బీఆర్ఎస్ తో కామ్రేడ్ల కటీఫ్ ! మరి కాంగ్రెస్ పార్టీతో

By KTV Telugu On 27 May, 2023
image

ఎవరిని ఎప్పుడు వాడుకోవాలో తెలిసినోడేరా కేసీఆర్ అని ఆయనతో బాగా టచ్ లో ఉన్నోళ్లు చెబుతారు. అవసరం ఉంటే ఇంట్లోకి పిలిచి, కూర్చోబెట్టి విందు భోజనం పెడతారట.వాళ్లతో పనిలేదనుకుంటే ప్రగతి భవన్ దరిదాపులకు కూడా రానివ్వరని అనేక సందర్భాల్లో నిరూపితమైంది. చివరకు డిప్యూటీ సీఎం మహమూద్ అలీకి కూడా ప్రగతి భవన్లోకి డైరెక్ట్ ఎంట్రీ లేదు. అవసరమైనప్పుడు పిలిపించుకుని మాట్లాడటం వరకే చేస్తారు. కొంత కాలం క్రితం కమ్యూనిస్టు పార్టీలు బీఆర్ఎస్ కు చేరువయ్యాయి. మునుగోడు ఉప ఎన్నికల్లో గాఢమైన బంధం ఏర్పడింది. బీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి వామపక్షాలు మద్దతు ప్రకటించాయి. ప్రచారం కూడా చేశాయి. కవల సోదరుల లెవల్లో బీఆర్ఎస్, వామపక్షాలు పనిచేశాయి. కూసుకుంట్ల పది వేల ఓట్ల మెజార్టీలో గెలిస్తే అది తమ గొప్పదనమేనని వామపక్షాలు చెప్పుకున్నాయి. ఆ పది వేల ఓట్లు తమవేనని అవి బీఆర్ఎస్ అభ్యర్థికి పడటం వల్లే కూసుకుంట్ల గెలిచారని ప్రచారం చేసుకున్నాయి. తర్వాత కూడా హానీమూన్ కొన్ని రోజులు బాగానే సాగింది. తర్వాతే చెడినట్లుంది.

ఇరుపక్షాలకు అవసరం తీరిందా ఎవరి దారి వాళ్లు వెదుక్కోవడమే కరెక్ట్ అవుతుందా బీఆర్ఎస్ పాపులారిటీ తగ్గిందని వామపక్షాలు నిర్థారణకు వచ్చాయా. వామపక్షాల వల్ల తెలంగాణలో ఓట్లు రాలవని కేసీఆర్ నిర్ణయానికి వచ్చారా వీటిలో ఏది జరిగిందో ఖచితంగా చెప్పడం కష్టం. ఇరు వర్గాలు దూరం జరగడం మాత్రం నిజం, చివరకు నేతలు ఎడమొహం, పెడమొహంగా ఉంటున్నారు. మీతో మాకేమిటన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సరసన కూర్చునేందుకు వామపక్ష నేతలు ఇష్టపడటం లేదు అలాంటి పరిస్థితే వస్తే ఏదో మొక్కుబడిగా కార్యక్రమం కానిచ్చేసి వెళ్లిపోతున్నారు. ఖమ్మం, నల్గొండ, కరీంనగర్ జిల్లాలో ఒకప్పుడు కమ్యూనిస్టుల ప్రాబల్యం ఎక్కువగా ఉండేది. సీపీఐ, సీపీఎంకు ఎమ్మెల్యేలుండేవారు. ప్రజా ఉద్యమాల్లో వామపక్షాలు ప్రధాన పాత్ర పోషించేవి. ఇప్పుడు ఆయా జిల్లాల్లో పార్టీ కమ్యూనిస్టు పార్టీలు బాగా వీకైపోయాయి. అందుకే బీఆర్ఎస్ వైపు చూశాయి. ఇప్పుడు మాత్రం మళ్ళి యూటర్న్ తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. మునుగోడు మైత్రి ఇప్పుడెక్కడా కనిపించడం లేదు. ఎవరి అభ్యర్థులను వారు ప్రచారం చేసుకుంటున్నారు. సింగిల్ గా నిలబడి గెలుస్తామని రెండు వర్గాలు చెప్పుకుంటున్నాయి.

బీఆర్ఎస్ పార్టీకి, వామపక్షాలకు చెడిందనేందుకు హుస్నాబాద్ నియోజకవర్గం రాజకీయమే తాజా ఉదంతంగా చెప్పుకోవచ్చు. కేసీఆర్, కమ్యూనిస్టుల మైత్రి ఖాయమన్నప్పుడు ఖమ్మం, నల్లొండలో ఉన్న కొన్ని నియోజకవర్గాలను వామపక్షాలకు కేటాయించే అంశం ప్రస్తావనకు వచ్చింది. పాత కరీంనగర్ జిల్లా ప్రస్తుత సిద్దిపేట జిల్లాలో ఉన్న హుస్నాబాద్ నియోజకవర్గం కూడా వామపక్షాలకు కేటాయిస్తారనుకున్నారు. ఇప్పుడు మాత్రం బీఆర్ఎస్ నేతలు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నియోజకవర్గవర్గం పర్యటనకు వచ్చినప్పుడు ఈ అంశంపై కుండబద్దలు కొట్టారు. వచ్చే ఎన్నికల్లో హుస్నాబాద్ లో సతీష్ కుమార్ కు లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించాలని మే 5న జరిగిన ఒక బహిరంగ సభలో ఆయన ప్రజలను కోరారు. ఇదిలా ఉండగా సీపీఐ బస్సు యాత్ర ముగింపు సందర్భంగా మే 15న హుస్నాబాద్ లో బహిరంగ సభ నిర్వహించారు. హుస్నాబాద్ నుంచి సీపీఐ అభ్యర్థిగా చాడ వెంకటరెడ్డి పోటీ చేస్తారని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ప్రకటించారు. ప్రజా సమస్యలపై చాడ వెంకటరెడ్డి పోరాటాలు చేస్తూ నిత్యం ప్రజల్లో తిరుగుతున్నారు. గతంలో ఆయన శాసనసభలో సీపీఐ పక్ష నేతగా వ్యవహరించారు.

బీఆర్ఎస్ కు దూరం జరగడంలో సీపీఐ వ్యూహం కూడా ఉందని చెబుతున్నారు. సాధ్యమైనన్ని ఎక్కువ స్థానాలలో పోటీ చేయాలన్న వ్యూహంతో వామపక్షాలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. కేసీఆర్ తో దోస్తీ ఉన్నప్పటికీ ఆయన వామపక్షాలకు తగినన్ని సీట్లు కేటాయిస్తారన్న నమ్మకం ఆ పార్టీలకు లేకపోవడంతో వామపక్షాలు వ్యూహం మార్చాయి. బీఆర్ఎస్ తో పొత్తు పక్కన పెట్టి వామపక్షాలు ఉమ్మడిగా సాధ్యమైనన్ని ఎక్కువ స్థానాలలో అభ్యర్థులను నిలబెట్టాలన్న వ్యూహంతో ఉన్నాయని ఆ పార్టీ శ్రేణులే చెబుతున్నాయి. బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ కు దగ్గరవ్వడం వల్ల జాతీయ స్థాయిలో సెక్యులర్ శక్తుల బలోపేతానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయని కూడా ఆ పార్టీలు భావిస్తున్నట్లు చెబుతున్నాయి. అధికారికంగా ఈ సంగతిని వామపక్షాల అధిష్ఠానాలు ప్రకటించకపోయినప్పటికీ తెలంగాణలో సంభవిస్తున్న పరిణామాలను పరిగణనలోనికి తీసుకుంటే వామపక్షాల వ్యూహం బీఆర్ఎస్ విషయంలో మారిందనే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇందుకు ఇటీవలి అనేక ఉదంతాలు ఉదాహరణగా చెప్పొచ్చు. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ హాత్ సే హాత్ జోడో యాత్రకు సీపీఐ సంఘీభావం ప్రకటించడం కూడా హస్తం పార్టీకి దగ్గరయ్యేందుకేనని చెబుతున్నారు. పైగా రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ కు సెక్యూలర్ పార్టీగా పేరుండటం, బీఆర్ఎస్ అధినేతను నమ్మలేమన్న ఆలోచనా విధానం వామపక్షాలను బీఆర్ఎస్ కు దూరంగా ఉంచుతోంది.