ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి ఏర్పడిన ప్రస్తుత పల్నాడు జిల్లాలో టీడీపీకి సమస్యలు తప్పడం లేదు. ప్రతీ నియోజకవర్గంలో టీడీపీ కేడర్ అసంతృప్తిగా ఉంది. చంద్రబాబు అనాలోచిత నిర్ణయాలతో కేడర్ గందరగోళంలో పడిపోయింది. ఇప్పటిదాకా పార్టీని అంటిపెట్టుకుని ఉన్న వాళ్లు పక్క చూపులు చూస్తున్నారు. జగన్ రెడ్డి వేసే గాలానికి వాళ్లంతా చిక్కిపోతారన్న అనుమానాలు కలుగుతున్నాయి. సత్తెనపల్లి, గురజాల, నరసరావుపేట, చిలకలూరిపేట, పెదకూరపాడు నియోజకవర్గం ఏదైనా సరే టీడీపీలో మాత్రం అసంతృప్తి జ్వాలలు ఆకాశాన్ని అంటుతున్నాయి. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు తనయుడు కోడెల శివరాం అలక చర్చనీయాంశమైంది.
తాజాగా పార్టీలోకి వచ్చిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణకు సత్తెనపల్లి ఇంఛార్జ్ బాధ్యతలు అప్పగించడంతో శివరాం అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. మొదటి నుంచి పార్టీని నమ్ముకుని ప్రజాసేవ చేస్తున్న తమను కాదని ఇప్పుడొచ్చిన వారికి టికెట్ ఇవ్వడమేంటని ఆయన ప్రశ్నిస్తున్నారు. నిజానికి జిల్లాలో దివంగత శివప్రసాదరావు చాలా పవర్ ఫుల్ ఆయన్ను పల్నాడు పులి అని కూడా పిలుస్తారు. తన తండ్రి పరపతే తనను గెలిపిస్తుందన్న ఆశతో శివరాం టీడీపీలో చురుగ్గా పాల్గొంటూ వచ్చారు. అయినా చంద్రబాబు కనికరించలేదని శివప్రసాదరావును అవమానించిన వారిని అందలమెక్కించారని ఆయన ఆగ్రహం చెందుతున్నారు. కోడెల కుటుంబాన్ని ఏకిపారేస్తూ ఒకప్పుడు వరుస కథనాలు ప్రచురించిన సాక్షి దినపత్రికకే శివరాం ఇంటర్య్వూ ఇచ్చి చంద్రబాబు తీరును తప్పుపట్టారంటే ఆయన ఎంత అసంతృప్తిగా ఉన్నారో అర్థమవుతుంది.
మాజీ మంత్రి చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు కూడా టీడీపీ అధిష్టానంపై బహిరంగ విమర్శలు చేశారు. ఫౌండేషన్లు ట్రస్టుల పేరుతో వచ్చే నేతలను ప్రోత్సహిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కోటి ఖర్చు పెట్టి హడావుడి చేసే వాళ్లు తర్వాత చేతులెత్తేస్తారని ఆయన ఆరోపించారు. ఈ నాలుగేళ్లలో ఫౌండేషన్లు ట్రస్టులు ఏమయ్యాయని ప్రశ్నిస్తూ ఎన్నికల్లో టికెట్ కోసమే వస్తున్నారన్నారు. వాళ్లంతా ఎన్నికల ముందు వచ్చి ఎన్నికల తర్వాత వెళ్లిపోతారని ఎమ్మెల్యేనని చెప్పుకుని విదేశాల్లో ఎన్ఆర్ఐల దగ్గర షో చేయడం మినహా వారు అడుగు ముందుకు వేయరని అంటూ ఇప్పుడు టీడీపీలో క్రియాశీలంగా మారుతున్న భాష్యం ప్రవీణ్ పేరును ఆయన నేరుగానే ప్రస్తావించారు. భాష్యం ప్రవీణ్ కు చిలకలూరిపేటతో సంబంధమేమిటని ఆయన ప్రశ్నించారు. చిలకలూరిపేట పరిణామాలను పార్టీ అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లానని చిలకలూరిపేటలో ఓటు లేని భాష్యం ప్రవీణ్ కు టికెట్ ఇవ్వకూడదని పుల్లారావు డిమాండ్ చేశారు. పైగా ఆయన కోడెల శివరాంను వెనుకేసుకొచ్చారు.
క్రమ శిక్షణకు మారుపేరైన తెలుగుదేశం పార్టీలో అధిష్టానం వైఖరి కారణంగానే డిసిప్లీన్ లోపించిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అపర చాణుక్యుడు అనుకున్న చంద్రబాబే తప్పులో కాలేసినట్లుగా కనిపిస్తోంది. జిల్లాలో ప్రతీ చోట టీడీపీని ఆయన డైలమాలో పడేసినట్లు అనిపిస్తోంది. గురజాలలో యరపతినేని శ్రీనివాసరావు ఉండగా చల్లగుండ్ల శ్రీనివాసరావును చంద్రబాబే ప్రోత్సహిస్తున్నారన్న చర్చ జరుగుతోంది. చిలకలూరిపేటలో కొమ్మాలపాటి శ్రీధర్ ఉండగా కొందరు ఎన్నారైలను అక్కడ ప్రోత్సహించే ప్రయత్నం జరుగుతోంది. 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత యరపతినేని ప్రజా ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొంటూ పార్టీకి అన్నీ తానై నిర్వహిస్తున్నారు. ఇక పెదకూరపాడులో కొమ్మాలపాటి శ్రీధర్ ను కాదని ఒక ఎన్నారైని ముందుకు తీసుకురావాలని అధిష్టానం ప్రయత్నిస్తోంది. నరసరావుపేటలో అరవింద్ బాబు ఉండగా ఇంతవరకు పనిచేయని నేతలకు టికెట్ ఇచ్చే ప్రయత్నం జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
పల్నాడు టీడీపీలో విభేదాలను క్యాష్ చేసుకునేందుకు అధికార వైసీపీ ప్రయత్నిస్తోంది. కన్నాకు సత్తెనపల్లి ఇంఛార్జ్ ఇచ్చిన తర్వాత కోడెల శివరాం బహిరంగ విమర్శలు చేయడం వెనుక వైసీపీ హస్తం ఉందన్న వాదన బలపడుతోంది. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రంగంలోకి దిగి శివరాంను రెచ్చగొట్టారని చెప్పుకుంటున్నారు. మరో పక్క చంద్రబాబు టీడీపీ సీనియర్లను పక్కన పెట్టాలనుకుంటుంటే వారి చేత కొత్త పార్టీ పెట్టించి టీడీపీ ఓట్లను చీల్చాలని జగన్ ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి దర్శకత్వంలో తెలుగుదేశం – 2 అనే కొత్త పార్టీ వస్తుందని కొందరంటున్నారు. ఎన్నికల ఏడాదిలో టీడీపీ కొత్త సమస్యలు కొని తెచ్చుకుంటోంది. చంద్రబాబును గతంలో విమర్శించిన వారికి టికెట్లు ఇస్తే ఊరుకునేది లేదని కేడర్ అంటోంది. నాలుగేళ్లుగా అధికార పార్టీ రౌడీయిజాన్ని సైతం తట్టుకుని నిలబడిన వారికే అవకాశాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దెబ్బలు మాకు పదవులు కొత్త వారికా అని క్రియాశీల కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. మరి ఈ సంగతి చంద్రబాబుకు అర్థమవుతుందో లేదో చూడాలి.