెస్ తో చెట్టా పట్టాలేసుకుని మోదీని ఓడిస్తానని శపథంచేశారు చంద్రబాబు. అదీ బెడిసి కొట్టింది. నరేంద్ర మోదీ ఘన విజయం సాధించారు.
మరి చంద్రబాబు విజన్ ఎక్కడికి పోయినట్లు మోదీ విజయాన్ని ఆయన ఎందుకు పసిగట్టలేకపోయినట్లు అంటున్నారు పండితులు. ఇదే చంద్రబాబు ఈ మధ్యనే కర్నాటక ఎన్నికల ముందు మోదీని పొగడ్తలతో ముంచెత్తారు. ఆ వెంటనే జరిగిన కర్నాటక ఎన్నికల్లో బిజెపి ఘోరంగా ఓడిపోయింది. మోదీ మానియా పనిచేయలేదక్కడ. 2024 ఎన్నికల్లో మళ్లీ మోదీయే వస్తారన్న గ్యారంటీ ఏమీ లేదు. ఏమైనా జరగచ్చు. మరి ఇంత ముందే ఆయనను ఎందుకు కీర్తించినట్లు చంద్రబాబు ఒకప్పుడు వ్యూహాలు రచించడంలో బాబు దిట్ట. ఎత్తు వేశారంటే ప్రత్యర్ధి చిత్తు కావలసిందే. అలాంటి జీనియస్ ఇపుడు ఇలాంటి రాజకీయాలు చేస్తున్నారంటే ఏమనుకోవాలి. ఆయన మెదడులోని పొలిటికల్ చిప్ పాడైపోయిందా అని ఆయన రాజకీయ ప్రత్యర్ధులు సెటైర్లు వేస్తున్నారు. ఏది ఏమైనా ఏపీలో మాత్రం నాలుగేళ్లుగా చంద్రబాబు నాయుడు చేసిన రాజకీయాలు టిడిపికి నష్టాన్ని తెచ్చాయి తప్ప లాభం కాలేదు. ఇప్పటినుంచి అయినా చంద్రబాబు నాయుడు జూలు విదిల్చి తనకే సాధ్యమైన రాజకీయ చదరంగం ఆడితే బావుంటుందని అంటున్నారు రాజకీయ పండితులు.