గత ఏడాది మేలో వరంగల్‌లో రాహుల్ గాంధీ రైతు సంఘర్షణ సభ నిర్వహించారు. మళ్లీ ఏడాది తర్వాత ఖమ్మంలో మరో సభ నిర్వహించారు. అప్పటి సభ పరిస్థితులకు.. ఇప్పటి సభ పరిస్థితులకు తేడా కాస్త పరిశీలిస్తే.. కాంగ్రెస్ పార్టీ ఇంత పుంజుకుందా అన్న ఆశ్చర్యం ఎవరికైనా కలుగుతుంది. కలిసొచ్చే పార్టీకి నడిచొచ్చే నేతలు ఎదురొస్తున్నారు. ఇప్పుడు గాలికి తగ్గట్లుగా వెళ్తే చాలు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మొదటి సారి అధికారాన్ని చేపడుతుoదన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఈ మార్పుకు కారణం ఏమిటి ? రాహుల్ గాంధీ కాంగ్రెస్ అవకాశాల్ని మెరుగుపరుస్తున్నారా ? కర్ణాటక ఇచ్చిన ఊపు.. తెలంగాణలోనూ గరిష్టంగా వాడుకోవడంలో సక్సెస్ అయ్యారా ?
వరంగల్‌లో రైతు సంఘర్షణ సభ నిర్వహించినప్పుడు .. సభతో పాటు కాంగ్రెస్ పార్టీ అంతర్గత రాజకీయాలూ హైలెట్ అయ్యాయి. రాజగోపాల్ రెడ్డి అటు వైపు చూడలేదు. జగ్గారెడ్డి రచ్చ రచ్చ చేశారు. ఆ తర్వాత రాహుల్ గాంధీ సభలో రైతు డిక్లరేషన్ ప్రకటించారు. దాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్ళేoదుకు రేవంత్ రెడ్డి ఊరూవాడా తిరిగారు. నేతలందర్నీ తిరగాలన్నారు. కానీ పట్టించుకున్నవారు లేరు. దీంతో ఆ రైతు డిక్లరేషన్ ను రచ్చబండల దగ్గర చర్చ పెట్టాలనుకున్న ప్లాన్ ఫెయిల్ అయింది. అయితే ఇప్పుడు ఖమ్మం సభ జరిగిన పరిస్థితుల్ని చూస్తే… పార్టీ నేతలంతా సమైక్యంగా మారడమే కాదు.. పోటీలు పడి జన సమీకరణ చేశారు. అంతకు మించి … కాంగ్రెస్ అధికారంలోకి రావడమే ముఖ్యమన్న సందేశాన్ని ప్రజల్లోకి పంపారు. ఎవరికి వారు తమ ఆధిపత్యం ప్రదర్శించాలనుకున్నా… ఎవరి మనోభావాలు తగ్గకుండా అన్ని వ్యవహారాలు స్మూత్ గా నడిపించేశారు.
ఖమ్మం సభ విజయవంతం కాకుండా ఉండటానికి జన సమీకరణను వీలైనంత తక్కువ చేయడానికి అధికార బీఆర్ఎస్ పార్టీ శక్తివంచన లేకుండా ప్రయత్నించింది. ఎందుకంటే పొంగులేటితో పాటు కాంగ్రెస్ లో చేరుతున్న వారంతా బీఆర్ఎస్ పార్టీ నేతలు. కనీసం 30 శాతం మంది నేతలు కాంగ్రెస్ లో చేరిపోయారు. ఇందులో జడ్పీ చైర్మన్ దగ్గర్నుంచి మున్సిపల్ కౌన్సిలర్ల వరకూ ఉన్నారు. వీరెవర్నీ బీఆర్ఎస్ నేతలు ఆపలేకపోయారు. కనీసం వచ్చే క్యాడర్ ను అయినా ఆపుదామని చాలా ప్రయత్నించారు. ఆర్టీసీ బస్సుల్ని ఇవ్వలేదు. ప్రైవేటు వాహనాలనూ నియంత్రించారు. కారణం ఏదైనా ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీలు సభలు పెట్టుకుంటూంటే… సహించలేకపోతున్నాయి అధికార పార్టీలు. ఇలా అడ్డుకునే ప్రయత్నం చేస్తే ప్రజల్లోకి నెగెటివ్ గా వెళ్తుందన్న ఆలోచన వారు చేయడం లేదు. అడ్డుకోవడమే లక్ష్యమన్నట్లుగా రాజకీయం మారింది. ఖమ్మంలోనూ అదే కనిపించింది. కానీ సభకు వచ్చిన జనం మాత్రం ఊహించనంతగా ఉంది. కాంగ్రెస్ నేతలు కూడా ఉబ్బితబ్బిబ్బయ్యారు.
రాహుల్ గాంధీ రాజకీయ పరిస్థితులకు తగ్గట్లుగా సింపుల్‌గా.. సూటిగా ప్రజలకు కనెక్ట్ అయ్యే విషయాలనే చెప్పారు. అర్థం కానీ జాతీయ రాజకీయాలను తన ప్రసంగంలో చొప్పించలేదు. యూనిఫాం సివిల్ కోడ్ అని.. మరొకటని సాగదీయలేదు. గ్యారంటీ హామీలను డిక్లరేషన్ గా పొందు పరిచారు. అవే చెప్పారు. ముఖ్యంగా చేయూత పథకంతో వృద్ధులకు పెన్షన్లు నాలుగు వేలు ఇస్తామని ప్రకటించారు. ఇది సూటిగా వెళ్లే పథకమే. దీన్ని నొక్కి చెప్పారు. అదే సమయంలో ధరణి గురించి వెనక్కి తగ్గలేదు. ధరణి లేకపోతే రైతు బంధు రాదని… మళ్లీ భూకబ్జాలు పెరుగుతాయని బీఆర్ఎస్ అధినేత .. రైతుల్లో ఆందోళన రేకెత్తించే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై బీజేపీ గందరగోళంలో పడింది కానీ.. కాంగ్రెస్ మాత్రం క్లారిటీగానే ఉంది. రాహుల్ గాంధీ ధరణి వల్ల రైతుల భూముల్ని కేసీఆర్ కాజేశారని చెప్పి.. తాము రాగానే ధరణిని రద్దు చేస్తామని ప్రకటించేశారు.
నిరాశలో ఉన్న పార్టీ సభ పెడితే ఉండే పరిస్థితులు.. భవిష్యత్ పై నమ్మకం ఉన్న పార్టీ సభ పెడితే ఉండే పరిస్థితులు వేరు. ఏడాది తేడాలో ఈ రెండింటినీ చూస్తోంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. ఈ జోష్ ఇలాగే కొనసాగితే జాక్ పాట్ కొట్టినా ఆశ్చర్యం లేదన్నది ఎక్కువ మంది అభిప్రాయం.
రాహుల్ గాంధీ సభలో కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో మంచి భవిష్యత్ ఉందన్న అభిప్రాయం బలపడుతోంది. నిజానికి కాంగ్రెస్ రేసులో ఉందని.. రెండు, మూడు నెలల కిందటి వరకూ పెద్ద ఎవరూ నమ్మలేదు. ఎప్పుడైనా బీఆర్ఎస్, బీజేపీ ఒకరిపై ఒకరు యుద్ధం ఆపేసుకున్నారో అప్పుడే కాంగ్రెస్ కు మంచి రోజులు ప్రారంభమయ్యాయి. ఆ అవకాశాల్ని కాంగ్రెస్ నేతలు పక్కాగా ఉపయోగించుకున్నారు. ఆ రెండు అధికార పార్టీలే కావడంతో సహజమైన అధికార వ్యతిరేకత ఉంటుంది. ఇక ప్రత్యామ్నాయం తామేనన్న వాదనతో తెరపైకి వచ్చారు. కర్ణాటకలో వచ్చిన గెలుపును మ్యాగ్జిమం ఇక్కడ వాడుకుంటున్నారు. డీకే శివకుమార్, ప్రియాంకా గాంధీ మొత్తం మానిటర్ చేస్తున్నారని తేలిన తర్వాత ఇక పార్టీ నేతలు కాంగ్రెస్ మార్క్ రాజకీయాలను దూరం పెట్టక తప్పలేదు.
కాంగ్రెస్ పార్టీ ఆకర్షణీయమైన హామీలు ఇచ్చింది. ట్రెండింగ్ స్ట్రాటజిస్ట్ సునీల్ కనుగోలు బృందం పని చేస్తోంది. రాహుల్ పై ప్రజల్లో సానుభూతి కనిపిస్తోంది. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఓ bచాన్స్ ఇస్తే తప్పేమిటన్న భావన ప్రజల్లో పెరుగుతోంది. కాంగ్రెస్ పార్టీకి ఇన్ని ప్లస్ పాయింట్లు కనిపిస్తున్నాయి. ముందు ముందు ఈ టెంపోను కొనసాగించి… పార్టీ నేతలంతా మరో మాట లేకుండా విజయం కోసం ప్రయత్నిస్తే… అద్భుతం జరగవచ్చన్నది ఎక్కువ మంది నమ్మకం.
కాంగ్రెస్ కు అవకాశం ఇచ్చింది బీఆర్ఎస్, బీజేపీలే. తమ రాజకీయాల వల్ల కాంగ్రెస్ లాభపడుతుందని వారికి తెలియక కాదు. మరి ఇప్పుడు పెరుగుతున్న కాంగ్రెస్ ను వారు ఎలా కంట్రోల్ చేస్తారన్నది అసలు హాట్ టాపిక్. ఇందులో విఫలం అయితే.. కాంగ్రెస్ గెలుపులో వీరే కీలక పాత్ర పోషించినట్లవుతుంది.