ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వాయిదాల మాస్టర్ గా మారారు. ఇటీవలే ఆయనకు జంట కవిగా మారిన జూపల్లి కృష్ణారావు మాటల మనిషిగా మిగిలిపోతున్నారు. ఇద్దరూ కలిసి ఏ చేయబోతున్నారో ఎవరికీ తెలియడం లేదు. ఇదిగో అదిగో అనడమే తప్ప నిర్దిష్టమైన కార్యాచరణ వారిలో కనిపించడం లేదన్నది రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట. . పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన నిర్ణయాన్ని మరో పది రోజులు వాయిదా వేశారు. నిజంగా ఆయన దగ్గర సక్రమమైన కార్యాచరణ ఉందా లేక దిక్కుతోచక ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారా అన్నది అర్థం కావడం లేదంటూ పొంగులేటి అనుచరులు వాపోతున్నారు. కేసీఆర్ పై తిరుగుబాటు చేయాలనుకున్నప్పుడు అమిత వేగాన్ని ప్రదర్శించి తన వర్గం అభ్యర్థులను సైతం ప్రకటించిన పొంగులేటిలో ఇప్పుడంత సీన్ కనిపించడం లేదన్న వాదన వినిపిస్తోంది. భారీ డైలాగులు తప్పితే భవిష్యత్ కార్యాచరణపై స్పష్టత కొరవడిందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అంతా అయిపోయిందీ ఫలానా పార్టీలో చేరడమే తరువాయి అని నిర్ణయానికి వచ్చిన తరుణంలోనే పొంగులేటి మళ్లీ కొత్త డెడ్ లైన్ ప్రకటించారు. ఏ పార్టీలో చేరబోతున్నామో మరో పది రోజుల్లో చెబుతామని పొంగులేటి ప్రకటించడంతో కథ మొదటికొచ్చినట్లయ్యింది.
నేనులేస్తే మనిషిని కాదన్నట్లుగా పొంగులేటి కొత్త డైలాగులు వదులుతున్నారు. తాము జాయిన్ అయినామంటే ఆ పార్టీ ప్రభుత్వం వచ్చినట్లేనని కేసీఆర్ ను గద్దె దించే పార్టీలోనే తాము చేరతామని పొంగులేటి చెబుతున్నారు. అదే ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.ప్రస్తుతం బీఆర్ఎస్ నుంచి సస్పెండైన పొంగులేటి ఎప్పుడు పార్టీ మారతారా అని ఎదురు చూసిన వారికి నిరీక్షణ తప్పడం లేదు. తొందరగా ఎక్కడోక్కడ చేరండయ్యా అని అభిమానులు అనుచరులు పొంగులేటిని, జూపల్లిని బతిమాలే పరిస్థితి వచ్చింది. పొంగులేటి తిరుగుబాటు చేసినప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలు ఖమ్మం రాజకీయాల వైపు చూశాయి. జూపల్లి అలిగినప్పుడు కొల్హాపూర్ సహా ఉమ్మడి పాలమూరులో చాలా నియోజకవర్గాలు బీఆర్ఎస్ చేజారిపోతాయని అందరూ భావించారు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీకుకోవడం వారిద్దరికీ చేతకాలేదన్న అనుమానాలు ఇప్పుడు బలపడుతున్నాయి. సొంత పార్టీ పెడతారని పొంగులేటి కొన్ని రోజులు ప్రచారం చేయించుకున్నారు ఆ పని జరగలేదు. బీజేపీ చేరికల కమిటీ ఇంఛార్జ్ ఈటల రాజేందర్ నేతృత్వంలోని బృందం వచ్చి మాట్లాడితే కమలం పార్టీలో కలిసిపోతారనుకున్నారు అది కూడా జరగలేదు. బీజేపీ, కాంగ్రెస్ లో ఏ పార్టీలో చేరతారో డైలమా కొనసాగుతోందనుకున్నారు. పోనీ కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచినందున తెలంగాణలో కూడా విజయభేరీ మోగిస్తుందేమో చూసుకోవచ్చు ఆ పార్టీలో చేరమంటే ఆ పనీ చేయలేదు. ఇప్పుడు ఎటూ వెళ్లకుండా తెలంగాణ చౌరస్తాలో నిలబడిపోయారు.
పొంగులేటి కాంగ్రెస్ లో చేరతారనుకున్నప్పుడు ఖమ్మం జిల్లాలోని ఆయన అభిమాన కేడర్ ఉబ్బితబ్బిబయ్యారు. పొంగులేటికి కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం వస్తుందనుకున్నారు. నిజానికి పొంగులేటిని జూపల్లిని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బేషరతుగా కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. అవసరమైతే వచ్చి మాట్లాడతానని కూడా చెప్పారు. అయినా పొంగులేటి ఒక స్టాండ్ తీసుకోలేకపోయారు. జూపల్లి ఏం మాట్లాడుతున్నారో ఎవరికీ అర్థం కాలేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని అభిమానించే జనంలో కూడా వారిద్దరి తీరుపై అనుమానాలు కలుగుతున్నాయి. కేసీఆర్ ను గద్దె దించాలన్న ఉద్దేశం కంటే ఏదో ఆశించి ఇద్దరూ తాత్సారం చేస్తున్నారన్న చర్చ మొదలైంది. ఇలాగైతే వారిని నమ్మి వారి వెంట వెళ్లడం కరెక్టు కాదన్న వాదన బలపడుతుంది. పక్షం రోజుల క్రిందటే కాంగ్రెస్ లో చేరి ఉంటే కేడర్లో వారిపై విశ్వాసమూ పెరిగేది. తీరని జాప్యమే వారి కొంప ముంచే ప్రమాదమూ ఉంది. పైగా బీజేపీ నేతలు వెళ్లి వాళ్లిద్దరితో చర్చలు జరుపుతున్న తరుణంలోనే ఇద్దరూ కాంగ్రెస్ లో చేరతారన్న ప్రచారం కమలం పార్టీని కూడా ఇరకాటంలో నెట్టేసింది. అందుకే వాళ్లద్దరూ రివర్స్ కౌన్సిలింగ్ చేస్తున్నారని ఈటల రాజేందర్ వాపోయారు. పొంగులేటి, జూపల్లి ఇప్పుడు రాజకీయ చౌరస్తాలో ఉన్నారు. తెలంగాణలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడానికి ఇంకా ఎక్కువ రోజులు లేవు. వాళ్లు ఎంత త్వరగా నిర్ణయం తీసుకుని ఒక పార్టీలో చేరితే అంత మంచిది లేకపోతే వాళ్లకే కష్టం. అంతకంటే ఎవరైనా ఏం చెబుతారు.