Ktv Telugu : పార్టీల మధ్య పాలు రాజకీయాలు రాజేస్తున్నాయి. మొన్నటికి మొన్న కర్నాటకలో నందిని వర్సెస్ అమూల్ పాల రగడ ఎన్నికల అస్త్రంగా మారిపోయింది. ఇపుడు ఆంధ్రప్రదేశ్ లో హెరిటేజ్ వర్సెస్ అమూల్ పాల రగడ రచ్చ రచ్చ చేస్తోంది. పసిపిల్లలకు సంపూర్ణ ఆహారమైన పాలు రాజకీయాలు చేసుకునే వాళ్లకు కూడా అంతే సంపూర్ణంగా పనికొస్తోందన్నమాట.
ఆంధ్ర ప్రదేశ్ లో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక పాల రైతుల ప్రయోజనాల పేరుతో అమూల్ పాల వ్యాపారానికి తలుపులు బార్లా తెరిచారు. ఇతర డైరీ సంస్థలు రైతులకు ఇచ్చే ధర కన్నా లీటరుకు కనీసం అయిదారు రూపాయలు ఎక్కువే వస్తుంది కాబట్టి రైతులకు మేలు జరుగుతుందని చెప్పారు అయితే తెలుగుదేశం పార్టీ నేతలకు మాత్రం ఈ వ్యవహారం నచ్చలేదు. ఎక్కడో గుజరాత్ కు చెందిన అమూల్ పాల డైరీని ఎందుకు ప్రోత్సహిస్తున్నారో చెప్పాలంటూ టిడిపి నేతలు నిలదీశారు.
తాజాగా చంద్రబాబు నాయుడి సొంత జిల్లా అయిన చిత్తూరు లో టిడిపి హయాంలో మూతపడ్డ విజయ పాల డైరీని అమూల్ సంస్థ భాగస్వామ్యంతో భారీగా పునర్నిర్మించాలని ప్రభుత్వం భావించింది. దానికి సంబంధించి శంకుస్థాపన కూడా చేశారు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి. ఇలా అమూల్ సంస్థను తీసుకురావడం తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడి కుటుంబానికి చెందిన హెరిటేజ్ డైరీని దెబ్బతీయాలనే కుట్రతోనే అంటున్నారు టిడిపి నేతలు. తద్వారా చంద్రబాబు నాయుడి ఆర్ధిక మూలాలు దెబ్బతీస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.
దీనిపై పాలక పక్ష నేతలు వారి వాదన వారు వినిపిస్తున్నారు. చిత్తూరు డైరీని గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా మూసివేశారు. తమ హెరిటేజ్ డైరీ వ్యాపారాన్ని విస్తరించుకోవడం కోసమే ప్రభుత్వ సహకార సంస్థ అయిన విజయ డైరీని ఒక పథకం ప్రకారం మూసివేశారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. నిజానికి ఒక్క చిత్తూరు లోనే కాదు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా చాలా చోట్ల ప్రభుత్వ ఆధ్వర్ంలోని డైరీలను మూసివేశారు. ఆ ప్రాంతాల్లో హెరిటేజ్ వ్యాపారాన్ని పెంచుకున్నారు.
గతంలో కాంగ్రెస్ పార్టీతో పాటు కమ్యూనిస్టులు కూడా హెరిటేజ్ పై ఆరోపణలు చేశారు.
ప్రైవేటు డైరీ వ్యాపారాన్ని పెంచుకోవడం కోసం ప్రభుత్వ రంగ సంస్థను మూసివేయడం దుర్మార్గమని రైతు సంఘాల నేతలూ ఆరోపించి ఊరుకున్నారు. ఆ తర్వాత ప్రభుత్వ డైరీల గురించి ఎవరూ పట్టించుకోలేదు. ఇపుడు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ప్రభుత్వం మూసివేసిన పాల డైరీలను తెరిచే పనిపెట్టుకుంది. ఈ క్రమంలో అమూల్ పాల వ్యాపారాన్ని విస్తృతంగా విస్తరించుకునేందుకు వెసులు బాటు కల్పించింది. అయితే ఇది రైతులపై ప్రేమతో కాదని చంద్రబాబు పై కక్షసాధించడానికేనని టిడిపి అంటోంది.
విషాద భరితమైన కొసమెరుపు ఏంటంటే అమూల్ పాల గురించి టిడిపి కానీ దానికి అండగా నడుస్తోన్న మీడియా కానీ మరీ ఎక్కువ వ్యతిరేకంగా గొంతు పెగల్చలేకపోతున్నాయి. కారణం దాని మూలాలు గుజరాత్ లో ఉండడం. ఆ గుజరాత్ నరేంద్ర మోదీది కావడం. అమూల్ పాల గురించి వ్యతిరేకంగా మాట్లాడితే గుజరాత్ మనోభావాలు దెబ్బతింటే నరేంద్ర మోదీ మనసు గాయపడుతుందేమోనని ఏపీలో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ భయపడుతూ ఉంటాయి. అందుకే దీనిపై టిడిపి మరీ ఎక్కువగా రాద్ధాంతం చేయలేకపోతోంది. అటు ప్రతీ దానికీ ప్రభుత్వంపై ఒంటికాలిపై లేచి విరుచుకు పడే పవన్ కళ్యాణ్ కూడా శ్రీమాన్ నరేంద్ర మోదీగారి రాష్ట్రానికి చెందిన అమూల్ పాల వ్యాపారానికి వ్యతిరేకంగా పల్లెత్తు మాట మాట్లాడ్డానికి జంకుతున్నట్లుందని రాజకీయ పరిశీలకులు అనుమానిస్తున్నారు.
పాపం. పాలకి ఏ పాపం తెలీదు. పాపాయిల బొజ్జల్లో చల్లగా సెటిల్ అయిపోయి వారి ఆకలి తీర్చి మురిసిపోవడం తప్ప ఏ కల్మషమూ తెలీదు. రాజకీయ పార్టీల క్షుద్ర రాజకీయాల పాపమా అని పాలు కూడా అనుమానిత జాబితాలో చేరిపోయే దుస్థితి అఘోరిస్తోందని సామాజిక వేత్తలు గుమ్మపాలపై ఒట్టేసి చెబుతున్నారు.రాజకీయ నాయకులకు తెలిసిందొక్కటే. పిండుకున్నోళ్లకి పిండుకున్నంత పాలు వస్తాయనే వారు నమ్ముతారు. దాని కోసం ఎంతకైనా తెగిస్తారు. అక్కడ నందిని అయిన ఇక్కడ విజయ అయినా ఒకేలా తోడుకుంటాయి. హెరిటేజ్ అయినా అమూల్ అయినా పాలు తెల్లగానే ఉంటాయి.