యుద్ధానికి సిద్ధం ( కేసీఆర్, రేవంత్,బండి )
తెలంగాణాలో ఎన్నికల వాతావరణం వచ్చేసింది. ప్రధాన రాజకీయ పార్టీలు ఒక్కసారిగా దూకుడు పెంచేశాయి. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా విజయభేరి మోగించేది మేమే అని ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. పాలక భారత రాష్ట్ర సమితి హ్యాట్రిక్ విజయంతో మురిసిపోవాలని ముచ్చటపడుతోంది. ప్రత్యేక తెలంగాణాలో బోణీ కొట్టాలని కాంగ్రెస్, బిజెపిలు తహతహలాడుతున్నాయి. మూడు పార్టీలూ తమ తమ పార్టీ శ్రేణులను యుద్ధానికి సిద్ధం చేస్తున్నాయి. గెలిచేది మనమే అని ధీమాలూ వ్యక్తం చేస్తున్నాయి. ఒక్కసారిగా రాజకీయ వాతావరణం రోహిణీ కార్తెను మించి వేడెక్కేసి సెగలు కక్కుతోంది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని రెడీ అవుతోన్న బి.ఆర్.ఎస్. పార్టీ మును ముందుగా ఈ ఏడాది చివర్లో తెలంగాణాలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయంపై దృష్టి సారిస్తోంది. 2024 ఎన్నికల్లో కేంద్రంలో అధికారాన్ని సొంతం చేసుకోవాలని పట్టుదలగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కర్నాటక బాటలోనే మరో దక్షిణాది రాష్ట్రం అయిన తెలంగాణాలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కసిగా ఉంది. కేంద్రంలో వచ్చే 2024లో జరిగే ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తోన్న భారతీయ జనతా పార్టీ తెలంగాణాను తమ ఖాతాలో వేసుకోవాలని భావిస్తోంది.
భారత రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు పార్టీ ఎమ్మెల్యేలందరితో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఒక విధంగా ఎన్నికలకు సమాయత్తం కావాలంటూ వారికి దిశా నిర్దేశనం చేసేందుకే ఈ భేటీ ఏర్పాటు చేశారు. పనిచేసే సిటింగులందరికీ టికెట్లు గ్యారంటీ అన్న కేసీయార్ పనితీరు బాగాలేని వారికి టికెట్లు ఉండవని హెచ్చరించారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బి.ఆర్.ఎస్.105 స్థానాలు గెలుచుకోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సర్వేలన్నీ మనకే అనుకూలంగా ఉన్నాయి అనుక్షణం జనంలో ఉండండి ప్రభుత్వం చేసిన అభివృద్దిని వారికి వివరించి చెప్పండి అని సూచించారు. తెలంగాణా కాంగ్రెస్ నాయకత్వంలో గతంలో లేని ఆత్మవిశ్వాసం ఇపుడు తొణికిసలాడుతోంది. గట్టిగా ప్రయత్నం చేస్తే తెలంగాణాలో తమ విజయాన్ని ఎవరూ ఆపలేరన్న ధీమా పెరిగింది. కర్ణాటక అడుగు జాడల్లో తెలంగాణాలో ప్రజలను తమవైపు తిప్పుకుని బి.ఆర్.ఎస్. అవినీతిపై పోరాడాలని కృతనిశ్చయంతో ఉన్నారు హస్తం పార్టీ నేతలు. కర్నాటకలో వైరి వర్గాలుగా ఉన్న డి.కె.శివకుమార్-సిద్ధరామయ్యలు ఎన్నికల ముందు తమ మధ్య ఉన్న తగాదాలు గొడవలు మర్చిపోయి చేతులు కలిపారు. స్నేహ హస్తం అందించుకుని పార్టీని ముందుకు నడిపారు. అదే విజయంలో కీలక పాత్ర పోషించింది. తెలంగాణాలోనూ ఆ ఫార్ములానే అమలు చేయాలని నిర్ణయించుకున్నారు. పార్టీని బలోపేతం చేసుకోవాలంటే పార్టీని వీడిన సీనియర్ నేతలను తిరిగి పార్టీలోకి ఆహ్వానించాలని డిసైడ్ అయ్యారు. ఈ క్రమంలో భాగంగానే పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మీడియా సాక్షిగా మాజీలను పార్టీలోకి స్వాగతించారు. వివేక్ వెంకట స్వామి, కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి, కొండా విశ్వేశ్వర రెడ్డి, ఈటల రాజేందర్ లు కాంగ్రెస్ పార్టీలో చేరాలని పిలుపు నిచ్చిన రేవంత్ రెడ్డి పార్టీకోసం తాను పదిమెట్లు దిగి రావడానికి కూడా సిద్ధమే అన్నారు. పార్టీలో సీనియర్లను కూడా ఒక్కతాటిపైకి తెచ్చి గాంధీలు రూపొందించిన పంచ సూత్ర అస్త్రంతో దూసుకుపోవాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు.
బి.ఆర్.ఎస్. కాంగ్రెస్ పార్టీలకు దీటుగా తెలంగాణా బిజెపి సైతం కొత్త వ్యూహాలతో ముందుకు వస్తోంది. ఎన్నికల్లో పార్టీని గెలిపించుకునేందుకు ప్రతీ ఒక్కరూ పాటు పడాలని బిజెపి వ్యూహకర్తలు సూచిస్తున్నారు. పార్టీలో కీలక నేతలైన వివేక్ వెంకటస్వామి, కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి, ఈటల రాజేందర్ లను పార్టీ అగ్రనేత అమిత్ షా ఢిల్లీ పిలిపించుకుని ప్రత్యేకంగా భేటీ అయ్యారు. చేరికల కమిటీ అధ్యక్షుడైన ఈటల రాజేందర్ ను రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లోకి ఆహ్వానించిన తరుణంలోనే ఈటల అమిత్ షాతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇతర పార్టీల నుంచి కీలక నేతలను బిజెపిలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేయాలని అమిత్ షా ఈ నేతలకు సూచించినట్లు తెలుస్తోంది. బిజెపిలో చేరిన ఇతర పార్టీల నేతల్లో కొందరు అసంతృప్తిగా ఉన్నారన్న వార్తలపై అమిత్ షా ఆరా తీసినట్లు సమాచారం. పార్టీలోకి వచ్చిన ప్రతీ నేతకీ సరియైన ప్రాధాన్యత నివ్వాల్సిందిగా షా సూచించినట్లు చెబుతున్నారు. మొత్తానికి పాలక పక్షమైన బి.ఆర్.ఎస్ తో పాటు అధికారం కోసం పోటీ పడుతోన్న కాంగ్రెస్, బిజెపిలు కూడా గేర్ మార్చాయి. పార్టీ శ్రేణులను యుద్ధానికి సిద్ధం చేస్తున్నాయి. ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ సిద్దాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచిస్తున్నాయి. బి.ఆర్.ఎస్. ప్రభుత్వ సుదీర్ఘ పాలన పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకతే తమకి వజ్రాయుధం అవుతుందని కాంగ్రెస్ భావిస్తోంది. తమకి అసలు వ్యతిరేక ఓటు అన్నదే లేదని బి.ఆర్.ఎస్. అంటోంది. తాము చేసిన అభివృద్ధి అందించిన సంక్షేమాలలో అన్ని వర్గాల ప్రజలూ సంతోషంగా ఉన్నారని గులబీ నేతలు అంటున్నారు. కాంగ్రెస్-బి.ఆర్.ఎస్.లను వెనక్కి నెట్టి తెలంగాణాలో అధికారాన్ని సొంతం చేసుకుంటామని బిజెపి నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణా ఎన్నికల్లో విజయం సాధించి 2024 సార్వత్రిక ఎన్నికలకు పూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగాలని కాంగ్రెస్-బిజెపిలు పంతంగా ఉన్నాయి.
పార్టీలు గేర్లు మార్చాయి సరే. అయితే తెలంగాణాలో సత్తా చాటేది ఎవరు. కర్నాటకలో గెలిచింది కాబట్టి తెలంగాణాలోనూ కాంగ్రెస్సే గెలిచేస్తుందన్న గ్యారంటీ ఉంటుందా బిజెపి అక్కడ ఓడిపోయింది కాబట్టి తెలంగాణాలోనూ ఓడిపోతుందని అంచనా వేసేస్తారా అని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. కర్నాటక ఫలితాన్ని ఆధారం చేసుకుని తెలంగాణాలో అంచనాలు వేసుకుంటే అది పొరపాటే అవుతుందని వారంటున్నారు. తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీకి సానుకూల వాతావరణం అయితే కనిపిస్తోంది. కాకపోతే ఆ పార్టీకి ఉన్న అతి పెద్ద సమస్య నేతల మధ్య ఐక్యతా లోపమే. ఒకరంటే ఒకరికి పడదు. అందరూ ముఖ్యమంత్రి అభ్యర్ధులే. భిన్న ధృవాల్లాంటి నేతలు పార్టీని తలో దిక్కుకూ లాక్కుపోతారు. అదే పార్టీకి శాపంగా పరిణమిస్తోంది. పార్టీలో అందరూ ఐక్యంగా ఉంటే మాత్రం వారి ప్రత్యర్ధులకు కష్టాలు తప్పవు. కాంగ్రెస్ కు ఆ ఐక్యతే విజయాన్ని తెచ్చి పెడుతుంది. మూడు పార్టీలూ భిన్నమైన వ్యూహాలతో దూసుకుపోతున్నాయి. పాలక బి.ఆర్.ఎస్.పార్టీ కాంగ్రెస్, బిజెపిల ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ పావులు కదుపుతున్నారు.
తెలంగాణా సాధించిన తమని మూడో సారి అధికారంలోకి తెస్తారని తెలంగాణా ప్రజలపై చాలా నమ్మకం పెట్టుకున్నారు కేసీయార్. తెలంగాణాలో ఇప్పటికీ బి.ఆర్.ఎస్. బలంగానే ఉంది. మరీ అంత బలహీన పడిపోలేదు. ఎన్నికల నాటికి బి.ఆర్.ఎస్. పాలనకు తొమ్మిదేళ్లు నిండుతాయి కాబట్టి కొద్ది పాటి ప్రభుత్వ వ్యతిరేకత ఉండే అవకాశాలయితే ఉంటాయి. దాన్ని అధిగమించడానికి పాలక పక్షం ప్రయత్నిస్తుంది. దాన్ని తమకి అనుకూలంగా మలుచుకోడానికి కాంగ్రెస్ -బిజెపిలు ప్రయత్నిస్తాయి. కేసీయార్ మాత్రం కాంగ్రెస్ బిజెపిలు రెండూ బలంగా ఉండి ముక్కోణపు పోటీ రావాలని కోరుకుంటారు. కర్నాటకలో కాంగ్రెస్ అనుసరించిన లోకల్ ఫార్ములానే బిజెపి కూడా అంది పుచ్చుకోవాలంటున్నారు విశ్లేషకులు. లోక్ సభ ఎన్నికల్లో మోదీ ప్రభంజనం కనిపించి రాష్ట్రాల ఎన్నికల్లో కనిపించకపోవడానికి అదే కారణం అంటున్నారు వారు. లోకల్ అజెండాతోనే తెలంగాణాలో బిజెపి ముందుకు పోవాలని వారు సూచిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అతి పెద్ద వైఫల్యం తాను చేసింది చెప్పుకోలేకపోవడమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 2014లో తెలంగాణా రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్సే. రాష్ట్రాన్ని ఇచ్చింది కానీ మేమే ఇచ్చాం అని గట్టిగా చెప్పలేకపోయింది. ఇవ్వండని అడిగిన కేసీయార్ పార్టీకి ప్రజలు అధికారం కట్టబెట్టారు. తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న అసలు సమస్య నాయకత్వ లోపమే. అందరినీ ఒక్కతాటిపైకి తెచ్చే నేతలూ లేరు. జనాన్ని ఆకర్షించగల క్రౌడ్ పుల్లర్లూ లేరు. దాన్ని అధిగమించి అందరూ కలిసికట్లుగా అడుగులు వేస్తే పార్టీకి మేలు జరుగుతుందంటున్నారు. తెలంగాణాలో ముక్కోణపు పోటీ హోరా హోరీగా సాగడం ఖాయమంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఫలానా పార్టీ కచ్చితంగా అధికారంలోకి వస్తుందని ఇప్పుడే జోస్యాలు చెప్పడం కరెక్ట్ కాదని వారంటున్నారు. హ్యాట్రిక్ విజయం కోసం తపిస్తోన్న బి.ఆర్.ఎస్. ఈ సారి గట్టి పోటీ ఎదుర్కోక తప్పదని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. బి.ఆర్.ఎస్. కు సవాల్ విసిరే క్రమంలో కాంగ్రెస్ మరింత దూకుడు ప్రదర్శించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అంత మాత్రాన బిజెపిని తక్కువగా అంచనా వేయరాదంటున్నారు. ఒక్కటి మాత్రం నిజం. తెలంగాణా లో మూడు పార్టీలకూ పక్కా వ్యూహాలు ఉన్నాయి. ఎవరి ఆలోచనలు వారికి ఉన్నాయి. ఎవరూ ఎవరికీ తీసిపోరు. కర్నాటకలో ఓడిన బిజెపి తెలంగాణాలో సత్తా చాటే అవకాశాలూ ఉన్నాయి. లేదా కాంగ్రెస్ పార్టీ కర్ణాటక విజయాన్ని రిపీట్ చేయనూ వచ్చు. ఈ రెండూ కాకుండా బి.ఆర్.ఎస్. హ్యాట్రిక్ కొట్టచ్చు. దేన్నీ కాదనలేం. దేన్నీ ఔననలేం. ఏమన్నా ఓటర్లే అనాలి. వారే తీర్పు చెప్పాలి.