KTV Telugu ; – ఆకాశంలో సగం అని ఆపేయాల్సిన అవసరం లేదు. ఆకాశమే కాదు అంతరిక్షంలోనూ వారు సగం కన్నా ఎక్కువే. ఆ మాటకొస్తే అంతరిక్షాన్ని మించిన రాజకీయాల్లో మహిళా నాయకురాళ్లకు తిరుగేలేదు. పురుషులకన్నా అన్ని విధాలుగానూ మహిళానాయకురాళ్లు దిట్ట అని చాలా సందర్భాల్లో నిరూపించుకున్నారు. రాజకీయమైనా..వ్యాపారమైనా..లేడీ బాస్ లకు తిరుగులేదంటున్నారు నిపుణులు.
భారత రాజకీయ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ మహిళా నేత ఇందిరాగాంధీ. పురుషులకే పరిమితం అని అపోహపడే రాజకీయ రంగంలో ఇందిరాగాంధీ రాణించిన తీరు.. దేశ రాజకీయాలనే శాసించిన శైలి అనితర సాధ్యం. భారత తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ తనయగా ఆమె రాజకీయాల్లో అడుగు పెట్టి ఉండచ్చుకానీ.. రాజకీయాల్లోనూ పరిపాలనలోనూ తనదైన ముద్ర వేసిన మహానాయకురాలు ఇందిరా గాంధీ. పదహారేళ్లు ప్రధాని పీఠం పై కూర్చున్న ఇందిరాగాంధీ ప్రపంచ దేశాల్లోనూ ఉక్కుమహిళగా పేరు సంపాదించారు. గరీబీ హఠావో నినాదంతో రాజకీయాలను శాసించిన ఇందిరాగాంధీ బంగ్లాదేశ్ విభజన సమయంలో పాక్ ఆట కట్టించిన తీరుకు ఆమెను అపరకాళికతో పోల్చారు నాటి ప్రతిపక్ష నేత వాజ్ పేయ్.
ఎమర్జెన్సీ విధించి పెద్ద తప్పు చేసిన ఇందిరా గాంధీ ఆతర్వాత అధికారాన్ని కోల్పోయినా రెండేళ్లకే తిరిగి ప్రధాని పీఠాన్ని అధిరోహించారు. సాహసోపేత నిర్ణయాలకు పెట్టింది పేరుగా వ్యవహరించారు. ఆ సాహసమే ఆమె ప్రాణాలనూ పొట్టన పెట్టుకుంది. భారత రాజకీయాల్లో ఎంతమంది మహిళలు రాణించినా ఇందిరా గాంధీతో సరి తూగగలిగే నాయకురాళ్లు ఇంత వరకు రాలేదు. ఒక దశలో ఇండియా అంటేనే ఇందిర..ఇందిర అంటేనే ఇండియా అన్నంతగా ఆమెను కీర్తించారు. రాజకీయాల్లో ఎత్తుగడల్లో ఆమెకు తిరుగులేదు. పరిపాలనలో కఠిన నిర్ణయాలు తీసుకోవడంలోనూ సూపర్. అందుకే ఇందిరా గాంధీ ఇండియాకి తిరుగులేని లేడీ బాస్.
భారత రాజకీయాల్లోనే చూస్తే దివంగత తమిళనడు ముఖ్యమంత్రి కుమారి జయలలితది చెరగని ముద్రే. అన్నాడిఎంకే పార్టీలో దివంగత ముఖ్యమంత్రి ఎంజీయార్ ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చిన జయలలిత ఆ తర్వాత తన సొంత ప్రతిభతోనే రాణించారు. ఎంజీయార్ మరణానంతరం కొద్ది రోజుల పాటు మాత్రమే ఇబ్బంది పడ్డా ఆ తర్వాత పార్టీని తన గుప్పెట్లోకి తీసుకుని తిరుగులేని నాయకురాలయ్యారు. పార్టీని ఎన్నికల్లో గెలిపించారు. ముఖ్యమంత్రి పీఠం అధిరోహించి పాలనా దక్షతలోనూ తిరుగులేదని నిరూపించుకున్నారు. రాజకీయ చదరంగంలో ఆమెకు తిరుగులేదు.
ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి అందరి అంచనాలను తల్లకిందులు చేసే వ్యూహాలతో రాజకీయాల్లో రాణించారు. బహుజనుల హక్కుల కోసం ఉద్యమించిన దివంగత కాన్షీరాం ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చారు మాయావతి. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి కాగలిగారు. బ్రాహ్మణులతో పాటు ఇతర అగ్రకులాలను కూడా కలుపుకుపోతూ ఆమె రూపొందించిన సోషల్ ఇంజనీరింగ్ బహుజన సమాజ్ పార్టీకి అద్భుత విజయం సాధించి పెట్టింది. మాయావతి ఫార్ములా ఆ తర్వాత చాలా రాజకీయా పార్టీలకు సిలబస్ గా మారింది. అయితే ఆ తర్వాత వివాదాలు.. అవినీతి ఆరోపణలు చుట్టు ముట్టేయడంతో రాజకీయంగా దెబ్బతిన్నా ఇప్పటికీ దళిత మహిళల్లో మాయావతిని మించిన మహానాయకురాలు మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు.
మన దేశంలోనే కాదు.ప్రపంచ దేశాల్లోనూ మహిళలు పురుషులను మించి సత్తా చాటారు. బ్రిటన్ ప్రధాని మార్గరేట్ థాచర్ ఉక్కుమహిళగా పేరు గడించారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా.. పాకిస్థాన్ మాజీ ప్రధాని బేనజీర్ భుట్టో, మయన్మార్ అధినేత్రి ఆంగ్ సాన్ స్యూకీ లు సూపర్ లేడీ బాసెస్ గా చరిత్ర సృష్టించారు.రాచరికాల్లోనూ ఎందరో రాణులు వారసత్వ సంపదగా వచ్చిన అధికారాన్ని సమర్ధవంతంగా వినియోగించుకుని రాణించారు. అవసరమైనపుడు కత్తులు దూసి కదన రంగంలోకి ఉరికారు కూడా. రాణి రుద్రమ దేవి ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి మంగమ్మ, రాణి చెన్నమ్మ వంటి ఎందరో భారతీయ మహిళలు రాజ్యాధికారంలో సత్తా చాటారు.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి