KTV Telugu ;- వర్షం పడితే చాలు హైదరాబాద్ ఎక్కడైనా ట్రాఫిక్ ఆగిపోతే ఆ వీడియోలు తీసి నగరం – నరకం అనే పోస్టులు పెట్టేస్తున్నారు చాలా మంది. వాటిని వైరల్ చేస్తున్నారు ఇకొంత మంది. అదే పనిగా హైదరాబాద్ మీద నెగెటివ్ ప్రచారం చేయడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. అసలు సమస్యలేమీ లేవని కాదు కానీ.. సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నంత ఘోరంగా హైదరాబాద్‌లో పరిస్థితి లేదని అనుకోవచ్చు. సోషల్ మీడియాలో వర్షం పడగానే వైరల్ అయ్యే కొన్ని వీడియోలు నిజాలంటే అరగంట తర్వాత తెలిసిపోతుంది. అంతా సాఫీగానే ఉంటుంది. వర్షం వల్ల వచ్చే తాత్కలిక ఇబ్బందుల్ని కూడా బూతద్దంలో చూపించి హైదరాబాద్ ఇమేజ్‌పై గట్టి దెబ్బకొట్టే లక్ష్యంతో ఎవరైనా పని చేస్తున్నారా అన్న అనుమానం ఇలాంటి కారణాలతోనే వస్తుంది.
హైదరాబాద్ నగరం కొంత మందికి టార్గెట్ అయింది. అది రాజకీయంగానే . భారత రాష్ట్ర సమితిని విమర్శించడానికి ఎలాంటి అవకాశం దొరుకుతుందా అని చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు. అందులో భాగంగానే సోషల్ మీడియాలో ఇలాంటి ప్రచారాలు జరుగుతూ ఉంటాయి. నిజానికి ఇటీవలి కాలంలో హైదరాబాద్‌లో మౌలిక సదుపాయాలు బాగా పెరిగాయి. ట్రాఫిక్ సిగ్నల్స్ అవసరం లేకుండా… ఫ్లైఓవర్లు.. ఇతర ఏర్పాట్లు చేశారు. కానీ యూటర్నుల దగ్గర మాత్రం సమస్యలు వస్తున్నాయి. సగం రోడ్డును ఆక్రమించి యూటర్న్ ఏర్పాటు చేశారు. అక్కడ రోడ్డు కుంచించుకుపోవడంతో వాహనాల వేగం తగ్గిపోతోంది. ఫలితంగా ట్రాఫిక్ స్లో అయిపోతోంది. వర్షం పడినప్పుడు ఇలాంటి చోట్ల నీళ్లు నిలబడి ఉంటే… ట్రాఫిక్ డెడ్ స్లో అవుతుంది. దీంతో సమస్యలు తలెత్తుతున్నాయి. ఇలాంటి సమస్యలను పరిష్కరించండానికి గ్రేటర్ హైదరాబాద్ ఎప్పటికప్పుడు పని చేయాలి. చేయకపోతే.. అది వారి తప్పే కానీ.. హైదరాబాద్ నగరానిది కాదు.
హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్యలకు పెరుగుతున్న జీవన ప్రమాణాలు.. ఇబ్బడిమబ్బడిగా పెరుగుతునన వ్యక్తిగత వాహనాలు కూడా కారణం. అమెరికాలో సగటున ప్రతి ఇద్దరికి మూడు కార్లు ఉంటాయని చెప్పుకునేవారు. ఆస్థాయిలో కాకపోయినా ఇప్పుడు హైదరాబాద్‌లో ప్రతి ఇంట్లో కారు కనిపిస్తోంది. పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ .. ప్రజల అవసరాలు పది శాతం కూడా తీర్చలేకపోతున్నాయి. ఇలాంటి సమస్యలే హైదరాబాద్‌కు కీలకం.
హైదరాబాద్‌లో రోడ్ల మీదకు వచ్చే వాహనలు లక్షల్లో ఉంటున్నాయి. కొరోనా తరువాత వ్యక్తిగత భద్రత కోసం ప్రజలు సొంత వాహనాల పైనే ఆధారపడుతున్నారు. ద్విచక్రవాహనాలు, కార్లు ఇలా ఎవరికి వారు వారి ఆర్థిక సామర్ధ్యాన్ని బట్టి వాహనాలు కొనుగోలు చేస్తున్నారు. ప్రతీ ఏటా ద్విచక్ర వాహనాలు, కార్ల ధరలు పెరగడంతో పాటు పెట్రోల్, డీజిల్ ధరలు కూడా ఆకాశాన్నంటుతున్నప్పటికీ రాష్ట్రంలో వాహనాల కొనుగోళ్లు ఏమాత్రం తగ్గడం లేదు. తెలంగాణ ఏర్పాటైనప్పటికి రాష్ట్రంలో కేవలం 71 లక్షల 52 వేల వాహనాలున్నాయి. కాగా రాష్ట్రం ఆవిర్భవించిన గత తొమ్మిదేళ్లలో వాటి సంఖ్య ఏకంగా కోటి 53 లక్షలు దాటింది. తెలంగాణ ప్రజలు సౌకర్యవంతమైన జీవితానికి అలవాటు పడటంతో పాటు సొంత రవాణా వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటే సమయం కూడా ఆదా అవుతుందన్న భావనలో ప్రజలు ఉన్నారు. అందుకే వ్యక్తిగత వాహనాల సంఖ్య అమాంతం పెరిగింది. ఫలితంగా ఎన్ని కొత్త రోడ్లు వేసినా.. విస్తరించినా… వాహనాలతో బిజీగానే కనిపిస్తున్నాయి. హైదరాబాద్‌కు సమస్యలేమీ లేవని కాదు.. రోడ్లపై నీరు నిలవకుండా చేయడానికి డ్రైనైజ్ వ్యవస్థను వీలైనంతగా అభివృద్ది చేయడానికి ఎంతో స్కోప్ ఉన్నా ప్రభుత్వాలు సరిగ్గా దృష్టి పెట్టలేదు. ఐటీ కారిడార్ వంటి చోట్ల తప్పితే ఇతర చోట్ల రోడ్ల నిర్వహణకు పెద్దగా నిధులు కేటాయించడం లేదు. చెరువులు , నాలాలు కబ్జా చేస్తున్నా అధికార పార్టీ పట్టించుకోవడం లేదు. ఇలాంటి అనేక సమస్యల వల్ల హైదరాబాద్ నగరానికి సోషల్ మీడియాలో కొంత మంది మైనస్ మార్కులు వేయడానికి తాపత్రయ పడుతున్నారు.నిజానికి దేశంలో ఇతర నగరాల్లోనూ ఇలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎప్పటి వరకో ఎందుకు ఇప్పుడు అహ్మదాబాద్ లో వరదలూ అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దృశ్యాలు చూస్తే ఎవరికైనా … ప్రకృతి ఆగ్రహిస్తే… ఎవరూ ఏం చేయలేరని అర్థం చేసుకుంటారు. అయితే హైదరాబాద్‌పైనే ఎక్కువగా నెగెటివ్ ప్రచారం జరుగుతోంది. అదీ కూడా రాజకీయ కారణాలతోనే.ఏ ప్రాంతం నుంచి వచ్చిన వారైనా హైదరాబాద్ కు అలవాటు పడితే.. మాతృభూమి కన్నా మిన్నగా అభిమానిస్తారు పక్కా హైదరాబాదీ అని చెప్పుకుంటారు. ఇలాంటి అభిమానం వల్ల కూడా హైదరాబాద్ మరింత మెరుగ్గా ఉండాలని.. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు నెగెటివ్ ప్రచారం చేస్తూంటారు. కారణం ఏదైనా సోషల్ మీడియాలో జరుగుతున్న వ్యతిరేకంగా హైదరాబాద్ లేదు. ప్రపంచ స్తాయి నగరంగా కాకపోయినా … ఆ స్థాయిని అందుకునే దిశగా వెళ్తుందని చెప్పుకోవచ్చు.