KTV Telugu ;- ఆంధ్ర ప్రదేశ్ బిజెపి అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి దూకుడు పెంచారు. పార్టీలో తనదంటూ ఓ వర్గం ఉండాలని భావిస్తోన్న ఆమె ప్రక్షాళన మొదలు పెట్టారు. అయితే ఈ క్రమంలో ఆమె మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు వర్గానికి ప్రాధాన్యత తగ్గించడం పార్టీలో చర్చనీయాంశమవుతోంది. అదే సమయంలో బిజెపి మాస్కులు వేసుకున్న టిడిపి నేతలను ఆమె చేరదీస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మాజీ టిడిపినేతలకు పెద్ద పీట వేయడం సంప్రదాయ బిజెపి నేతల్లో అసంతృప్తికి కారణమవుతోంది.
ఏపీ బిజెపి అధ్యక్షురాలిగా పార్టీ అధిష్ఠానం పురంధేశ్వరిని నియమించిన వెంటనే పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. అయితే అప్పటిదాకా అధ్యక్షుడిగా వ్యవహరించిన సోము వీర్రాజు మాత్రం ఆమె నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధమనే అన్నారు తప్ప ఎలాంటి వివాదస్పద వ్యాఖ్యలు చేయలేదు. పురంధేశ్వరికి పగ్గాలు అప్పగించడం ద్వారా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడికి చెక్ చెప్పినట్లు అయ్యిందని ప్రచారం జరిగింది కూడా. బిజెపిలోని చంద్రబాబు మనుషులను ఆమె దూరం పెడతారంటూ ప్రచారమూ జరిగింది. అయితే ఇపుడు అందుకు రివర్స్ లో కథ నడుస్తోందంటున్నారు.
పార్టీ అధ్యక్షురాలిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పురంధేశ్వరి ఒక్క క్షణం కూడా ఖాళీగా ఉండడం లేదు. పార్టీ నేతలతో వరుసగా భేటీలు అవుతున్నారు. పార్టీలో ఎవరెవరు ఏమేం చేస్తున్నారో అడిగి తెలుసుకుంటున్నారు. ఎవరు మన వారు ఎవరు పగ వారు అన్నవి బేరీజే వేసుకుంటున్నారు. ఎవరిని నమ్మాలి? ఎవరిపై నిఘా ఉంచాలి? ఎవరిని దూరంగా ఉంచాలి? అన్నవి లెక్కలు వేసుకుటున్నారు. వాటికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో భాగంగానే సోము వీర్రాజు కు నమ్మకస్థులైన నేతలందరినీ ఆమె పక్కన పెట్టేసినట్లు చెబుతున్నారు. నిజానికి సోము వీర్రాజు ఆరు నెలల క్రితమే పార్టీ ప్రక్షాళన పూర్తి చేశారు. ఇపుడు ఈమె వచ్చి మళ్లీ అదే పని భుజాలకెత్తుకున్నారు.
ఒక పక్క ప్రక్షాళన చేస్తూనే మరో పక్క రాష్ట్రంలో పార్టీని ప్రధాన ప్రతిపక్షంగా తీర్చిదిద్దాలన్న ఆలోచన చేస్తున్నారు. ప్రజాసమస్యలపై పోరాటాలు చేయడంతో పాటు ప్రభుత్వానికి నిద్ర లేకుండా చేయాలని భావిస్తున్నారు. ప్రభుత్వ పథకాలను ఎండగడుతూనే ప్రభుత్వ వైఫల్యాలపై దృష్టి సారిస్తున్నారు. అదే సమయంలో ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేసిందని తీవ్రమైన ఆరోపణలు కూడా గుప్పించారు పురంధేశ్వరి. ఈ విషయంపైనే కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ను కలిసిన పురంధేశ్వరి ఏపీలో ఆర్ధిక క్రమశిక్షణ లేదని ఫిర్యాదు కూడా చేశారు.
కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లిస్తోందన్న పురంధేశ్వరి కేంద్ర ప్రభుత్వ నిధులను ఏం చేస్తున్నారో అర్ధం కావడం లేదన్నారు. లక్షల ఇళ్లు నిర్మిస్తున్నామన్న జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇంత వరకు ఎన్ని ఇళ్లు నిర్మించిందో చెప్పాలంటున్నారు. అదే విధంగా రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి అధ్వాన్నంగా ఉందని ఆరోపించారు. సొంత పార్టీ ఎంపీకే రక్షణ లేకపోతే ఇక సామాన్యులకు రక్షణ ఎక్కడినుంచి ఇస్తారని విశాఖ ఎంపీ వ్యవహారాన్ని ప్రస్తావించారు పురంధేశ్వరి.
బిజెపి-వైసీపీకి అనుకూలంగా ఉంటోందన్న విపక్షాల వాదనలను తిప్పికొట్టాలని దగ్గుబాటి పురంధేశ్వరి కృతనిశ్చయంతో ఉన్నారని అంటున్నారు. అందులో భాగంగానే వైసీపీ ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ ఎండగడుతూ పోవాలని ఆమె నిర్ణయించుకున్నారు. నిత్యం ప్రభుత్వాన్ని ఏదో ఒక అంశంపై తరుముతూనే ఉండాలన్నది ఆమె ఆలోచన. రోజూ ఏదో ఒక కార్యక్రమంలో బిజీగా ఉండడం ద్వారా పార్టీని అనుక్షణం వార్తల్లో ఉంచాలని చూస్తున్నారు. తద్వారా ప్రజలు బిజెపి గురించి ఆలోచించేలా చెయ్యాలన్నది ఆమె వ్యూహంగా చెబుతున్నారు.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి