G 20 టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశానికి జమ్ము కశ్మీరు వేదికగా నిలిచింది. వివిధ దేశాలకు చెందిన 60 మందికి పైగా ప్రతినిథులు ఈ సమావేశానికి తరలి వచ్చారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలతో పాటు ఆతిథ్యానికి ముగ్దులయ్యారు విదేశీ డెలిగేట్స్. మూడు రోజుల పాటు సాగిన సదస్సులో భారత్ లో పర్యాటక రంగంలో ఉన్న అవకాశాలపై అర్ధవంతమైన చర్చ జరిగింది. కాశ్మీర్ లో ఈ సదస్సు నిర్వహించడంపై అభ్యంతరాలు వ్యక్తం చేసిన పాకిస్థాన్, చైనాలను బేఖాతరు చేస్తూ భారత్ సత్తా చాటిన వైనం అదుర్సే అంటున్నారు మేథావులు.
అందాల మంచులోయలో అవకాశాలు అంది పుచ్చుకునే అంతర్జాతీయ సదస్సు జరిగింది. జమ్ము కశ్మీర్ రాజధాని శ్రీనగర్ లో మూడు రోజుల పాటు జరిగిన G20 టూరిజం వర్కింగ్ గ్రూప్ సదస్సు విజయవంతమైంది. చుట్టూరా మంచుపర్వతాలు కళ్లు చెదిరే పూల సొగసులు ఆకు పచ్చ తివాచీ పరుచుకున్నట్లు పచ్చిక మైదనాలు వాటిపై పచ్చలు పొదిగినట్లు పూల తోటలు మనసు హాయి పరిచే చల్లటి వాతావరణంతో భూతల స్వర్గంలా మెరిసిపోయే జమ్ము కశ్మీరు వివిధ దేశాల ప్రతినిథుల రాకతో మూడు రోజుల పాటు సందడి సందడిగా మెరిసిపోయింది. వచ్చిన అతిథులు కశ్మీరు సోయగాలు చూసి పిచ్చెక్కిపోయారు. అక్కడి పూల హొయలు చూసి మత్తెక్కిపోయారు. దాల్ లేక్ లో బోటు విహారాలతో సర్వం మరిచిపోయారు. జీవితకాలపు మధురానుభూతులు మూటకట్టుకుని తమ తమ దేశాలకు తరలి పోయారు. వచ్చిన వారు ఇక్కడి ఆతిథ్యానికి మురిసిపోయారు. కశ్మీరీ సంస్కృతి సంప్రదాయాలు చూసి ఆనందంతో పొంగిపోయారు. స్థానికులతో కలిసి ఆడి పాడారు. నృత్యాలు చేసి వెలిగిపోయారు.
ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన G 20 సదస్సు ఈ ఏడాది భారత దేశంలో జరగబోతోంది. అందులో భాగంగా నిర్వహించిన టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశాలకు శ్రీనగర్ వేదిక అయ్యింది. గత ఏడాదే ఈ సదస్సును శ్రీనగర్ లో నిర్వహించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఆ వెంటనే దాయాది దేశమైన పాకిస్థాన్ శ్రీనగర్ లో సదస్సు నిర్వహించడంపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది. నిజానికి పాకిస్థాన్ G20లో సభ్య దేశం కాదు. దానికి ఈ సదస్సుతో అసలు సంబంధమే లేదు. ఇక కశ్మీరు గురించి మాట్లాడే అర్హత కూడా పాకిస్థాన్ కు లేదు. ఎందుకంటే జమ్ము కశ్మీరు భారత భూభాగంలో అంతర్భాగం. అయినా పాకిస్థాన్ వదరు బోయింది. దానికి తందానా అనే చైనా కూడా వివాదస్సద స్థలంలో సదస్సు నిర్వహించడం మంచిది కాదని సన్నాయి నొక్కులు నొక్కింది. శ్రీనగర్ లో సదస్సు పెడితే తాము రాలేమంది. అంతర్జాతీయ వేదికలపై అవకాశం వచ్చిన ప్రతీ సారి భారత్ పట్ల తనకున్న వ్యతిరేకతను చాటుకునే టర్కీ కూడా ఈ సదస్సును వ్యతిరేకించింది. చైనా, టర్కీలు రానంత మాత్రాన కొంపలేమీ అంటుకుపోవన్న భారత ప్రభుత్వం ఎవరు ఎన్ని కుయుక్తులు పన్నినా జమ్ము కశ్మీరు లోనే సదస్సు నిర్వహించి తీరతామని దాన్ని ఎవరూ అడ్డుకోలేరని స్పష్టం చేసింది. అయితే పాకిస్థాన్ మాత్రం తన కుట్రలు ఆపలేదు. వివిధ దేశాలకు లేఖలు రాసి కశ్మీరు సదస్సుకు వెళ్లవద్దని పిలుపు నిచ్చింది. సదస్సుకు వ్యతిరేకంగా ప్రకటనలు చేయాలని కోరింది. అయితే చైనా టర్కీలు మినహా ఏ దేశమూ పాకిస్థాన్ వినతిని పట్టించుకోలేదు.
ఇదే భారత్ సాధించిన అతి పెద్ద దౌత్య విజయం అంటున్నారు విశ్లేషకులు. పాకిస్థాన్ వద్దు వద్దు అంటోంటే సదస్సుకు కొద్ది వారాల ముందే వివిధ దేశాలకు చెందిన కార్పొరేట్ దిగ్గజాలు తమ ప్రతినిథులను కశ్మీరుకు పంపి అక్కడ తమ వ్యాపారాలకు టూరిజంలో పెట్టుబడులకు అవకాశాలు ఎలా ఉన్నాయో చూసి రమ్మని పంపించారు. ఇది పాకిస్థాన్ కు పుండు మీద కారం చల్లినట్లయ్యింది. ఈ సదస్సు జరక్కూడదని కోరుకోవడం తప్ప దాన్ని ఆపడానికి ఏమీ చేయలేని నిస్సహాయత పాక్ ఆర్మీని మరింతగా కృంగదీసి ఉంటుందని మేథావులు అంటున్నారు. G 20 సమావేశాలు దేశంలోని పలు నగరాల్లో నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే ఈ సదస్సును శ్రీనగర్ లో నిర్వహించారు. సదస్సుకు వచ్చిన అతిథులకు కశ్మీరీ సంస్కృతీ సంప్రదాయాలతో బాజా భజంత్రీలతో స్వాగతం పలికారు. వచ్చిన అతిథులు ఇక్కడ ఏర్పాటు చేసిన ఆర్ట్స్ ఎగ్జిబిషన్ లు చూసి ఆనందించారు. సదస్సు నిర్వహణ ద్వారా జమ్ము కశ్మీరు ను మరోసారి ప్రపంచానికి పరిచయం చేసినట్లయ్యింది. మోదీ ప్రభుత్వ విధానాల పుణ్యమా అని జమ్ము కశ్మీరు లో పర్యాటకుల సంఖ్య ఏటా పెరుగుతూ వస్తోంది. గత ఆర్ధిక సంవత్సరంలో ఏకంగా ఒక కోటి అరవై లక్షల మంది పర్యాటకులు కశ్మీరు వచ్చి సేదతీరి వెళ్లారు. ఇది కశ్మీరీలకు ఉపాధి అవకాశాలు పెంచింది. కశ్మీరు ప్రజలు అంది వచ్చిన అవకాశాన్ని రెండు చేతులతోనూ ఒడిసి పట్టి మురిసిపోతున్నారు. సదస్సుతో జమ్ము కశ్మీరు ప్రపంచ దేశాల ప్రజల నోళ్లల్లో నానుతోంది. ఇది రాబోయే కాలంలో పర్యాటక రంగానికి కొత్త ఊపు నిస్తుందని అంచనాలు వేస్తున్నారు. జమ్ము కశ్మీరు ఇంత హాయిగా ఉండడం పాకిస్థాన్ కు నచ్చదు. పాకిస్తాన్ కు నచ్చదు కాబట్టి చైనాకు ఇష్టం ఉండదు. అయితే ఆ రెండు దేశాలూ ఏడవడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి అంటున్నారు రాజకీయ పరిశీలకులు.
70 ఏళ్లల్లో మొట్ట మొదటి సారిగా జమ్ము కశ్మీరు ఒక అంతర్జాతీయ సదస్సుకు వేదికగా నిలిచింది. అది కూడా అత్యంత ప్రతిష్ఠాత్మకమైన G 20 సదస్సుకు ఆశ్రయమిచ్చింది. అగ్రదేశాల ప్రతినిథులను మురిపించింది. ఇక రానున్న కాలంలో జమ్ము కశ్మీరు మరిన్ని అంతర్జాతీయ కార్యక్రమాలతో బిజీ కావడం ఖాయమంటున్నారు పర్యాటక రంగ ప్రముఖులు.
ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్‌లో ఒక ప్రతిష్ఠాత్మక కార్యక్రమం జరగడం ఇదే తొలిసారి. దీంతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది జమ్మూకశ్మీర్ యంత్రాంగం. పారామిలిటరీ బలగాలు, NSG కమాండోలను పెద్దఎత్తున మోహరించింది. దాల్ సరస్సులో నిరంతరం గస్తీ కాశారు మెరైన్ కమాండోస్. 2019లో ఆర్టికల్ 370ని రద్దు చేసింది మోదీ ప్రభుత్వం. ఆ తర్వాత జమ్ము కశ్మీరు అభివృద్ధికి ఎన్నడూ లేని విధంగా నిధులు మంజూరు చేసింది. ఆర్టికల్ 370 రద్దును దాంతో ఏ మాత్రం సంబంధంలేని పాకిస్తాన్ తో పాటు టర్కీకూడా వ్యతిరేకించాయి. అయితే వారికి అంతర్జాతీయ సమాజం నుండి మద్దతు లేకపోయింది. జమ్ము కశ్మీరును పాక్ లో కలుపుకునే వీలు లేక నిత్యం కశ్మీరు లోయలో ఉగ్రహింస రాజేస్తూ వచ్చింది పాకిస్థాన్. అయితే వాటిని భారత ఆర్మీ సమర్ధవంతంగా తిప్పికొడుతూనే వచ్చింది. ఆర్టికల్ 370 రద్దుతో కశ్మీరులో పాక్ కుట్రలకు అడ్డుకట్ట పడ్డట్లయ్యింది. నిజానికి ఒకప్పుడు జమ్ము కశ్మీరు ప్రపంచం అసూయ పడే పర్యాటక కేంద్రంగా వెలుగొందింది. ఇప్పటికీ దానికి అంతే గ్లామర్ ఉంది. కశ్మీరులోయలో ఉన్నన్ని ప్రకృతి అందాలు దేశంలో ఇంకెక్కడా లేవు కాబట్టి సినీ రంగం కూడా కశ్మీరుపై మనసు పారేసుకుంది. ఇప్పుడు కాదు దశాబ్ధాల క్రితమే జమ్ము కశ్మీరు లో సినిమాల షూటింగులు నిరంతరం జరిగేవి. పాకిస్థాన్ ఎలాగూ భారత్ పై విద్వేషం వెళ్లగక్కుతూనే ఉంటుంది. అందులో ఆశ్చర్యం లేదు. పాక్ ను వెనకేసుకొస్తోన్న చైనా వైఖరే వింతగా ఉంది.
కశ్మీరులో సదస్సు నిర్వహిస్తే అది వివాదస్పద ప్రాంతంలో నిర్వహిస్తున్నారు కాబట్టి తాము రాలేమంది చైనా. అయితే జమ్ము కశ్మీరు ఏ విధంగానూ వివాదస్పద భూమి కాదు. అది భారత్ లో భాగం. నిజానికి పాక్ ఆక్రమిత కశ్మీరు అనేదే వివాదస్పద భూమి. అక్కడ మాత్రం చైనా ఎకనామిక్ కారిడార్ నిర్మిస్తోంది. ఇది చైనా ద్వంద్వ వైఖరికి నిదర్శనం అంటున్నారు మేథావులు. జీ ట్వంటీ దేశాలన్నింటికీ పాకిస్థాన్ లేఖలు రాసింది. శ్రీనగర్ లో జరిగే సదస్సును భగ్నం చేయడానికి రకరకాల కుట్రలు పన్నింది. అయితే వీటన్నింటినీ భారత్ తుత్తునియలు చేసి విజయవంతంగా సదస్సు నిర్వహించింది. అన్నింటినీ మించి కశ్మీరు పౌరులు సదస్సుకు వచ్చిన అతిథులను సాదరంగా స్వాగతించారు. పర్యాటకులు ఎక్కువగా వస్తే తమ ఉపాథి అవకాశాలు పెరుగుతాయని వారికి తెలుసు. అందుకే అభివృద్ధిలో భాగం అయ్యేందుకు వారు సిద్ధంగా ఉన్నారు. అందుకే నభూతో నభవిష్యత్ అన్న చందాన మూడు రోజుల సదస్సు విజయవంతం కావడమే కాదు వివిధ దేశాల ప్రతినిథులు కశ్మీరు అందాలను చూసి తరించడమే కాదు కశ్మీరు సంస్కృతీ సంప్రదాయాలకు ముగ్దులయ్యారు.