జీఎస్టీ వసూళ్లన్నీ పేదల రక్తమే – ఈ లెక్కలే సాక్ష్యం !

By KTV Telugu On 23 May, 2023
image

దేశంలో పన్నుల పరిధిలోకి వచ్చే వారు పది శాతం మంది కూడా లేరు. అందుకే నిధుల కొరత ఉందని కేంద్ర ప్రభుత్వ పెద్దలు చాలా సార్లు సాకులు చెప్పి ఉంటారు. గత నెల అంటే ఏప్రిల్‌లో రూ.1.87 లక్షల కోట్ల జీఎస్టీ వసూలయింది. మరి ఈ పన్నులంతా ఎవరు కట్టారు? ఆ పన్ను పరిధిలోకి వచ్చే వారు కూడా కట్టారు. మిగతా దేశంలో ఉన్న జనాభా అంతా కట్టారు. ఆ పన్ను పరిధిలోకి వచ్చే వారు డబుల్ కట్టారు. కానీ ఎంత కట్టినా అది స్వల్పమే. నిజానికి దేశంలో పన్నుల కడుతున్న వారు ముఖ్యంగా ప్రభుత్వానికి లక్షల కోట్ల ఆదాయం తెస్తున్న జీఎస్టీ, పెట్రోల్, డీజిల్ వంటి వాటిపై వస్తున్న లక్షల కోట్ల ఆదాయం నిరుపేదల నుంచే ప్రభుత్వానికి వెళ్తోంది. ఆశ్చర్యకరంగా ఉన్నా ఇది నిజం. ప్రపంచ ప్రఖ్యాత ఆర్థిక నివేదిక సంస్థ ఆక్స్ ఫామ్ ఈ విషయాన్ని గణాంకాలతో సహా వివరించింది.

ఏప్రిల్‌లో రూ.1.87 లక్షల కోట్ల జీఎస్టీ వసూలయితే మే నెలలో అది రెండు లక్షల కోట్లు కావొచ్చు. అంటే కేంద్ర ప్రభుత్వానికి జీఎస్టీ ద్వారా రూ. రెండు లక్షల కోట్లు ఒక్క నెలలో వస్తుంది. ఇందులో జనాభా పరంగా చూస్తే ఎవరు ఎంత పన్నులు కట్టారు అంటే నిరుపేదల సొమ్మే అత్యధికం. రెండు లక్షల కోట్ల రూపాయల్లో 64 శాతం అంటే లక్షా ఇరవై వేల కోట్ వరకూ దేశంలో 50 శాతం జనాభా చెల్లిస్తున్నారు. వీళ్లంతా ఎవరు కనీసం మధ్యతరగతి వారు కూడా కాదు. రోజువారీ కూలీలు చిరు వ్యాపారులు చిరు ఉద్యోగులు. ఒక్క నెల జీతం రాకపోతే జీవితాలు తలకిందులు అయ్యే వాళ్లు. ఈ కుటుంబాలు రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించిన సొమ్ములో లక్ష ఇరవై వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ రూపంలో వసూలు చేసుకుంటోంది. మరి మిగతా మొత్తం అంతా ధనవంతులే కడుతున్నారా అంటే అంత సీన్ లేదు తర్వాత వాటా మధ్యతరగతి ప్రజలది. నెలకు రూ. రెండులక్షల కోట్లు వసూలు అవుతున్నాయంటే అందులో 33 శాతం అంటే 66 వేల కోట్లు మధ్యతరగతి ప్రజలు కడుతున్నారు. వీరు కాస్త స్థిరపడిన కుటుంబాలే కానీ ధనికులు కాదు. కాస్త కంఫర్టబుల్ లైఫ్ ను లీడ్ చేస్తున్న వారు.

ఇక దేశలో ధనవంతులు కడుతున్న జీఎస్టీ కేవలం మూడు శాతం. అంటే మొత్తం జీఎస్టీ రెండు లక్షల కోట్లు వసూలయితే ఈ రిచ్ పీపుల్ కట్టేది మొత్తంగా ఆరు వేల కోట్లు మాత్రమే. అటే మన దేశంలో నిరుపేదలు, మధ్యతరగతి వాళ్లు ధనవంతుల కంటే ఆరు రెట్లు ఎక్కువగా పరోక్ష పన్నులు కడుతున్నారు. ఆదాయపు పన్ను అంటే ప్రత్యక్ష పన్ను. ఇలా జీఎస్టీల మీద తెలియకుండ భారం వేసి తాగే నీళ్ల దగ్గర్నుంచి ప్రతీ వస్తువు మీద పన్ను వేసి లాగేయడం పరోక్ష పన్నులు. ఈ పరోక్ష పన్నుల భారం అంతా నిరుపేదల మీదనే పడుతోంది. ఈ జీఎస్టీలకు తోడు అదనంగా పెట్రోల్, డీజిల్‌పై పన్నులు ఉంటాయి. ఒక్కో లీటర్ మీద కట్టే పన్ను డెబ్భై రూపాయల వరకూ ఉంటుంది. అంటే ఒక్క నెలలో ఓ మధ్య తరగతి జీవి పది లీటర్లు పెట్రోల్ కొట్టిస్తే రూ. ఏడు వంద రూపాయలు పన్ను కట్టేసినట్లే. అదే ఏడాదికి లెక్కలేసుకుంటే ఎనిమిది వేల నాలుగు వందల రూపాయలు. అంత మొత్తం ఉంటే మధ్యతరగతి ప్రజలు తమ చిరు కోరికల్ని తీర్చుకుంటారు. కానీ ప్రభుత్వం ఆ అవకాశం ఇవ్వడం లేదు.

కరోనా తర్వాత దేశంలో విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. మధ్యతరగతి జీవులు నిరుపేదలయ్యారు. కానీ ధనికులు మాత్రం మరింత ధనికులయ్యారు. 2020లో దేశంలో 102 మంది బిలియనీర్లు ఉంటే 2022కి వారి సంఖ్య 166కు పెరిగింది. దేశంలోని టాప్ 100 బిలియనీర్ల సంపద దాదాదపు రూ.54.12 లక్షల కోట్లుగా ఉంది. 2012-21 మధ్య దశాబ్ద కాలంలో దేశంలో సృష్టించబడిన సంపదలో 40 శాతం ధనవంతుల వద్దకు వెళ్లిపోయిందని నివేదిక తేల్చింది. దేశ జనాభాలో వీరు 1 శాతం మాత్రమే ఉండగా 40 శాతం సంపద వారి వద్దకే వెళ్లింది. అదే సమయంలో దేశంలో ఆదాయపరంగా దిగువన ఉన్న 50 శాతం మందికి చేరిన సంపద 3 శాతం మాత్రమే. దేశంలో కేవలం 5 శాతం మంది వద్దే 60 శాతం సంపద పోగుపడిందని నివేదికలో వెల్లడించారు. అంటే ధనవంతులు మరింత ధనవంతులు అవుతున్నారు. కానీ నిరుపేదలు మాత్రం ఎక్కువ పన్నులు కట్టి మరింత పేదలవుతున్నారు. ఇవన్నీ ఆక్స్ ఫామ్ సంస్థ తన నివేదికల్లో వెల్లడించింది.

2019లో కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ ట్యాక్స్‌ను 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గించింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో కార్పొరేట్లకు ఇచ్చిన ఇన్సెంటీవ్స్, మినహాయింపుల విలువ రూ.1,03,285 కోట్ల కంటే ఎక్కువే. ఇది కేంద్ర ప్రభుత్వం 1.5 ఏళ్లకు గాను ఉపాధి హామీ పథకానికి వెచ్చించిన మొత్తంతో సమానం. ఇది గత కొన్నేల్లుగా పెరుగుతూనే ఉంది. ఆదాయ పన్ను చట్టం–1961 ప్రకారమే కార్పోరేట్లకు పన్నుల మినహాయింపులు, ప్రోత్సాహకాలు, వివిధ తగ్గింపులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని, ఆర్థికంగా ఇబ్బందులో ఉన్న కంపెనీలకు ఊతం ఇచ్చేందుకు ఈ చర్యలు ఉపయోగకరంగా కేంద్రం చెబుతోంది. దేశంలో ప్రాంతీయ అసమానతలను తొలగించే చర్యల్లో భాగంగా పెట్టుబడిదారులకి కార్పొరేట్‌ ట్యాక్స్‌ మినహాయింపులిచ్చినట్టు సమర్థించుకుంటున్నారు. కానీ కార్పొరేట్లకు పన్ను మినహాయింపులిస్తే ఇతర వర్గాలు ఎలా బయటపడతాయో వారికి ఎలా లబ్ది కలుగుతుందో మాత్రం చెప్పడం లేదు.

పన్ను చెల్లించే వారినే మరింత పిండుకోవడం కేంద్ర ప్రభుత్వ నైజంలా మారంది. జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్‌, డీజిల్‌ వంటి వస్తువు లను తేవాలన్న డిమాండ్‌ చాలాకాలంగా ఉంది. కానీ ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవడం లేదు. గృహ అవసరాలకు సరఫరా చేసే గ్యాస్‌ సిలిండర్ల ధరను అదే పనిగా కేంద్రం పెంచే స్తోంది. ఈ ప్రభుత్వం పెద్ద వర్గాలకు మాత్రమే ప్రయోజనకారిగా ఉందనే అభిప్రాయం బలపడుతోంది. జీఎస్టీ వసూళ్ళ లో పెద్ద వ్యాపార స్తులకు కల్పించే వెసులుబాటు తమకు కల్పించడం లేదని చిన్న వ్యాపారులు వాపోతున్నారు. ఇటువంటి తేడాలు లేకుండా చేస్తే ఆదాయం ఇంకా పెరుగుతుంది. జీఎస్టీ లో సేవల ద్వారా వచ్చే ఆదాయమే సింహభాగంగా ఉంటోంది. కొన్ని వస్తువులపై జీఎస్టీని ఎత్తివేయాలని రాష్ట్రాలు కోరుతున్నాయి. కానీ కేంద్రం ఎలా పెంచాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. దేశ ప్రజల మధ్య ఆర్థిక అసమానతలు వీలైనంత వరకూ తగ్గిస్తే అది దేశానికి దేశ భవిష్యత్‌కు ఎంతో మంచిది. లేకుంటే ముందు ముందు ఈ అంతరాలు పెరిగిపోతే ధనంతులు పన్నుల కట్టేది తక్కువ సామాన్య ప్రజల్ని పిండుకునేది ఎక్కువ అయితే వారు తిరిగుబాటు చేస్తారు. అది దేశానికి మంచిది కాదు.