కూసుకుంట్ల వైపే కేసీఆర్ మొగ్గు

By KTV Telugu On 7 October, 2022
image

– మునుగోడు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

మునుగోడు ఉపఎన్నికకు టీఆర్ఎస్ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఇవాల్టీ నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అవడంతో కూసుకుంట్ల పేరును కేసీఆర్ అధికారికంగా కేసీఆర్ ప్రకటించారు. మూడు ప్రధాన పార్టీల తరపున పోటీ చేయబోయే అభ్యర్థులు ఖరారు కావడంతో మునుగోడులో రాజకీయ వాతావరణం వేడెక్కింది. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 2003 నుంచి టీఆర్ఎస్ లో యాక్టివ్‌గా పని చేస్తున్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన మునుగోడు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2018 ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో మునుగోడు ఎమ్మెల్యేగా కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇటీవల తన పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరిపోయారు. దాంతో ఈ నియోజకవర్గంలో ఉపఎన్నిక అనివార్యమైంది. ప్రస్తుతం జరుగుతున్న ఉప ఎన్నికలో ఆయనే బీజేపీ తరపున పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ తరపున పాల్వాయి స్రవంతి బరిలో నిలిచారు. గతంలో కూసుకుంట్లకు టికెట్ కేటాయించవద్దంటూ సొంత పార్టీ నేతలే ఆందోళన చేశారు. జిల్లా మంత్రి జగదీశ్వర్ రెడ్డిని కలిసి తమ నిరసన వ్యక్తం చేశారు. కానీ చివరికు సీఎం కేసీఆర్‌ కూసుకుంట్ల వైపే మొగ్గు చూపారు. మరోవైపు ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వంలో నడుస్తున్న తెలంగాణ జనసమితి కూడా మునుగోడు బరిలోకి దిగనుంది. రెండు, మూడు రోజుల్లో టీజేఎస్ అభ్యర్ధిని ప్రకటిస్తామని కోదండరాం వెల్లడించారు. ఇంకోవైపు కేఏ పాల్ కు చెందిన ప్రజాశాంతి పార్టీ తరపున ప్రజా యుద్ధనౌక గద్దర్ పోటీ చేస్తున్నారు. అన్ని ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించడంతో… మునుగోడులో హీట్‌ పెరిగిపోయింది.