KTV Telugu ;- రాజకీయ పార్టీల్లోకి కొత్త చుట్టాలు వస్తున్నారంటే అప్పటికే పార్టీలో ఉన్న వారికి పస్తులు తప్పవని అర్ధం. అయిన వాళ్లకి ఆకుల్లోనూ కాని వాళ్లకి కంచాల్లోనూ వడ్డించే సంప్రదాయం రాజకీయ పార్టీల్లోనే ఎక్కువగా ఉంటుందని అంటారు. ప్రస్తుతం తెలంగాణా రాజకీయ పార్టీల్లో ఈ సంస్కృతే పార్టీలో మొదట్నుంచీ విధేయంగా ఉన్నవారికి నిద్రలేకుండా చేస్తోంది. ఎన్నికలకు నాలుగు నెలలు మాత్రమే సమయం ఉన్న తరుణంలో ఇతర పార్టీల నుంచి వచ్చే నేతలు తమ నియోజక వర్గాలను తన్నుకుపోతారేమోనన్న భయం చాలా మంది నేతల్లో ఉంది
కొద్ది వారాల క్రితం బి.ఆర్.ఎస్. పార్టీకి గుడ్ బై చెప్పిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావులు తీవ్ర తర్జన భర్జనలు పడ్డాక కాంగ్రెస్ లో చేరడానికి నిర్ణయించిన సంగతి తెలిసిందే. పొంగులేటి ఇప్పటికే పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పేసుకుని ఖమ్మంలో హల్ చల్ చేస్తున్నారు. ఈ నెల 20న మహబూబ్ నగర్ లో ప్రియాంక గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరడానికి ముహూర్తం పెట్టించుకున్న జూపల్లి అనుకున్న రోజున పార్టీలో చేరలేదు. ప్రియాంక గాంధీ షెడ్యూల్ కుదరకపోవడంతో పాలమూరు సభ వాయిదా పడ్డమే అందుకు కారణం. ఇపుడా సభ తేదీని జులై 30గా నిర్ణయించారు.
జూపల్లి కృష్ణారావు ఒకప్పుడు కాంగ్రెస్ నాయకుడే. ఉమ్మడి ఏపీలో మంత్రిగా కూడా పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత బి.ఆర్.ఎస్. లో చేరారు. ఇపుడు తిరిగి సొంత గూటికి వద్దామని డిసైడ్ అయ్యారు. జూపల్లితో పాటు బి.ఆర్.ఎస్. ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర రెడ్డి కూడా కాంగ్రెస్ లో చేరికకు డీల్ కుదుర్చుకున్నారు. ఆయన తనయుడు రాజేశ్వర రెడ్డికి నాగర్ కర్నూల్ సీటు అడుగుతున్నారు. కొల్లాపూర్ సీటు కోసం జూపల్లి, నాగర్ కర్నూలు కోసం కూచుకుళ్ల ఒప్పందాలు చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోన్న నేపథ్యంలో చాలా కాలంగా పార్టీలో ఉన్న నాగం జనార్ధన రెడ్డి, జగదీశ్వరరావుల్లో టెన్షన్ మొదలైంది.
తెలుగుదేశం పార్టీ నుండి బిజెపికి అక్కడి నుండి ఒక్క లాంగ్ జంప్ తో కాంగ్రెస్ లోకి వచ్చిన నాగం జనార్ధన రెడ్డి వచ్చే ఎన్నికల్లో నాగర్ కర్నూల్ నియోజక వర్గం నుండి పోటీ చేయాలని పట్టుదలగా ఉన్నారు. గతంలో ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఈ నియోజక వర్గం నుంచే ఎమ్మెల్యేగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు తాను పార్టీ మారకుండా విధేయంగా ఉంటే ఇపుడు ఎక్కడి నుంచో వచ్చిన కూచుకుళ్ల తనయుడికి టికెట్ ఇస్తే చూస్తూ ఊరుకోవాలా? అని నాగం మిరియాలూ కారాలూ కలిపి గ్రైండర్ లో నూరేస్తున్నారు.
కొద్ది రోజుల క్రితం మల్లు రవితో పాటు పార్టీ నేతల సమక్షంలోనే ఏర్పాటు చేసిన సమావేశంలో నాగం జనార్ధన రెడ్డి, జగదీశ్వరరావులు తమ టికెట్ల గురించే మాట్లాడినట్లు సమాచారం. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు అధికార పక్షంలో పదవులు ఎంజాయ్ చేసి.. పార్టీకి మంచి ఊపు వచ్చిందని తెలియగానే చివరి నిముషంలో గోడలు దూకే నేతలకు టికెట్లు ఇచ్చి పార్టీ కోసం కష్టపడ్డవారికి అన్యాయం చేస్తే బాగుండదని నాగం చాలా సీరియస్ గానే చెప్పారని అంటున్నారు. అయితే టికెట్లు ఎవరికి ఇవ్వాలనేది సర్వేల ఆధారంగానే ఉంటాయని మల్లురవి సద్ది చెప్పే ప్రయత్నం చేసినట్లు సమాచారం. దానికి నాగంతో పాటు జగదీశ్వరరావు కూడా ఒప్పుకోలేదంటున్నారు.
ఖమ్మం జిల్లాకు చెందిన పొంగులేటి శ్రీనివాసరెడ్డికి తన సొంత జిల్లాలో ఇలా సవాల్ విసిరే కాంగ్రెస్ నేతలు లేకపోవడం విశేషం. జూపల్లి కృష్ణారావుకు మాత్రం మహబూబ్ నగర్ జిల్లాలో నల్లేరు పై బండి నడకలా ఉండే పరిస్థితి కనిపించడం లేదు. పై పెచ్చు ఆయనకు టికెట్ రాకుండా అడ్డుపడ్డానికి కూడా నాగం వంటి నేతలు సిద్ధంగా ఉన్నారు. ఒక వేళ జూపల్లికి కొల్లాపూర్ టికెట్ ఇస్తే ఆయన్ను కచ్చితంగా ఓడిస్తానని జగదీశ్వరరావు తన అనుచరులతో అంటున్నారట.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి