నారా చంద్రబాబు నాయుడు.. ఎక్కువ కాలం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా సేవలందించిన నాయకుడాయన. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, దాదాపు అంతే టైమ్ ప్రతిపక్ష నేతగా చంద్రబాబు ఉన్నారు. ఆధునిక ఆంధ్రప్రదేశ్ నిర్మాతగా ఆయనకు పేరుంది. అభిమానులు ఆయన్ను హైటెక్ ముఖ్యమంత్రి అని కూడా పిలుస్తారు. సాఫ్ట్ వేర్ ను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు తెచ్చిన రాష్ట్ర సీఈఓ కూడా ఆయనే. రాష్ట్ర విభజన తర్వాత తొలి ఐదేళ్లలో కియా సహా పలు పరిశ్రమలను ఆయన ఆహ్వానించి పారిశ్రామికాభివృద్దికి పునాదులు వేశారు. ఐనా ఓడిపోయారు. చంద్రబాబు తెగ తిరుగుతున్నారు. జనంలో ఉండేందుకే ఇష్టపడుతున్నారు. ప్రజల మనిషని చెప్పించుకునేందుకు తాపత్రయ పడుతున్నారు. అర్థరాత్రి దాకా లైటు వెలుతురులో ఉపన్యాసాలిస్తూ జనాన్ని ఆకట్టుకోవాలనుకుంటున్నారు అదీ ఒక కోణం. ఆ ఉపన్యాసాల్లో చేస్తున్న తప్పులే ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకునే ప్రమాదముందన్నది మరో కోణం. నిన్నగాక మొన్న చంద్రబాబు నోరు జారేశారు.
అమరావతిలో సెంటు భూమి పథకానికి సుప్రీం కోర్టు బ్రేకులు వేసిందన్న అమితానందంలో చంద్రబాబు నోరు అదుపు తప్పింది. సెంటు భూమితో ఒరిగేదేమిటి సమాధులు కట్టుకుంటారా అని చంద్రబాబు జనాన్ని ప్రశ్నించారు. అదే ఇప్పుడు పెద్ద శాపమై కూర్చుంది. సమాధులు అన్న మాటను ప్రత్యర్థి పార్టీలు తమ ప్రచారానికి ఉపయోగించుకుంటున్నాయి. చంద్రబాబు పేదల వ్యతిరేకి అంటూ తూర్పార పడుతున్నాయి. ఆరడుగుల స్థలం ఉంటే సమాధి వస్తుందని అందుకు 48 చదరపు గజాలుండే స్థలం అవసరం లేదని కొందరు మూడు నుంచి ఐదు లక్షల రూపాయల విలువ చేసే భూమిని పేదలకు ఇస్తుంటే చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని మరికొందరు విమర్శలు సంధిస్తున్నారు. వైసీపీ వారి సోషల్ మీడియా సైన్యం ఓ రేంజ్ లో విరుచుకుపడుతోంది. వైఎస్ఆర్ హయాంలో ఉచిత విద్యుత్ పై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలలో అప్పట్లో దుమారం రేగింది. కరెంటు లేని ఉచిత విద్యుత్ మాట ఎందుకు కరెంట్ తీగెలపై బట్టలారేసుకుంటారా అని చంద్రబాబు ఎగతాళి చేసినట్లుగా అప్పట్లో ప్రచారం జరిగింది. దాన్ని వైఎస్ తన ప్రచారానికి బాగానే ఉపయోగించుకున్నారు. ఎన్నికల్లో గెలిచారు. ఇప్పుడు సమాధుల కామెంట్ కూడా అప్పటి పరిస్థితుల్లోకి నెట్టకూడదని, చంద్రబాబు అలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉంటే బావుంటుందని పార్టీ శ్రేణులు మొక్కుకుంటున్నాయి. పార్టీ శ్రేణులను కూడా చంద్రబాబు తెగ కష్టపెడుతున్నట్లు ఓ ప్రచారం మొదలైంది.
ఒక పక్క యువగళం పేరుతో నారా లోకేష్ తిరుగుతున్నారు. మరో పక్క ఈ వేసవిలోనే చంద్రబాబు టూర్లు చేస్తున్నారు. ఒక్కసారి వచ్చారంటే మూడు రోజులు ఉంటున్నారు. ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి అన్న కార్యక్రమాన్ని జనంలోకి తీసుుకెళ్తున్నారు. రోజంతా పార్టీ శ్రేణులతో మీటింగులు పెడుతున్నారు. బాగా పొద్దుపోయిన తర్వాత బహిరంగ సభల్లో గంట తక్కువ కాకుండా ప్రసంగిస్తున్నారు. పగలు లోకేష్ మాట్లాడుతున్నదీ అదే పొద్దుపోయాక తండ్రి చంద్రబాబు చెబుతున్నదీ అదే. జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేసే క్రమంలో చెప్పిందే చెప్పి విసిగిస్తున్నారని పార్టీ శ్రేణులు గగ్గోలు పెడుతున్నాయి. యువనేత లోకేష్ మాట్లాడుతున్నారు కదా చెప్పాలనుకున్న విషయం జనంలోకి వెళ్తోంది కదా మళ్లీ పొద్దుగూకిన తర్వాత చంద్రబాబు మాటలెందుకని పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. చంద్రబాబు మీటింగులకు జనాన్ని తోలలేక చచ్చిపోతున్నామని ద్వితీయ శ్రేణి నేతలు వాపోతున్నారు. జనాన్ని తీసుకురావడం మీటింగ్ ముగిసిన తర్వాత మళ్లీ ఇంటికి పంపించడం మామూలు విషయం కాదని టెన్షన్ పడుతున్నారు. పైగా మీటింగుల్లో కొందరు నేతలను చంద్రబాబు హెచ్చరిస్తున్న తీరుతో వారు ఇబ్బంది పడుతున్నారు. పార్టీలో తమ పనైపోయిందన్న భయం వారిలో కలుగుతోంది. ఇలాంటి చర్యలు మానుకుంటే బావుంటుందన్న ఫీలింగ్ టీడీపీ శ్రేణుల్లో కనిపిస్తోంది. మరి ఇదంతా అర్థం చేసుకోవాల్సినది చంద్రబాబే కదా.