దేశంలో విపక్షాలు ఏం చేస్తున్నాయయ్యా అంటే కోడి గుడ్డుపై వెంట్రుకలు పీకుతున్నాయి. ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీ ఎవరికీ ఎలాంటి ప్రయోజనమూ చేకూర్చని అంశాలను పట్టుకుని సాగదీస్తోంది. పార్లమెంటు భవన ప్రారంభోత్సవానికి రామంటూ విపక్షాలతో కలిసి బాయ్ కాట్ చేసిన కాంగ్రెస్ పార్టీ పార్లమెంటులో స్పీకర్ ఆసీనులయ్యే కుర్చీకి పక్కనే చారిత్రక రాజదండాన్ని పెడతామన్న ప్రభుత్వ నిర్ణయంపైనా రాజకీయం చేస్తోంది. ఏమా రాజదండం ఏమా రాజకీయం ఏంటి దాని వెనక ఉన్న కథ. దేశంలో విపక్షాలకు ఏది రాజకీయం చేయాలో ఏది రాజకీయం చేయకుండా హుందాగా మెలగాలో అస్సలు తెలీకుండా పోతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేశ ప్రజలంతా గర్వపడేలా కనీసం సుదీర్ఘ కాలం చెక్కు చెదరకుండా ఉండేలా నిర్మించిన పార్లమెంటు నూతన భవనంలో మన భారత చరిత్రలోనే సాంస్కృతికంగా వారసత్వ సంపదగా వచ్చిన ఓ రాజదండాన్ని ఆవిష్కరించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ తప్పు బడుతోంది.
1947లో బ్రిటిష్ పాలకులు తమ దేశానికి వెళ్లిపోయేటపుడు అధికారాన్ని భారత్ కు అప్పగించే క్రమంలో తొలి ప్రధానిగా ప్రొజెక్ట్ అయిన పండిట్ జవహర్ లాల్ నెహ్రూకి ఓ రాజదండాన్ని అందించారు. అది అధికార మార్పిడికి ఉపయోగించే చారిత్రక చిహ్నమని భావిస్తున్నారు. బ్రిటిష్ పాలనలో చిట్ట చివరి వైస్రాయ్ మౌంట్ బాటన్ ఈ రాజదండాన్ని నెహ్రూకు అందించారు. ఇలా అందించడం ద్వారా బ్రిటిష్ వలస పాలకుల నుండి భారత్ కు తిరిగి అధికారాన్ని అప్పగించినట్లుగా బిజెపి ప్రభుత్వం చెబుతోంది. అధికార మార్పిడి జరగాలనుకున్న సమయంలో మౌంట్ బాటన్ నెహ్రూను కలిసి అధికార మార్పిడి ప్రక్రియకు సంబంధించి భారత సంప్రదాయం ప్రకారం ఏమైనా పద్ధతి కానీ ఆచారం కానీ ఉన్నాయా అని అడిగారట. దానికి నెహ్రూ చివరి గవర్నర్ జనరల్ అయిన సి.రాజగోపాలాచారిని దీని గురించి అడిగారట. తమిళనాడులోని తిరువావదుతురాయ్ ఆధీనం మఠంలో ఓ రాజదండం ఉందని దాన్ని తమిళులు చాలా పవిత్రంగా భావిస్తారని చెప్పారు. అది చోళ రాజుల కాలంలో అధికార మార్పిడికి చిహ్నంగా వాడేవారని ఒక రాజు నుండి మరో రాజుకు అధికారాన్ని బదలాయించేటపుడు రాజదండాన్ని ఇవ్వడం ఆనవాయితీగా వచ్చేదని వివరించారట. దాంతో నాటి తంజావూరు లో ఉన్న ఆ మఠం నుంచి రాజదండాన్ని తెప్పించి నెహ్రూకు అప్పగించారని చెబుతున్నారు. ఆ రాజదండాన్ని తర్వాత కాంగ్రెస్ పాలకులు మ్యూజియంలో పెట్టి దాన్నొక వాకింగ్ స్టిక్ గా మిగిల్చేశారని బిజెపి ఆరోపిస్తోంది. బిజెపి చెప్పిన ఈ కథనాన్ని కాంగ్రెస్ పార్టీ తప్పు బడుతోంది. పార్టీ సీనియర్ నేత జై రాం రమేష్ మీడియాతో మాట్లాడుతూ మౌంట్ బాటన్ నెహ్రూకి రాజదండాన్ని అందించడం అధికార మార్పిడికి చిహ్నంగా అని ఎక్కడా లిఖిత పూర్వక సాక్ష్యాలు లేవని జై రాం రమేష్ వ్యాఖ్యానించారు. అయితే దీనిపై బిజెపి కేంద్ర మంత్రులు మండి పడుతున్నారు. భారత చరిత్ర అన్నా సంప్రదాయం సంస్కృతి అన్నా కాంగ్రెస్ కు ఎందుకంత చిన్న చూపో అర్ధం కావడం లేదని హోంమంత్రి అమిత్ షా అంటున్నారు.
మరో కేంద్ర మంత్రి 1947 నాటి టైమ్స్ కథనాన్ని మీడియాకు విడుదల చేశారు. విమర్శలు చేసేవాళ్లు ఓసారి ఈ కథనం చదువుకుని రాజదండం విశిష్టత ఏంటో 1947లో ఏం జరిగిందో తెలుసుకోవాలని హితవు పలికారు. తమిళనాడుకు చెందిన చరిత్రకారులైతే ఆ రాజదండం అధికార మార్పిడికి చిహ్నమో కాదో తమకి తెలీదు కానీ అది మాత్రం తమిళులకు చాలా విలువైనదని దాన్ని పార్లమెంటులో పెడితే తమిళులంతా తమకు లభించిన గౌరవంగా భావిస్తారని అంటున్నారు. దీనిపై 1947లో టైమ్స్ మ్యాగజైన్ లోనూ ఓ కథనం ప్రచురితమైందని బిజెపి గుర్తు చేస్తోంది. తాజాగా హిందూ పత్రికలోనూ ఓ కథనం వచ్చింది. అందులో మౌంట్ బాటన్ నెహ్రూ రాజాజీ ఉన్న ఫోటో ఒకటి ప్రచురించారు. ఇపుడీ రాజదండాన్ని పార్లమెంటులో పెట్టడం పై కాంగ్రెస్ కు వచ్చిన అభ్యంతరం ఏంటో అర్ధం కాదంటున్నారు మేథావులు. అది అధికార మార్పిడికి చిహ్నమో అవునో పక్కన పెడితే అది తరతరాలుగా వస్తోన్న ఓ వారసత్వ సంపదలో భాగమనేది వాస్తవమే కదా అంటున్నారు చరిత్ర కారులు. దీన్ని కూడా ఏదో ఒక విధంగా రాజకీయం చేయడమేంటని బిజెపి ప్రశ్నిస్తోంది. ఇప్పటికే పార్లమెంటు భవన ప్రారంభోత్సవాన్ని 19 విపక్షాలు బాయ్ కాట్ చేశాయి. తాజాగా మాజీ ప్రధాని జేడీయూ నేత దేవెగౌడ తాను పార్లమెంటు భవనం ప్రారంభోత్సవానికి వెళ్తున్నానని ప్రకటించారు. కాంగ్రెస్ తో పాటు ఇతర విపక్షాల నేతలు కూడా దేశమంతటికీ సంబంధించిన ప్రజాస్వామ్య సౌథం ప్రారంభోత్సవానికి హాజరై హుందాగా వ్యవహరించాలే తప్ప ప్రపంచ దేశాల దృష్టిలో దేశ ప్రతిష్ఠను మసక బార్చడం కరెక్ట్ కాదంటున్నారు విశ్లేషకులు. విదేశాంగ మంత్రి జై శంకర్ అయితే విపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేయకుండా ప్రజాస్వామ్యానికి పట్టం కట్టే పార్లమెంటు భవనం ప్రారంభోత్సవానికి హాజరు కావాలని పిలుపు నిస్తున్నారు. ఈ సెంగోల్ విశిష్టత తెలుసుకుని చారిత్రక ఆధారాలు సేకరించడానికి రెండేళ్లపాటు శ్రమించింది కేంద్రప్రభుత్వం. ప్రధాని కార్యాలయం, కేంద్ర సాంస్కృతిక శాఖ దీనికోసం పరిశోధన చేపట్టాయి