జూన్ రెండో తేదీ నాటికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తొమ్మిదేళ్లు అయింది. తెలంగాణ ఎలా సాధించారన్న విషయంపై చాలా మంది ధీరోధాత్తంగా గుర్తు చేసుకుంటారు. ఈ తొమ్మిదేళ్ల పాలన మొత్తం బీఆర్ఎస్ పాలనలో ఉంది. తెలంగాణ సాధన కోసం ఏ పార్టీ పోరాడిందో ఆ పార్టీనే అధికారంలో ఉంది. మరి తెలంగాణను అనుకున్నట్లుగా అభివృద్ధి చేశారా. ప్రజల జీవన ప్రమాణాలను మార్చేశారా..
తొమ్మిదేళ్లకు ముందు తెలంగాణ ప్రజలకు తిండి , నీరు లేవు కేసీఆర్ వచ్చిన తర్వాతనే అవి లభిస్తున్నాయన్నట్లుగా బీఆర్ఎస్ నేతలు అతిగా ప్రచారం చేస్తూండవచ్చు కానీ తెలంగాణలో తొమ్మిదేళ్లలో మౌలికమైన మార్పులు వచ్చాయని మాత్రం అంగీకించవచ్చు. తొమ్మిదేళ్లలో తెలంగాణ ప్రజల బతుకులు మార్చేశానని కేసీఆర్ ధీమాగా చెబుతున్నారు. తెలంగాణ అమెరికా అయిందని చెప్పలేం కానీ అభివృద్ధిలో ముందుకు వెళ్లిందన్న విషయాన్ని కాదనలేం. ఈ విషయం తెలంగాణలో ఉండేవారికి ఆ ఏమి అభివృద్ధిలే అనిపించవచ్చు. ఎందుకంటే ఓ ఏడాది పాపను ఇప్పుడు చూసి మరో తొమ్మిదేళ్ల తర్వాత చూస్తే అరె అప్పుడే చాలా ఎదిగిపోయిందే అని అనుకుంటాం. ఎందుకంటే చిన్నప్పుడు చూసి మళ్లీ ఇప్పుడు చూడటం వల్ల ఆ ఫీలింగ్ కలుగుతుంది. అదే పాపని తొమ్మిదేళ్ల పాటు రోజూ చూస్తుంటే ఆ ఫీలింగ్ రాదు. ప్రస్తుతం తెలంగాణ ప్రజల్లో ఆలాంటి భావనే ఉంటుంది. ఎనిమిదేళ్ల కిందట ఎలా ఉందో వారికి గుర్తు ఉండటం కష్టం. కానీ ఇప్పటి అభివృద్ధి వారి కళ్ల ముందే జరిగింది కాబట్టి పెద్దగా అద్భుతం అనిపించవచ్చు కానీ అభివృద్ధి మాత్రం నిజం.
ఎనిమిదేళ్ల కిందటి హైదరాబాద్ నగరంతో పోలిస్తే ఇప్పుడు హైదరాబాద్ ఎంతో అభివృద్ది చెందింది. ఇంకా చెప్పాలంటే విదేశీ నగరాల లుక్స్ వచ్చాయి. మిషన్ భగీరథ కాకతీయ వంటి ప్రాజెక్టులతో ప్రజల కనీస అవసరాలు తీరాయి. ఎలా చూసినా తొమ్మిదేళ్ల కిందటితో పోలిస్తే తెలంగాణ ప్రగతిని నమోదు చేసింది. ఈ ప్రగతి రోజూ చూస్తున్న వారికి మామూలేగా అనిపిస్తుంది. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా కొత్త సచివాలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అత్యున్నత నాణ్యత ప్రమాణాలతో తెలంగాణ సచివాలయం రూపుదిద్దుకుంంది. కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిన అనంతరం పాలనాపరమైన ఇబ్బందులు తలెత్తకుండా ప్రజలకు అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉం డేలా అన్ని జిల్లాల్లో సమీకృత కలెక్టరేట్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా సమీకృత కలెక్టరేట్ భవనాలను నిర్మించింది. సిగ్నల్ ఫ్రీ.. ట్రాఫిక్ ఫ్రీ ఇదే లక్ష్యంతో మహానగరంలో వీలైన ప్రతిచోట ఫ్లై ఓవర్లు నిర్మాణం చేస్తున్నారు. ఎస్.ఆర్.డి.పి ద్వారా నగరంలో నలువైపులా జిహెచ్ఎంసి ద్వారా చేపట్టిన 41 పనులలో దీంతో 30 పనులు అత్యధికం పూర్తయ్యాయి.
దేశంలోనే తొలిసారి వినూత్న కట్టడం పోలీస్ శాఖలో వివిధ విభాగాలకు చెందిన ఉన్నత అధికారులంతా ఒకే చోట నుండి రాష్ట్ర వ్యాప్తంగా క్రైమ్ మ్యానిటరింగ్ కమాండ్ కంట్రోల్ చేసేందుకు వీలుగా అతిపెద్ద కమాండ్ కంట్రోల్ సెంటర్ ను రూపొందించింది. ఒకే రోజు 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రారంభమయ్యాయి. మరికొన్నిప్రారంభం కానున్నాయి. దేశంలోనే అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేటర్ టీ హబ్ 2 ఈ ఏడాదే ప్రారంభమయింది. అలాగే హార్డ్ వేర్ ఆవిష్కరణల కోసం టీ వర్క్స్ కూడా ప్రారంభించారు. పూర్తిగా తెలంగాణ ప్రభుత్వ నిధులతోనే ఐటీ హబ్ మైండ్ స్పేస్ రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు రూ.6,250 కోట్ల అంచనాతో 31 కి.మీ దూరం మెట్రో నిర్మాణం చేపట్టనున్నారు. మైండ్‌స్పేస్ నుంచి గచ్చిబౌలి, నానక్‌రాంగూడ జంక్షన్‌ల నుంచి ఓఆర్‌ఆర్ మీదుగా శంషాబాద్ విమానాశ్రయం వరకు కొత్తగా మెట్రో రైలు సౌకర్యం రానుంది. ప్రయాణికులకు స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ స్థాయి అత్యాధునిక సదుపాయాలతో హెచ్‌ఏఎంఎల్ ఎయిర్‌పోర్టు మెట్రోను నిర్మించనుంది. 12 వందల 80 కోట్ల నిధులతో యాదాద్రిని పునర్ నిర్మించింది ప్రభుత్వం. 2015లో పునర్ నిర్మాణాన్ని మొదలు పెట్టి పూర్తి చేసిది. ఇప్పుడు ఈ ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు నల్లగొండ జిల్లా దామరచర్లలో టీఎస్‌జెన్‌కో ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న 4,000 మెగావాట్ల అల్ట్రా మెగా పవర్‌ప్లాంట్‌ను తెలంగాణకు గుండెకాయ లాంటిదని చెప్పవచ్చు. ఇక్కడ సింగరేణి బొగ్గుతోపాటు అవసరం ఏర్పడితే కృష్ణపట్నం, కాకినాడ పోర్టుల ద్వారా విదేశీ బొగ్గును కూడా త్వరితంగా దిగుమతి చేసుకొనేలా రైల్వే ట్రాక్ ఉన్నాయి.
ఎలా చూసినా కేసీఆర్ మంచి అభివృద్ధిని చేసి చూపించారు. కానీ అదే సమయంలో ఆయన తెలంగాణ సంపదను పరిరక్షించడంలో విఫలమయ్యారనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల భూముల విషయంలో ప్రభుత్వ తీరు వివాదాస్పదమవుతోంది. ధరణి అనే విధానాన్ని తీసుకు రావడం వెనుక పెద్ద స్కాం ఉందన్న ఆరోపణలు ఊరకనేరావడం లేదు. హైదరాబాద్ లో ఉన్న ప్రతి బడా రియల్ ఎస్టేట్ సంస్థ కేసీఆర్ లేదా కేటీఆర్ బినామీలేనని ప్రచారం జరగడం వెనుక భూదందా ఉందిన్న విమర్శలు వస్తున్నాయి. కోర్టుకేసుల్లో ఉన్న భూమలను పోరాడకుండా వదిలేస్తున్నారని అంటున్నారు. ఇప్పుడు దేశంలో అత్యంత ధనిక పార్టీల్లో ఒకటి బీఆర్ఎస్ సొంత విమానంతో పాటు జాతీయ రాజకీయాలు చేయడానికి కావాల్సినంత సొమ్ము ఉందని స్వయంగా కేసీఆర్ ప్రకటించారు. ఇదందా ఎలా వచ్చిందన్న సందేహం చాలా మందిలో ఉంది. కేసీఆర్ తెలంగాణ ప్రయోజనాల విషయంలో రాజీ పడరని ప్రజలు గట్టిగా నమ్ముతారు. కానీ ఇటీవలి కాలంలో కేసీఆర్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో ఆ నమ్మకం సడలిపోతోంది.
అదే సమయంలో కేసీఆర్ చేస్తున్న కుటిల రాజకీయాలతో ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది. తాను లేదా తన పార్టీ మాత్రమే రాజకీయాల్లో మనుగడ సాధించాలన్న లక్ష్యంతో ప్రజలు సంపూర్ణమైన మెజార్టీ ఇచ్చినప్పటికీ ఇతర పార్టీలను నిర్వీర్యం చేసేందుకు ఫిరాయింపులను ప్రోత్సహించారు. ఇది బీఆర్ఎస్‌లో అసంతృప్తికి కారణం అవడంతో పాటు ప్రజల్లోనూ వ్యతిరేక భావన పెంచింది. కేసీఆర్ అభివృద్ధి పరంగా తన బాధ్యతను తెలంగాణ ప్రజలు సంతృప్తి పడేలా నిర్వహించగలిగారని చెప్పుకోవచ్చు మరి ఇతర విషయాల్లో మాత్రం ఆయన తీరును ప్రజలు హర్షించడం కష్టం. ఎన్నికలకు వెళ్లి ప్రజా తీర్పు కోరబోతున్న సమయంలో నెగెటివ్సే ఎక్కువ ప్రచారంలోకి వస్తున్నాయి.