కేసీఆర్ కు అఖిలేష్ చెప్పిందేమిటి ?

By KTV Telugu On 4 July, 2023
image

లోక్ సభ ఎన్నికలకు పార్టీల సమీకరణాలు మారుతున్నాయి. ఎవరు ఎవరితో కలుస్తారో క్లారిటీ వచ్చే టైమ్ అయ్యింది. ఆ దిశగానే అఖిలేష్ యాదవ్ హైదరాబాద్ వచ్చి కేసీఆర్ ను కలిశారు. మనం మనం బరంపురం అని ఆయనతో చెప్పేశారు. ఇప్పుడు మరి కేసీఆర్ రూటు మార్చుతారా. ఎందుకంటే రాజకీయాలు విచిత్రంగా ఉంటాయి. ఎవరు ఎవరితో కలుస్తారో. ఎవరు దూరమవుతారో చెప్పలేం. ఎవరు కోవర్టులన్నది కూడా సరిగ్గా అంచనా వేయలేం. ఇప్పుడు బీజేపీయేతర పార్టీల రాజకీయాల్లో జరుగుతున్నది కూడా అదే..

కేసీఆర్ ను విపక్షాల మీటింగుకు పిలవని నేతలు ఇప్పుడు ఆయన ఇంటికి వచ్చి మాట్లాడి వెళ్లడం ఆశ్చర్యకర పరిణామమే. దాని వల్ల కొన్ని అనుమానాలు కూడా వస్తున్నాయి. వచ్చే ఏడాది జరగనున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీని కలిసికట్టుగా ఎదుర్కోవాలని భావిస్తున్న ప్రతిపక్ష కూటమిలో కోవర్టులు ఉన్నారా? ఒక పక్క ఇతర ప్రతిపక్షాలతో వేదికలను పంచుకుంటూనే, మరో పక్క బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారా? అన్న అనుమానాలకు కొన్ని మీటింగులు అవకాశమిస్తున్నాయి. అఖిలేష్ వచ్చి కేసీఆర్ ను కలవడం కూడా అలాంటి అనుమానాలకు వేదికైంది. అయితే అఖిలేష్ వచ్చిన రీజన్ మాత్రం వేరుగా ఉంది.

బీజేపీకి వ్యతిరేకంగా ఏర్పడిన ప్రతిపక్ష కూటమి ఇటీవల పట్నాలో ప్రత్యేకంగా సమావేశమై చర్చించింది. ఈ సమావేశంలో అఖిలేశ్‌ కూడా పాల్గొన్నారు. ఈ కూటమి తరపున భవిష్యత్తులో జరగబోయే సమావేశాల్లో కూడా అఖిలేశ్‌ పాల్గొనాల్సి ఉంది. మరో పక్క ఈ కూటమికి బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ దూరంగా ఉన్నారు. ఈ కూటమి సమావేశానికి ఆయనకు పిలుపు కూడా రాలేదు. పైగా ఈ కూటమిలో బీఆర్‌ఎస్‌కు చోటులేదని, అది బీజేపీకి బీ టీమ్‌ అని ఖమ్మం సభలో రాహుల్‌ గాంధీ ప్రకటించిన మరుసటి రోజే సోమవారం విపక్షాల కూటమి ప్రతినిధి అఖిలేశ్‌ హైదరాబాద్‌ వచ్చి కేసీఆర్‌ను కలుసుకోవడం విశేషం. అయితే బీఆర్ఎస్ ను కాంగ్రెస్ దూరం పెట్టాలనుకోవడం తెలంగాణ రాజకీయాల కోసమేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసిన పక్షంలో అదీ వేరు పరిణామాలకు దారి తీస్తుందని హస్తం పార్టీకి తెలుసు. ముఖ్యమంత్రి పదవిని కేసీఆర్ కు వదిలెయ్యాల్సి రావడం మొదటి పరిణామం కావచ్చు. బీజేపీకి అవకాశం ఇచ్చినట్లు కావడం రెండోది కావచ్చు. అందుకే బీఆర్ఎస్ ను కాంగ్రెస్ వద్దంటోంది.

పొత్తు లక్ష్యంగా :

కాంగ్రెస్ వైఖరికి కారణాలు వివరించేందుకే అఖిలేష్ హైదరాబాద్ వచ్చారన్న చర్చ జరుగుతోంది. ఫోన్లో మాట్లాడేకంటే వన్ టు వన్ చర్చలయితే అపోహలు తొలగిపోతాయనే అఖిలేష్ ప్రత్యేక విమానంలో హైదరాబాద్ లో దిగారనుకోవాలి. నిజానికి ఇప్పుడు బీఆర్ఎస్ కు బీజేపీ దగ్గరవుతున్నట్లుగా కనిపిస్తోంది. బీజేపీని బీఆర్ఎస్ నేతలు ఎక్కడా విమర్శించడం లేదు. లిక్కర్ స్కాంపై బీజేపీ మాట్లాడటం లేదు. దానితో రెండు పార్టీలూ పూర్తిగా దగ్గరైనట్లు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట దానిపై క్లారిటీ పొందడంతో పాటు ఎన్నికల నాటికి పొత్తుకు కేసీఆర్ ను సమాయత్తం చేయడమే లక్ష్యంగా అఖిలేష్ హైదరాబాద్ వచ్చారని చెబుతున్నారు.

బంతి కేసీఆర్ కోర్టులో : 

బీఆర్ఎస్ పేరుతో జాతీయ పార్టీ పెట్టిన కేసీఆర్ అన్ని రాష్ట్రాల్లో పోటీ చేయాలనుకుంటున్నారు. ఆ దిశగా ఇప్పటికే మహారాష్ట్ర వైపుగా పెద్ద అడుగులే వేశారు. త్వరతో ఏపీ, ఒడిశా, తమిళనాడుపై ప్రత్యేక దృష్టి పెడతారు. ఏదోక రోజున ఉత్తర ప్రదేశ్ పై కన్నెయ్యడం ఖాయమని తేలిపోయింది. ఆ విషయంపై కూడా కేసీఆర్ – అఖిలేష్ చర్చించిట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి.బీజేపీని ఓడించే చర్యల్లో భాగంగా విపక్షాల్లో ఒక పార్టీ పోటీ చేసిన చోట మరోకరు రంగంలోకి దిగకుండా చూసుకోవాలన్న ప్రస్తావన తెరపైకి వచ్చింది. కేసీఆర్ కూడా తమతో కలిస్తే అదే ఫార్ములాను బీఆర్ఎస్ కు అమలు చేస్తామని అఖిలేష్ చెప్పినట్లుగా భావిస్తున్నారు. అంటే ఉత్తర ప్రదేశ్లో ఉన్న 80 లోక్ సభా స్థానాల్లో కొన్నింటిని బీఆర్ఎస్ కు కేటాయించి….అక్కడ ఎవరూ పోటీ చేయకుండా చూసుకునే బాధ్యతను అఖిలేష్ తీసుకుంటారన్నమాట. దీని వల్ల బీఆర్ఎస్ కే కాకుండా తమకు కూడా ఉపయోగంగా ఉంటుందని సమాజ్ వాదీ పార్టీ విశ్వసిస్తోంది. అందుకు కేసీఆర్ ఒప్పుకుంటే ఆయన తరపున ఇతర పార్టీలతో మాట్లాడతానని అఖిలేష్ హామీ ఇచ్చారట. మొత్తానికి బంతి కేసీఆర్ కోర్టులో ఉంది.