గెహ్లాట్‌ అలా..రాహుల్‌ ఇలా.. అదానీ ఫిట్టింగ్‌!

By KTV Telugu On 8 October, 2022
image

అదానీ వస్తానన్నాక అంతేగా..అంతేగా!

ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు.. విధి విధానమును తప్పించుటకై ఎవరు సాహసించెదరు.. అవును వెల్‌కమ్‌ అంటే అదో తల్నొప్పి. గెటౌట్‌ అంటే రోకట్లో తలపెట్టినట్లే. చేసేదేం లేదు.. ఏడవలేక నవ్వడమే. భారత్‌ జోడో అంటూ రాహుల్‌గాంధీ పాదయాత్ర జోరుగా సాగుతోంది. గెడ్డం కూడా గీస్కోకుండా యువరాజు నడుస్తుంటే జనంకూడా పొలోమని వచ్చేస్తున్నారు. మోడీమీద, కేంద్రప్రభుత్వ విధానాలమీద రాహుల్‌గాంధీ విమర్శలదాడి పెంచారు. ఇక లేవడం కష్టమేననుకున్న కాంగ్రెస్‌పార్టీకి రాహుల్‌ యాత్రతో కాస్త ఊపొచ్చింది.

అంతా బానేవుందికానీ..పార్టీలో తలపండిన నేతలతోనే అధినాయకత్వం తలబొప్పి కడుతోంది. రాజస్థాన్‌ సీఎం అశోక్‌గెహ్లాట్‌ ఈమధ్య మరీ పంటికింద రాయిలా మారిపోయాడు. కంట్లో నలుసులా ఇబ్బందిపెట్టేస్తున్నాడు. కాంగ్రెస్ అధ్యక్షబరిలో ఉంటాడనుకున్న పెద్దాయన సీఎం సీటు వదులుకోవడం ఇష్టంలేక రచ్చరంబోలా చేశాడు. ఇప్పుడేమో రాహుల్‌ తరచూ టార్గెట్‌ చేసుకునే పారిశ్రామికవేత్తని ఇంద్రుడు చంద్రుడంటూ గెహ్లాట్‌ పొగిడేశాడు. గౌతం అదానీని గెహ్లాట్‌ పొగట్టానికి కారణం లేకపోలేదు. రాజస్థాన్‌లో పెట్టుబడులు పెట్టడానికి అదానీ ముందుకొచ్చారు. దీంతో గెహ్లాట్‌ లవ్‌ యూ రాజా అంటూ ఓ రేంజ్‌లో ఆకాశానికి ఎత్తేశాడు.

రాహుల్‌గాంధీ పొగడలేరు. ఎందుకు పొగిడావని అశోక్‌ గెహ్లాట్‌కి తలంటలేరు. కాంగ్రెస్‌పాలిత రాష్ట్రంలో పెట్టుబడులు పెడతానంటే మనస్ఫూర్తిగా స్వాగతించాల్సిందే. అందుకే యువరాజు వ్యూహాత్మకంగా దాటవేయాల్సి వచ్చింది. కార్పొరేట్లకు వ్యతిరేకం కాదని చెప్పుకోవాల్సి వచ్చింది. కేవలం గుత్తాధిపత్యానికి మాత్రమే వ్యతిరేకమన్నది రాహుల్‌ లాజిక్‌. 60వేల కోట్ల పెట్టుబడులు పెడతానన్న ఆఫర్‌ని ఏ ముఖ్యమంత్రి కూడా తిరస్కరించలేరని గెహ్లాట్‌ పొగడ్తలను పరోక్షంగా సమర్ధించాల్సి వచ్చింది.