బీజేపీలోకి కొండా సురేఖ దంపతులు?

By KTV Telugu On 29 July, 2023
image

KTV Telugu ;- ఆ కుటుంబం మళ్లీ పార్టీ మారుతోందా. చేయి వదిలి కాషాయ కండువా కప్పుకోబోతోందా. లేదు లేదని వివరణ ఇస్తున్నా నమ్మ బుద్ధి కావడం లేదా.. గత ట్రాక్ రికార్డ్ కారణంగా మారడం ఖాయమన్న అనుమానాలు కలుగుతున్నాయా.. అసలేం జరుగుతోంది.

ఇళ్ళ చీపిరికట్ట తిరుగుతూ ఉంటుందంటారు. తిరిగే కాలు కదలకుండా ఉండలేదంటారు. పార్టీలు మారే అలవాటున్న నేతలు ఒక్క చోట స్థిరంగా కూర్చోలేరంటారు. కొండా సురేఖ, కొండా మురళీ దంపతుల విషయంలోనూ అదే జరుగుతోంది. పైగా వరంగల్ కాంగ్రెస్ లో నెలకొన్న విభేదాలే కొండా దంపతులు పార్టీ మారేందుకు కారణమవుతాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి..

కొండా దంపతులు బీజేపీలో చేరతారన్న ప్రచారం ఊపందుకుంది. తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. కీలక నేతలు సొంత పార్టీలకు హ్యాండిచ్చి కొత్త రూటు వెదుక్కుంటున్నారు. ఈ క్రమంలోనే ఉమ్మడి వరంగల్ రాజకీయాల్లో ఒక్క వెలుగువెలిగిన కొండా దంపతులు ఇప్పుడు పక్క చూపులు చూస్తున్నట్లు తెలుస్తోంది. దీనితో ఈ దంపతుల రాజకీయం తెలంగాణ కాంగ్రెస్ లో ఆసక్తికరంగా మారింది. కొంతకాలంగా తెలంగాణ కాంగ్రెస్ లో తమకు ప్రాధాన్యం తగ్గిందని, తమకు సంబంధం లేకుండానే వరంగల్ పార్టీకి సంబంధించిన నిర్ణయాలు వెలువడుతున్నాయని కొండా దంపతులు ఆగ్రహం చెందుతున్నట్లు సమాచారం.

నిజానికి కొండా సురేఖ తెలంగాణలో చురుకైన‌ రాజ‌కీయ నాయ‌కురాలు…. తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత ఆమె టీఆర్‌ఎస్‌ తరపున వ‌రంగ‌ల్ తూర్పు నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వ‌హించారు. వ‌రంగల్‌ కి చెందిన ఆమె మండ‌ల ప‌రిష‌త్ స‌భ్యురాలిగా త‌న రాజ‌కీయ జీవితాన్ని ప్రారంభించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ విభ‌జ‌న జ‌ర‌గ‌క ముందు శాయంపేట నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక‌య్యారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్ర‌భుత్వంలో స్త్రీ, శిశు సంక్షేమం, ఆరోగ్యం, ప్రాథ‌మిక విద్యా మంత్రిగా ప‌ని చేశారు. వైఎస్ మరణం తర్వాత ఆమె జగన్మోహన్ రెడ్డి పక్షాన నిలిచారు.అయితే అక్కడ ఎక్కువ కాలం నిలవలేక ఆపై బీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018లో ఆమె త‌న భ‌ర్తతో స‌హా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ లో చేరారు.గత ఎన్నికల్లో ఆమె ప‌ర‌కాల నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. వచ్చే ఎన్నికలలో తాము వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతామని కొండా దంపతులు స్పష్టం చేస్తున్నారు. వరంగల్ తూర్పులో కొండా సురేఖ బరిలో ఉంటారని, మరో సీటు ఇస్తే తాను గానీ, తన కుమార్తె సుస్మిత పటేల్ కానీ ఎన్నికల బరిలోకి దిగడానికి సిద్ధంగా ఉన్నామని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి చెబుతున్నారు.

బీజేపీలో చేరతారన్న ప్రచారాన్ని కొండా దంపతులు తోసిపుచ్చుతున్నారు. తమ కుమార్తె సుస్మితా పటేల్ పుట్టిన రోజు వేడుకల సందర్భంగా వాళ్లు వివరణ ఇచ్చారు. తాము ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీలోనే ఉంటామని చెప్పారు.ప్రజలను అయోమయానికి గురి చేస్తున్న వార్తలను నమ్మొద్దు అని విజ్ఞప్తి చేశారు..తాము నమ్ముకున్న కాంగ్రెస్ జెండా కిందనే, కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతామని కొండా దంపతులు తేల్చి చెబుతున్నారు. ప్రజల వద్ద నుండి పెద్ద ఎత్తున తమకు ఆదరణ వస్తుందని, అది చూసి ఓర్చుకోలేని అధికార పార్టీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారంటూ కొండా దంపతులు మండిపడ్డారు. కాకపోతే నిప్పు లేనిదే పొగ రాదు. ఏదో జరగకపోతే ఇలాంటి ప్రచారం తెరపైకి రాదు. పైగా బీజేపీలో చేరుతున్నారంటూ ఖచ్చితమైన సమాచారం కూడా వచ్చింది. దానితో కొండా దంపతులు లోపల ఒకటి బయట ఒకటి అన్న అనుమానాలు వస్తున్నాయి. నిజానిజాలు తెలియాలంటే కొన్ని రోజులు ఆగక తప్పదని విశ్లేషణలు వినిపిస్తున్నాయి…

 

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి