డైలాగులు అమోఘం కార్యాచరణ శూన్యం అన్నది మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిపై ఆయన ప్రత్యర్థులు వేసే సెటైర్లు. వినేవాళ్లుంటే ఆకాశాన్ని భూమిని ఏకం చేసేస్తానని కిరణ్ కుమార్ రెడ్డి చెబుతారట. తీరా చూస్తే ఆయన మాటలే కాదు ఆయన దేహం కూడా గుమ్మం దాటడం లేదని చెబుతున్నారు. ఏప్రిల్ 7న బీజేపీలో చేరినప్పటి నుంచి కిరణ్ కుమార్ రెడ్డి ఒక సారి కూడా పార్టీ కార్యక్రమంలో పాల్గొనలేదు. కిరణ్ కుమార్ రెడ్డి మంచి మాటకారి. మాటలతో ప్రత్యర్థులను పడగొట్టగలరు. కాకపోతే ఆయన చేతల్లోనే కొంత వీక్ లాగే అనిపిస్తోంది. అదృష్టం కలిసొచ్చి ముఖ్యమంత్రి అయ్యారా లేకపోతే నిజంగానే ప్రజాసేవలో టాలెంట్ ఉందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లా రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన ఆయన ఇప్పుడు మాత్రం అంత వేగాన్ని ప్రదర్శించలేకపోతున్నారు. స్పీకర్ గా పనిచేసినా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆఖరి ముఖ్యమంత్రిగా ఉన్నా రాజకీయాల్లో ఆయన సాధించిందీ శూన్యం. సొంత పార్టీ పెట్టి ఆరిపోయారే తప్ప ఒక వెలుగు వెలగలేదు. కాంగ్రెస్ లోకి వచ్చి ఓ మూల కూర్చున్న చందాన చాలా రోజులు గడిపారు. ఇప్పుడు ఆయన బీజేపీలో ఎందుకు చేరారన్న దానికి సమాధానం దొరకడం అంత సులభం కాదన్న వాదన వినిపిస్తోంది.
కిరణ్ కుమార్ రెడ్డిని ఇటీవల కొందరు ఏపీ బీజేపీ నేతలు కలిశారు. వారిని సాదరంగా ఆహ్వానించిన కిరణ్ ఏవేవో మాట్లాడారని పార్టీ విషయాలు మాత్రం ప్రస్తావించలేదని అంటున్నారు. ఏపీలో బీజేపీని మరింత బలోపేతం చేసేందుకు కిరణ్ సలహాలు తీసుకున్నామని సోము వీర్రాజు మీడియాకు వివరించడం విడ్డూరంగా ఉంది. కిరణ్ దగ్గర పార్టీ బలోపేతానికి సంబంధించి మంచి కార్యాచరణ ఉందని. ఆయన మార్గ నిర్దేశంలో పనిచేస్తామని సోమ వీర్రాజు చెప్పారు. నెలరోజుల పాటు అమెరికా వెళ్లినందున క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నానని కిరణ్ చెప్పుకున్నారు. అది ముందస్తుగా నిర్ణయించుకున్న కార్యక్రమం కావడంతో బీజేపీలో చేరిన వెంటనే ఇక్కడ ఉండకుండా వెళ్లిపోవాల్సి వచ్చిందని అందుకే కొంత గ్యాప్ వచ్చిందని కిరణ్ వెల్లడించారు. ఇకపై క్రియాశీలంగా ఉంటానని ఒట్టేశారనుకోండి. పార్టీ అధిష్టానం ఆదేశానుసారం నడుచుకుంటానని ఏపీ తెలంగాణ ఎక్కడ పనిచేయమన్నా చేస్తానని కిరణ్ కొత్తప్రతిపాదనను తెరపైకి తెచ్చారు.
కిరణ్ కుమార్ రెడ్డి విషయంలో ఒక వాదన ప్రచారంలో ఉంది. బీజేపీలో చేరడం ఆయనకు ఇష్టం లేదని చెబుతున్నారు. కొందరు కమలం నేతలు మొహమాట పెట్టడం వత్తిడి చేయడం వల్లే ఆయన బీజేపీలోకి వెళ్లారని బాగా తెలిసిన వాళ్లు చెబుతున్నారు. అందుకే మళ్లీ అవకాశం వస్తే కాంగ్రెస్ లో చేరాలని ఆయన భావిస్తున్నట్లు అదే అనుచరులు అంటున్నారు. కాంగ్రెస్ పిలిచి పదవి ఇస్తే తాను దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయానని కిరణ్ భావిస్తున్నారట. పైగా బీజేపీలో చేరే సమయంలో తనకు వేరే రాష్ట్రం నుంచి రాజ్యసభ ఆఫర్ చేస్తారని కిరణ్ ఎదురుచూసినట్లుగా వార్తలు వచ్చాయి. కమలం పార్టీ అధిష్టానం నుంచి అలాంటి సంకేతమేదీ రాకపోవడంతో మాజీ ముఖ్యమంత్రి నిరాశలో ఉన్నారని అంటున్నారు. అందుకే ఇప్పుడు అంటీ ముట్టనట్లు ఉండటం చర్చనీయాంశమైంది. ఆదిశగానే అసలు కిరణ్ మనసు తెలుసుకునేందుకు పార్టీ అధిష్టానం సోము వీర్రాజు టీమ్ ను కిరణ్ వద్దకు పంపింది. కాకపోతే ఆయన ఎక్కడా బయట పడకుండా జాగ్రత్త పడ్డారని రాజకీయ పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తున్నారని టాక్. చూడాలి మరి ఆయన మళ్లీ కాంగ్రెస్ లోకి వస్తారో లేదో.