జనసేనకు 18 సీట్లేనా? భగ్గుమంటున్న జనసైనికులు

By KTV Telugu On 20 May, 2023
image

తెలుగుదేశం-జనసేన పార్టీల మధ్య పొత్తు ఖరారైనట్లే అని రెండు పార్టీలకు చెందిన వర్గాల్లోనూ ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా మరో అంశం విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. వచ్చే ఎన్నికల్లో పొత్తులో భాగంగా  జనసేన పార్టీకి 18 అసెంబ్లీ స్థానాలు రెండు లోక్ సభ స్థానాలు మాత్రమే కేటాయించాలని టిడిపి నాయకత్వం డిసైడ్ అయినట్లు చెబుతున్నారు. కనీసం 50 స్థానాల్లో పోటీ చేయాలని జనసేన భావిస్తోందంటున్నారు. మరి ఈ సీట్ల కేటాయింపుకు పవన్ కళ్యాణ్ ఊ అంటారా లేక ఉఊ అంటారా అని ప్రశ్నిస్తున్నారు రాజకీయ పరిశీలకులు. ఆంధ్రప్రదేశ్ లో వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీని వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రానీయకుండా అడ్డుకోవడమే తన లక్ష్యమంటున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. దానికోసమే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదన్న లక్ష్యంతో టిడిపి-బిజెపిలతో కలిసి పొత్తుపెట్టుకుని ఎన్నికల బరిలో దిగాలని డిసైడ్ అయ్యారు. బిజెపితో ఇప్పటికే పొత్తులో ఉన్నారు పవన్ కళ్యాణ్. టిడిపిని కూడా కలుపుకు పోవాలన్నది ఆయన ఆలోచన. దానికి బిజెపి అగ్రనేతలు నో అంటున్నారు. అయితే బిజెపి నాయకత్వాన్ని తాను ఒప్పించుకుంటానంటోన్న పవన్ కళ్యాణ్ టిడిపి-బిజెపి-జనసేన కలిసే 2024 ఎన్నికల్లో పోటీ చేస్తాయన్న సంకేతాలు ఇస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ జనసేన బీజేపీ, మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తే ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. బిజెపి పొత్తుకు ససేమిరా అంటే టిడిపి-జనసేన పార్టీలే పొత్తు పెట్టుకుని పోటీచేస్తాయని అంటున్నారు. అప్పుడు రెండు పార్టీల మధ్య సీట్ల పంపిణీ ఏ విధంగా ఉండచ్చన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే టిడిపి వర్గాలు ఓ  ప్రచారం మొదలు పెట్టాయి. టిడిపి అనుబంధ సోషల్ మీడియా గ్రూపుల్లో ఇపుడిదే వైరల్ గా మారిపోయింది. దీని ప్రకారం వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీకి 18 అసెంబ్లీ నియోజకవర్గాలు రెండు లోక్ సభ నియోజకవర్గాలు కేటాయించాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ ప్రచారంతో జనసేన వర్గాలు మండి పడుతున్నాయి. తమ నాయకుడికి మరీ ఇంత తక్కువ స్థానాలు కేటాయిస్తారా అని నిప్పులు చెరుగుతున్నారు. టిడిపి జనసేనలు పొత్తు పెట్టుకుంటే కనీసం 50 నుండి 60 అసెంబ్లీ స్థానాల్లో జనసేన పోటీ చేయచ్చని జనసైనికులు ఆశిస్తున్నారు. అపుడు ఎన్నికల బరిలో దిగేందుకు టికెట్ కోసం ఇప్పటినుంచే పైరవీలు చేసుకోడానికి కూడా వారు సమాయత్తమవుతున్నారు. సరిగ్గా ఈ తరుణంలోనే కేవలం 18 అసెంబ్లీ స్థానాలు కేటాయిస్తారనే సరికి జనసైనికులు కోపంతో ఊగిపోతున్నారు. ఇదేమన్నా ముష్టి వేస్తున్నారా జనసేన పొత్తు లేకుండా టిడిపి ఎన్నికల్లో పోటీ చేసి గెలిచే పరిస్థితి ఉందా అని జనసేన నేతలు నిలదీస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పొత్తులు కచ్చితంగా ఉంటాయన్న పవన్ కళ్యాణ్ సీట్ల కేటాయింపు కన్నా ఆత్మగౌరవం తమకి చాలా ముఖ్యమన్నారు. దీని అర్దం పవన్ కళ్యాణ్ కి రాచ మర్యాదలు చేసేసి ఓ 18 సీట్లు విదిల్చేస్తే అయిపోతుందా అని పవన్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. నిజానికి సీట్ల కేటాయింపు గురించి టిడిపిలో ఎలాంటి చర్చా జరగలేదు. ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. కాకపోతే జనసైనికుల మూడ్ తెలుసుకోడానికి చంద్రబాబు నాయుడే ఇటువంటి లీకు ఇప్పించి ఉంటారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఒక వేళ ఈ స్థానాలు మరీ తక్కువగా ఉన్నాయని పవన్ అలిగితే మరో అయిదారు సీట్లు పెంచి ఇచ్చే అవకాశాలు ఉండచ్చంటున్నారు. టిడిపి నాయకత్వం ఈ విషయంలో బెట్టు చేయడానికి పవన్ కళ్యాణే అవకాశం ఇచ్చారని టిడిపి నేతలే అంటున్నారు. ఈ మధ్యనే పవన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి పదవి మనకి ఎవరైనా ఎందుకిస్తారు గత ఎన్నికల్లో మనకి కనీసం 30 నుండి 40 స్థానాలు వచ్చి ఉంటే సిఎం పోస్ట్ గురించి మనం అడగ్గలిగేవాళ్లం. ఇపుడేమొహం పెట్టుకుని అడుగుతాం అన్నారు. గత ఎన్నికల్లో మనకి వచ్చిన  ఓట్లు 7 శాతం లోపే అన్న పవన్  ప్రస్తుతం ఆ ఓట్లు రెట్టింపు అయ్యి ఉండచ్చన్నారు. అయితే ఈ ఓట్లశాతంతో ముఖ్యమంత్రి పదవి రానే రాదని ఎన్నికల్లో పోటీ చేసే అర్హత మాత్రం వస్తుందని వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ మనసులోని ఆలోచనల్లోనే ముఖ్యమంత్రి పదవిపై ఆయనకు ఎక్కువ ఆశలు ఆకాంక్షలు లేవని టిడిపి నాయకత్వానికి అర్ధం అయిపోయింది. పొత్తులో భాగంగా ఇన్ని సీట్లు కావాలని డిమాండ్ చేసే పరిస్థితి కూడా తమకి లేదన్నట్లు పవన్ వ్యవహరించారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. పవన్ కళ్యాణ్ తరచుగా ఓ మాట అంటూ ఉంటారు. తనని తాను తగ్గించుకున్న వాడు ఆ తర్వాత హెచ్చింప బడును అన్న సువార్త సూక్తి ఒకటి వల్లిస్తూ ఉంటారు. దీన్నే టిడిపి నాయకత్వం తమకి అనుకూలంగా మలుచుకుని పవన్ ను తగ్గించే ప్రయత్నం చేసి ఉంటుందని రాజకీయ పండితులు అంటున్నారు.

ముఖ్యమంత్రి పదవి తమది కాదని పవన్ క్లారిటీ ఇచ్చేయడంతో ఆయన అభిమానులు నిరాశకు గురయ్యారని వార్తలు వస్తున్నాయి. తమ పవర్ స్టార్ ని సిఎం సీటులో చూసుకోవాలని అభిమానులు ముచ్చటపడ్డారు. కాపు సామాజికవర్గం కూడా పవన్ సిఎం అయితే బాగుండును అనుకుంది. అందుకే పవన్ టిడిపితో పొత్తు అనగానే జనసైనికులు కూడా హుషారుగా ఓకే అన్నారు. ఎన్నికల పొత్తులో భాగంగా తమ నేతకి ముఖ్యమంత్రి పదవి ఆఫర్ ఇస్తారేమో అనుకున్నారు. అయితే వాటికి పవన్ కళ్యాణే స్వస్తి పలికినట్లు అయిపోయింది. ముఖ్యమంత్రి పదవి వదులుకుంటే వదులుకున్నారు సీట్ల విషయంలోనైనా పవన్ కాస్త గట్టిగా డిమాండ్ చేసుకుంటే బాగుంటుందని జనసైనికులు భావిస్తున్నారు. చంద్రబాబు నాయుడి వంటి కాకలు తీరిన నాయకుడితో పొత్తు డీల్ కుదుర్చుకున్నప్పుడు సీట్ల కేటాయింపులో శషభిషలు లేకుండా మొహమాటాలు పడకుండా కావల్సిన సీట్లు అడగాల్సిందే అంటున్నారు వారు. పవన్ కళ్యాణ్ చెప్పినట్లు జనసేనకు ఉన్న 7 శాతం ఓట్లు ఇప్పుడు ఎంతో కొంత పెరుగుతాయి. ఆ ఓట్లతో జనసేన అధికారంలోకి రాలేకపోవచ్చు. కానీ టిడిపి అధికారంలోకి రావాలంటే మాత్రం జనసేన ఓట్లు కచ్చితంగా కావాలి. జనసేనతో పొత్తు లేకుండా టిడిపి ఒంటరిగా ఎన్నికల బరిలో దిగితే వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ ఇపుడు చేస్తోన్న వైనాట్ 175 నినాదం నిజంగానే నిజం అయిపోతుందంటున్నారు రాజకీయ పండితులు. టిడిపికి తమ ఓట్లు ఎంత కీలకమో అర్ధం చేసుకుని పవన్ కళ్యాణ్ సీట్ల విషయంలో గట్టిగా బేరాలాడాలని కాపు మేథావులు సూచిస్తున్నారు. ఒక వేళ టిడిపితో పొత్తుకు బిజెపి పెద్దలు ఒప్పుకుంటే అపుడు సీట్ల సద్దుబాటు ఎలా ఉంటుందన్నది ఆసక్తికర చర్చగా మారనుంది. అపుడు జనసేనతో పాటు బిజెపికి కూడా సీట్లు కేటాయించాల్సి వస్తుంది. అపుడు జనసేనకు ఇవే 18 స్థానాలు కేటాయిస్తారా లేక కొన్ని స్థానాలు కోత పెడతారా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. అదే జరిగితే జనసేన అభిమానులకు మరింత నిరాశ తప్పకపోవచ్చునంటున్నారు. 18 స్థానాలకన్నా కూడా తగ్గితే ఇక టిడిపితో పొత్తు పెట్టుకునే కన్నా జనసేన ఒంటరిగా బరిలోకి దిగితేనే బెటరన్న ఆలోచనలూ వినపడుతున్నాయి. అపుడు గెలిచినా ఓడినా వీరోచితంగానే ఉంటుందని వారు అంటున్నారు. జనసేనకు 18 స్థానాలు ఇస్తామంటోన్న టిడిపి ఎన్నికలు వచ్చే సరికి అందులో సగం స్థానాల్లో తమకు విధేయులైన వారినే జనసేన టికెట్ పై ఎన్నికల బరిలో దింపుతారని ఎన్నికల తర్వాత వారు చంద్రబాబు చెప్పినట్లే నడుచుకుంటారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. గతంలో చంద్రబాబు నాయుడు వివిధ పార్టీలతో పొత్తులు పెట్టుకున్నప్పుడు ఆయన చేసింది ఇదే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 2009లో మహాకూటమి ఏర్పాటు చేసినపుడు టి.ఆర్.ఎస్. కమ్యూనిస్టు పార్టీల అభ్యర్ధులు పోటీ చేసే నియోజక వర్గాల్లో టిడిపి రెబల్స్ చేత పోటీ చేయించారు చంద్రబాబు. 2014లో ఏపీలో బిజెపితో పొత్తు పెట్టుకున్నప్పుడు కూడా బిజెపి అభ్యర్ధులకు కేటాయించిన స్థానాల్లో టిడిపి రెబల్స్ కు చంద్రబాబు బీఫారాలు ఇచ్చారు. రేపు జనసేనతో పొత్తు పెట్టుకుని సీట్లు కేటాయించినా కూడా అదే చేస్తారని అంటున్నారు రాజకీయ పండితులు.

చంద్రబాబు నాయుడి రాజకీయ ప్రస్థానం గురించి తెలిసిన వారు అయితే పవన్ కళ్యాణ్ చాలా జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు. కల్మషాలు, మాయామర్మాలు తెలీన పవన్ కళ్యాణ్ ను చంద్రబాబు నాయుడు బోల్తా కొట్టించే అవకాశాలు ఎక్కువంటున్నారు వారు. అయితే పదిహేనేళ్లుగా రాజకీయాల్లో కొనసాగుతున్న పవన్ కళ్యాణ్ అంత అమాయకుడేమీ కారని జనసైనికులు అంటున్నారు. పవన్ కు అన్ని విషయాలపైనా అవగాహన ఉందని అందరు నేతల తీరుపైనా స్పష్టత ఉందని వారు అంటున్నారు. కాకపోతే పవన్ కళ్యాణ్ సరియైన సమయం వచ్చినపుడు సరియైన నిర్ణయాలు తీసుకుంటారని వారు చెబుతున్నారు.