KTV Telugu ;- తెలంగాణ అధికార పార్టీ బీఆర్ఎస్ మూడో సారి అధికారంలోకి రావడానికి కసరత్తులు చేస్తోంది. ఓ రెండు దశాబ్దాల కిందట అయితే ఓ పార్టీ మూడో సారి గెలవడం అంటే… సరైన ప్రత్యర్థి లేకపోతే సహజమే అనుకునేవారు. కానీ గట్టి ప్రత్యర్థి ఉంటే మాత్రం ప్రజలు మూడో సారి అధికారాన్ని ఒకే పార్టీకి ఇవ్వడం కష్టమే . ఇప్పుడు బీఆర్ఎస్ అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ప్రభుత్వమే కాదు సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా తెలంగాణ ఏర్పడినప్పటి నుండి ఎమ్మెల్యేలుగా ఉన్నారు. దమ్ముంటే వారితోనే బరిలోకి దిగాలని విపక్షాలు సవాల్ చేస్తున్నాయి. రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి మాత్రమే కాదు షర్మిల లాంటి వాళ్లు కూడా ఇదే సవాల్ చేస్తున్నారు. సిట్టింగ్‌లకు సీట్లిస్తే బీఆర్ఎస్ ఓటమి ఖాయమా ? విపక్ష పార్టీలు ఎందుకలా సవాళ్లు చేస్తున్నాయి ?
దమ్ముంటే సిట్టింగ్‌లకే సీట్లివ్వాలన్న సవాల్ ఇటీవలి కాలంలో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కు ఇతర పార్టీల నుంచి ఎక్కువగా వస్తోంది. కేసీఆర్ ఎవరికి టిక్కెట్లు ఇస్తారన్నది ఆ పార్టీలకు అనవసరం. కానీ ప్రత్యేకంగా గుర్తు చేసి మరీ సిట్టింగ్‌లకు సీట్లివ్వాలని టీజ్ చేస్తున్నారు. దీనికి రెండు కారణాలు ఉన్నాయి. తమ సవాల్ ను స్వీకరించి సిట్టింగ్‌లను కొనసాగిస్తే వారిపై ఉన్న ప్రజా వ్యతిరేకతతో బీఆర్ఎస్ పార్టీకి నష్టం జరుగుతుంది. అదే సిట్టింగ్ ఎమ్మెల్యేల్ని మార్చేస్తే.. ఇప్పటి వరకూ ఉన్న వారు దోచుకున్నారు.. కొత్తగా దోచుకోవడానికి వేరే వారిని తెచ్చి పెట్టారని విమర్శలు గుప్పించవచ్చు. అంతే కాదు.. టిక్కెట్లు ఇవ్వని నేతల్ని రెబల్స్ గా ప్రోత్సహించవచ్చు కూడా. అందుకే ఈ సవాల్‌పై ఎలా వ్యవహరించాలన్నది బీఆర్ఎస్ చీఫ్ డిసైడ్ చేసుకోలేదు. పట్టించుకోనట్లే ఉన్నారు. కానీ ఆయనకూ టిక్కెట్ల ఖరారు కత్తి మీద సాములా మారిందని ఎక్కువ మంది బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.
సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీకి ప్రధాన సవాల్ అసంతృప్తి. ఎంత ఎక్కువ కాలం అధికారంలో ఉంటే ప్రజల్లో అంత ఎక్కువ అసంతృప్తి కనిపిస్తుంది. ప్రజలకు ఏదో అంశంపై అసంతృప్తి పెరుగుతుంది. ఏ ప్రభుత్వానికైనా ప్రజల్ని ఎప్పుడూ సంతృప్తి పరచడం సాధ్యం కాదు. ముఖ్యంగా ప్రజలకు ఉచిత పథకాలు.. డబ్బులు పంచడం ద్వారా ఓటు బ్యాంక్‌గా మార్చుకోవాలనుకున్నపార్టీలకు మరీ కష్టం. ఎందుకంటే ఉచితంగా వచ్చే కొద్దీ ప్రజలకూ ఆశలు పెరుగుతాయి. ఇప్పుడున్న రాజకీయాల్లో ఓ ప్రభుత్వం మూడో సారి గెలవడం అంటే.. చిన్న విషయం కాదు. అసంతృప్తి బయటకు కనిపించాలనేం లేదు. పైగా ప్రభుత్వంపై తమ కోపాన్ని ఓటర్లు సైలెంట్ గానే చూపిస్తారు. అయితే ఇలాంటి అసంతృప్తి రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి ప్రభుత్వంపైన, రెండు.. ఎమ్మెల్యేలపైన. ఈ రెండు రకాల అసంతృప్తి ప్రజల్లో ఏర్పడితే ప్రభుత్వాన్ని మరోసారి ఏర్పాటు చేయడం అసాధ్యమే.
ప్రభుత్వంపై అసంతృప్తి అంటూ ప్రజల్లో ఏర్పడితే ఇక ఎవరూ కాపాడలేరు. రాజకీయ వర్గాల విశ్లేషణల ప్రకారం.. ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి అనేది కనిపిస్తే ఎన్నికల నాటికి అది తగ్గే అవకాశం లేదు. ఎన్ని ఉచిత హామీలు ఇచ్చినా.. అమలు చేయడం ప్రారంభించినా ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కష్టం. పైగా తమను మరోసారి ఇలాంటి పథకాలపేరుతో మాయ చేయాలనుకుంటున్నారని మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తారు. అది ఓట్ల రూపంలో కనిపిస్తుంది. చరిత్రలో అనేక పార్టీల పరాజయాలు నిరూపించాయి . అదే సమయంలో ఎమ్మెల్యేలపై అసంతృప్తి ఉంటే మాత్రం.. ప్రభుత్వాన్ని కాపాడుకోడానికి అవకాశం ఉంటుంది. ప్రజలకు దూరమైన ఎమ్మెల్యేల్ని దూరం పెట్టి కొత్త అభ్యర్థులను రంగంలోకి దించడం ద్వారా వీలైనంత వరకూ అసంతృప్తిని తగ్గించి.. ఓట్ల కోతను అడ్డుకునే అవకాశం ఉంటుంది. కానీ ప్రభుత్వంపై అసంతృప్తిని తగ్గించడం ఎంత కష్టమో… ప్రజల్లో పలుకుబడి కోల్పోయిన ఎమ్మెల్యేల్ని మార్చడం అంతే కష్టం. ఎందుకంటే వారు రెబల్ గా మారే చాన్స్ ఉంది. అప్పటికే ఆర్థికంగా బలోపేతం అయి ఉంటారు.. పార్టీ క్యాడర్ చాలా వరకూ వారి వెంటే ఉంటుంది. అందుకే సిట్టింగ్ అభ్యర్థుల్ని మార్చడం కూడా రెండు వైపులా పదునున్న వ్యూహం లాంటిదే.రేవంత్ రెడ్డి సవాల్ చేశాడని.. ఇప్పుడు సిట్టింగ్‌లకు టిక్కెట్లు ఇచ్చేంత పట్టుదలకు పోయే రాజకీయం కేసీఆర్ చేయరు. అలాగే తేడా వస్తుందని తెలిస్తే మొహమాటాలకు ఎమ్మెల్యేల్ని కొనసాగించే చాన్స్ ఉండదు. నిర్ణయం ఏదైనా కానీ విపక్షాలు చేసే ప్రచారాన్ని తిప్పికొట్టడంపైనే కేసీఆర్ ఆలోచిస్తారు. ఇది రేవంత్ రెడ్డికే కాదు ఇతర పార్టీలకూ తెలుసు.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి