– విదేశాల్లో మన విశ్వసనీయతకు మాయనిమచ్చ
– మన సిస్టమ్‌లో లొసుగులకు ‘మైడెన్’ ప్రత్యక్షసాక్ష్యం!
ఆ కంపెనీ ప్రొడక్ట్స్ ఏవీ మనదగ్గర అమ్మడం లేదు. మనం ఆందోళనపడాల్సిన పన్లేదని చంకలు గుద్దుకుందామా? విదేశీ గడ్డపై భారత్ పరువుపోయిందని తలపట్టుకుందామా? రోగం నయం చేయలేకపోయినా ఫర్లేదు. ప్రాణాధారంగా నిలవాల్సిన ఔషధాలు ప్రాణాలు తీయడమేంటి? ఆఫ్రికా దేశంలో 66మంది పిల్లలను అన్యాయంగా పొట్టనబెట్టుకున్న కంపెనీ పునాదులు మన దేశంలో వేళ్లూనుకోవడమేంటి?
చిన్నారుల ప్రాణాలు కోల్పోయేందుకు కారణమైన కాఫ్ సిరప్‌ని తయారుచేసిన మైడన్ ఫార్మాస్యూటికల్స్ మనదేశానికి చెందిన కంపెనీ. ఆత్మనిర్భర్ భారత్‌లో భాగం అది. ఆ కంపెనీ మెడిసన్స్ ప్రమాణాలు లేనివని గతంలోనూ ఎన్నోసార్లు వెల్లడైంది. కొన్ని దేశాలు ముందే అప్రమత్తమయ్యాయి. కానీ ఆఫ్రికన్ కంట్రీ గాంబియాలో అమాయకంగా వాడేశారు. చిన్నపిల్లలకు వాడే దగ్గుమందును తనకు నచ్చిన మోతాదులు కలిపేసి మార్కెట్లోకి వదిలేసింది మైడెన్ కంపెనీ.
మైడెన్ ఫార్మాస్యూటికల్స్ నిర్వాకాలు ఒక్కోటీ బయటికొస్తున్నాయి. ఈ ఫార్మా కంపెనీకి చెందిన అనేక మందులు నాణ్యతా ప్రమాణాలు లేవన్న విషయం ఈమధ్య ఎన్డీటీవీలో కూడా ప్రసారమైంది. చెత్త రికార్డు ఉన్న ఫార్మా కంపెనీలు వియత్నాం బ్లాక్‌లిస్టులో పెట్టింది. అందులో ఘనత వహించిన మైడెన్ కూడా ఉంది. 2011లోనే వియత్నాం నిషేధించిన కంపెనీ ఇండియాలో దర్జాగా నడుస్తూనే ఉంది. చివరికి కేరళ, గుజరాత్ రాష్ట్రాలు కూడా మైడెన్ లోపాలను కనిపెట్టాయి. బీహార్ బ్లాక్‌లిస్ట్ చేసింది.
32 ఏళ్లక్రితం కార్యకలాపాలు ప్రారంభించిన మైడెన్ ఆఫ్రికాలోని గాంబియాకు మాత్రమే సిరప్ తయారు చేసి ఎగుమతి చేసిందని మన యంత్రాంగం నిగ్గుతేల్చింది. ఘోరం జరిగిపోయాక మైడెన్ ఫార్మాస్యూటికల్స్ దగ్గు సిరప్‌ల నమూనాలను పరీక్షిస్తోంది. నేరం రుజువైతే కఠిన చర్యలు తప్పవంటోంది. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అంటే ఇదే. మేడిన్ ఇండియా మందులు డేంజర్ అని డబ్ల్యుహెచ్వోనే అలర్ట్ జారీచేశాక మన ప్రొడక్ట్స్‌కి విశ్వసనీయత ఎక్కడుంటుంది? కోట్లమంది ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే ఇలాంటి మైండ్‌లేని మైడెన్ కంపెనీలు మరెన్ని ఉన్నాయో!