లిక్కర్ స్కాంలో అప్రూవర్ల రాజకీయం – కేజ్రీవాల్, కవితను బలి చేస్తున్నారా ?

By KTV Telugu On 2 June, 2023
image

కొంతమంది గుంపుగా కలిసి వ్యాపారం చేశారు. అందులో రాజకీయ నేతలు కొన్ని అవకతవలకు పాల్పడ్డారు. అవన్నీ బయటపడిన తర్వాత వ్యాపారం చేసిన వారు తాము అప్రూవర్లం అయిపోతామని మొరపెట్టుకుంటున్నారు. వారికి క్షమాభిక్ష పెట్టి రాజకీయ నేతల్ని మాత్రం బలి చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో జరుగుతోంది ఇదే. తాజాగా శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారడంతో ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొదట ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు దినేష్ అరోరా అప్రూవర్ అయ్యారు. తర్వాత బుచ్చిబాబు, రామచంద్ర పిళ్లై, విజయ్ నాయర్ ఇప్పుడు శరత్ చంద్రారెడ్డి. ఒకే కేసులో నలుగురు నిందితులు అప్రూవర్లు కావడం అరుదు. వీరంతా రాజకీయ నాయకులు కాదు వ్యాపారులు. వీరందరూ అప్రూవర్లుగా మారి రాజకీయనేతల్ని బయటకు రాకుండా ఇరికించబోతున్నారు. తెర వెనుక అన్ని ఏర్పాట్లు చేసుకునే అప్రూవర్ల గేమ్ ప్రారంభించారు. ఈ గేమ్ ఢిల్లీలో కేజ్రీవాల్, తెలంగాణలో కవితలను టార్గెట్ చేశారా. ఇటీవల బీజేపీపై వాయిస్ తగ్గించిన కేసీఆర్ కవితను కాపాడుకోగలరా.

ఢిల్లీ లిక్కర్ స్కాంలో నిందితులంతా వరుసగా అప్రూవర్లుగా మారుతున్నారు. తాము ఎలా నేరం చేశామో చెబుతామని క్షమించేయాలని పిటిషన్లు వేస్తున్నారు. ఇలా అప్రూవర్లుగా మారిన వారిలో మొదట దినేష్ అరోరా ఉన్నారు. తర్వాత బుచ్చిబాబు, రామచంద్ర పిళ్లై ఉన్నారు. ఇప్పుడు శరత్ చంద్రారెడ్డి కూడా తాను అప్రూవర్ గా మారిపోయారు. వీరంతా అప్రూవర్లుగా మారడానికి తెర వెనుక చాలా జరుగుతున్నాయన్న ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. నెలల తరబడి జైల్లో ఉన్న వీరు హఠాత్తుగా ఎందుకు అప్రూవర్లుగా మారుతున్నారన్నది కీలకం. వీరంతా నిజాలు చెప్పి ఆర్థిక లావాదేవీలు, స్కాం గురించి పూర్తిగా బయటపెడితే నిండా మునిగేది ఎవరో కాదు బీజేపీ టార్గెట్ చేసిన రాజకీయ నాయకులు.

ఢిల్లీ లిక్కర్ స్కాంలో మొదట అప్రూవర్ గా మారింది దినేష్ అరోరా. ఆయన కేజ్రీవాల్‌కు అత్యంత సన్నిహితుడు. ఆయనను అరెస్ట్ చేసిన చాలా రోజులకు సాక్షిగా పరిగణించాలని కోర్టులో పిటిషన్ వేసింది సీబీఐ. ఈ కేసులో మొదట్లో సీబీఐ అరెస్ట్ ముగ్గురిలో దినేష్ అరోరా ఒకరు. దినేష్ అరోరా, ఢిల్లీ డిప్యూటీ సిఎం మనీష్ సిసోడియా సహా నిందితులందరిపై ఐపీసీ సెక్షన్ 120 బి, 477 ఏతో పాటు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 7 కింద కేసు నమోదు చేశారు. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో 2021, 2022లో రూపొందించిన ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీని స్కాం చేయడానికి అనుగుణంగా రూపొందించడంలో అరోరా కీలకమని సీబీఐ ఆరోపణ. ఈ విధానంలో భాగంగా నగరాన్ని 32 జోన్‌లుగా విభజించి 849 షాపులకు సంబంధించి ప్రైవేట్ బిడ్డర్లకు రిటైల్ లైసెన్సులు ఇచ్చారు. ఈ లైసెన్సులన్నీ ముడుపులు ఇచ్చిన వారికి వెళ్లేలా చేశారు. ఈ మొత్తం వ్యవహారాల్లో దినేష్ అరోరా కీలకపాత్ర పోషించారని సీబీఐ చెబుతోంది. ఆయన అప్రూవర్ గా మారారు. ఆయన సాక్ష్యాలతో ఇప్పటికే సిసోడియాను అరెస్ట్ చేశారు. ఇప్పుడు శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారి ఇచ్చే సాక్ష్యాలతో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నిండా మునిగిపోతారని న్యాయనిపుణులు అంచనా వేస్తున్నారు.

అయితే ఇక్కడ మునిగితే కేజ్రీవాల్ ఒక్కరే కాదు. బీఆర్‌‌ఎస్‌ ఎమ్మెల్సీ, కేసీఆర్ కుమార్తె కవిత కూడా. కవిత మాజీ ఆడిటర్‌‌ గోరంట్ల బుచ్చిబాబు అప్రూవర్‌‌గా మారాడు. కేసులో దర్యాప్తు సంస్థల విచారణకు సహకరిస్తానని చెప్పాడు. అంతకు ముందు అరుణ్ రామచంద్ర పిళ్లై కూడా అప్రూవర్ అయ్యారు. లిక్కర్ పాలసీ స్కామ్‌లో సౌత్‌గ్రూప్‌ నుంచి అరుణ్‌ రామ చంద్ర పిళ్లై, బుచ్చిబాబు కీలకంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే సీబీఐ, ఈడీ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్లలో పలుమార్లు కవిత పేరును ప్రస్తావించారు. అరుణ్‌ రామచంద్రపిళ్లై ఇచ్చిన స్టేట్‌మెంట్స్‌, ఆధారాలను కోర్టుకు సమర్పించారు. ప్రధానంగా హైదరాబాద్ కేంద్రంగా నిర్వహించిన షెల్ కంపెనీలు,బినామీల అకౌంట్స్‌ నుంచి జరిగిన హవాలా లెక్కలను ఈడీ ఒక్కోటిగా బయటపెండుతోంది. కవిత కొన్న భూముల వివరాలంటూ కోర్టుకు సమర్పిస్తున్న చార్జిషీట్లలో డాక్యుమెంట్లు సమర్పిస్తున్నారు. మరో వైపు మనీలాండరింగ్ కేసుల్లో సుఖేష్ చంద్రశేఖర్ జైలు నుంచి విడుదల చేస్తున్న లేఖలు, షెల్ కంపెనీల వివరాలుకూడా కీలకంగా మారాయి. ఇవన్నీ కేజ్రీవాల్‌, కవితను పక్కాగా ఫ్రేమింగ్ చేయడానికి జరుగుతున్న ప్రయత్నాలుగా చెబుతున్నారు.

జరుగుతున్న పరిణామాలను గుర్తించిన కేసీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరించి బీజేపీతో ఉద్రిక్తతలు తగ్గించుకున్నారు. కానీ బీజేపీ తెలంగాణలో బతకాలంటే లిక్కర్ స్కాంలో కవితపై చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అదే సమయంలో కవిత ను వదిలేసిన కేజ్రీవాలే అంతా చేశారంటే కేసు బలహీనపడిపోతుంది. కేసులో ఏ ఒక్కరినీ తప్పించాలని చూసినా లింక్ చెదిరిపోతుంది. అందుకే లిక్కర్ స్కాంలో కవిత కూడా ముప్పు పొంచి ఉందనేది కాదనలేని నిజం. ఢిల్లీ లిక్కర్ స్కాంలో నిందితులు అప్రూవర్లుగా మారితే స్కాం జరగలేదని వాదించడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే తామే నేరానికి పాల్పడ్డామని ఎలా పాల్పడ్డామో నిందితులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితి ఈ కేసులో కీలక నిందితులుగా భావిస్తున్న వారికి చిక్కులు తెచ్చి పెట్టడం కూడా ఖాయంగా కనిపిస్తోంది. ఈ గేమ్ లో రాజకీయ నేతలు రాజకీయ వ్యూహంలోనే బలి అవబోతున్నారు. వ్యాపారులు మాత్రం తప్పించుకుంటున్నారు.