దేశంలో బియ్యం ధరలు పెరగకూడదని.. ఎగుమతుల్ని నిషేధించినట్లుగా కేంద్రం ప్రకటించింది. ఈ ఎఫెక్ట్ బయట దేశాల్లో కనిపిస్తోంది. అదే సమయంలో ఇండియాలోనూ కనిపిస్తోంది. బియ్యం ధరలు అనూహ్యంగా పెరిగిపోతున్నాయి. గత ఫిబ్రవరి,మార్చి నెలల్లో కురిసిన అకాల వర్షాల వల్ల దిగుబడులు తగ్గాయనీ, పంట నష్టం జరిగిందని ప్రభుత్వం కారణంగా చెబుతోంది. ఇది నమ్మశక్యం కాని విషయం. ఈ ఏడాది అకాల వర్షాలు పడిన మాట నిజమే. అధిక వర్షాల సమస్య వచ్చి కొద్ది రోజులే అయింది. అంతవరకూ పండిన పంట ఏమైంది? రైతుల వద్ద చౌక ధరకు ధాన్యాన్ని సేకరిస్తున్న మిల్లర్లు, వ్యాపారులు సిండికేట్లుగా ఏర్పడి బియ్యం ధరను పెంచేస్తున్నారా ? దేశంలోనూ కృత్రిమ కొరత సృష్టిస్తున్నారా ?
అమెరికా తదితర విదేశాల్లోని తెలుగు వాళ్లనే కాదు.. తెలుగు రాష్ట్రాల్లోని సామాన్యులను సైతం సన్నబియ్యం ధరలు హడలెత్తిస్తున్నాయి. భారీగా పెరిగిన ధరలతో సన్న బియ్యం కొనాలంటేనే సామాన్యులు జంకే పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవలి కాలంలో పేద, సామాన్యులు మొదలుకొని సంపన్నులు కూడా సన్నబియ్యంతో వండిన అన్నాన్నే తింటున్నారు. దీంతో ఇటీవలి కాలంలో అదేపనిగా పెరిగిపోతున్న సన్న బియ్యం ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. గడిచిన నెలన్నర రోజుల్లోనే సన్నబియ్యం ధర క్వింటాకు రూ. 1000 నుంచి రూ.1500దాకా పెరిగిదంటే పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా ఉందో ఊహించుకోవచ్చు. ఓ వైపు ఎగుమతుల నిషేధానికి.. మరో వైపు బియ్యం ధరల పెరుగుదలకు సంబంధం ఉందా ?
సాధారణంగా వానాకాలం వరిసాగు విస్తీర్ణంలో సన్న రకం అరవై శాతం డొడ్డు రకాలు నలభై శాతం సాగు నిష్పత్తి ఉంటుంది. యాసంగి సీజన్ లో ఇది 40:60గా మారుతుంది. సన్నాలను ఖరీఫ్‌లో ఎక్కువగా, యాసంగిలో తక్కువగా రైతులు సాగు చేస్తుంటారు. యాసంగిలో బియ్యం పట్టిస్తే నూక ఎక్కువోస్తుందన్న కారణంతోనే సన్నాలను తక్కువగా సాగు చేస్తారు. మరోవైపు కొనుగోలు కేంద్రాల్లో ప్రభుత్వం దొడ్డురకం ధాన్యాన్నే ప్రాధాన్యత ఇచ్చి కొనుగోలు చేస్తుండడంతో సన్నాల సాగు తెలంగాణలో గణనీయంగా తగ్గిపోతోంది. మరోవైపు సన్నరకాలు శ్రీరామ్, హెచ్‌ఎంటీ, సోనా మసూరి, బీపీటీతో పోలిస్తే దొడ్డు రకాల ధాన్యం ఐఆర్ 64, ముల్కనూరు ఇతర రకాల ధాన్యం నుంచి దిగుబడి ఎక్కువగా వస్తోంది. మరోవైపు దొడ్డు ధాన్యానికి, సన్నరకం ధాన్యానికి మద్దతు ధర విషయంలో పెద్దగా తేడా లేకపోవడంతో రైతులు దొడ్డురకం ధాన్యం సాగుకే మొగ్గు చూపుతున్నారు.
అదే సమయంలో దొడ్డురకం వరి పైరుతో పోల్చుకుంటే సన్నరకం వరి పైరుకు చీడపీడల బాధలు ఎక్కువగా ఉంటాయి. వివిధ రకాల మందులు పిచికారి చేయాల్సి ఉంటుంది. దీంతో రైతులు సన్నరకం ధాన్యాన్ని సాగు చేయడానికి మొగ్గు చూపడం లేదు. ఇటు ప్రభుత్వం కొనుగోలుచేయక, ప్రయివేటకు తీసుకెళ్తే వ్యాపారులు కూడా పెద్దగా ధర పెట్టకపోవడంతో సన్న రకం వరి ధాన్యం సాగు ఏటేటా తగ్గుతూ వస్తోంది. మరోవైపు గత వానాకాలం, యాసంగిలో ప్రతికూల వాతావరణ పరిస్థితులు భారీ, అకాల వర్షాలతోపాటు వివిధ రకాల తెగుళ్లు సన్నరకం వరిపై ముప్పేటదాడి చేశాయి. దీంతో దిగుబడి భారీగా తగ్గిందని రైతులు చెబుతున్నారు. ఇలా పలుకారణాల ప్రభావంతో సన్నరకం సాగు, దిగుబడి తగ్గి ధరల పెరుగుదలకు కారణమవుతోందని వ్యవసాయశాఖ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
నెలన్నర క్రితం సోనా మసూరి, హెచ్‌ఎంటీ, బీపీటీ, జై శ్రీరాం తదితర రకాల కొత్త బియ్యం ధరలు క్వింటాకు రూ.5వేలదాకా ఉండేవి. కాని ఇప్పుడు క్వింటా సన్నబియ్యం ధర రూ.6500దాకా పెరిగింది. అంటే కొత్త సన్నబియ్యం ధరలు నెలన్నరరోజు ల వ్యవథిలోనే రూ.1000 నుంచి రూ.1500దాకా పెరిగాయి. ఇక ఏడాది క్రితం సన్న బియ్యం ధరలు క్వింటాకు రూ.7వేల దాకా చేరాయని వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం సూపర్ మార్కెట్, బహిరంగ మార్కెట్లలో 25 కేజీల సోనా మసూరి బ్యాగ్ ను రూ.1500 నుంచి 1800 దాకా విక్రయిస్తున్నారు. సన్నబియ్యం ధరలకు రెక్కలు రావడంతో ఇదే అదనుగా కొందరు ట్రేడర్లు, రైస్ మిల్లర్లు సన్న బియ్యాన్ని బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తూ కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని విమర్శలూ వినిపిస్తున్నాయి. కొందరు మిల్లర్లు రేషన్ బియ్యాన్నే పదే పదే పాలిష్ కొట్టి సన్నబియ్యంగా విక్రయిస్తున్నారు.
అసలు మన దేశంలో బియ్యానికే కొరత ఉండదు. ఎందుకంటే కావాల్సిన దాని కంటే ఎక్కువే పండుతోంది. మరి ఎగుమతులు నిషేధించాల్సినంత అవసరం ఏమి వచ్చింది ? అంటే… అనుమతులతో సంబంధం లేకుండా… పెద్ద ఎత్తున బియ్యం సరిహద్దులు దాటిపోతోందన్నమాట.
శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌వంటి దేశాలకు అనధికారికంగా బియ్యం ఎగుమతులు జరుగుతున్నాయి. ఏపీలో ఓ అధికార పార్టీ నేత బియ్యం మాఫియాకు అనధికారిక లీడర్ అని చెబుతారు. తన నియోజకవర్గంలో ఉన్న పోర్టు ద్వారా లక్షల టన్నుల బియ్యాన్ని ఆఫ్రికా దేశాలకు పంపుతారని అంటారు. చైనా తర్వాత అతిపెద్ద వరి సాగు చేసే దేశంగా మన దేశం ఉంది. ప్రపంచం మొత్తం మీద 40 శాతం వరి మన దేశంలోనే పండుతోంది. వరి సాగు తగ్గడం వల్ల కూడా ధరలు పెరిగాయని చెబుతున్నారు. బియ్యం ధరల పెరుగుదలకు ఎగుమతులకు అనుకూల వాతావరణం ఏర్పడటం కూడా ఒక కారణంగా చెబుతున్నారు. బంగ్లాదేశ్ దిగుమతి సుంకాన్ని 25 నుంచి 15.5 శాతానికి తగ్గించింది. బియ్యం ధరలతో పాటు గోధుమల ధరలు కూడా పెరిగిపోతున్నాయి. ఉక్రెయిన్ యుద్ధం కారణంగా గోధుమ ధరలు పెరిగాయనిచెబుతున్నారు. ధాన్యం ధరలపై ప్రభుత్వాధికారులకే స్పష్టత లేదు.
అధికారికంగానే కాకుండా అనధికారికంగా ధాన్యం పంట వేస్తుంటారు. ఆ విధంగా వచ్చిన దిగుబడి ఏమైపోతోందో తెలియ దు. మిల్లర్లు, వ్యాపారులు కుమ్మక్కు కావడం వల్లనే ఇలా జరుగుతోందన్న ఆరోపణలు వస్తున్నాయి. 25 కిలోల బియ్యం ధర బస్తా ఏటికాయేడు పెరిగిపోతోంది. బియ్యం మార్కెట్లపై ప్రభుత్వానికి అదుపులేదు. చౌకధరల దుకాణాల్లో విక్ర యించాల్సిన బియ్యం బ్లాక్ మార్కెట్‌కి తరలి పోతోందని ఆరోపణలు వస్తున్నాయి. బియ్యం వర్తకులు నిల్వ ఉంచుకునే వారనీ, ఇప్పుడు ఎంత లాభం వస్తే అంతకు అమ్మేస్తున్నారని, ఎక్కడా నిల్వ ఉండటం లేదని చెబుతున్నారు. ప్రభుత్వం అమలుజేస్తున్న పథకాల ప్రయోజనాలు నేరుగా లబ్ధిదారులకు చేరినట్టే, ఆహార ధాన్యాలు కూడా కుటుంబాలవారీగా క్రమం తప్పకుండా చేరేట్టు చర్యలు తీసుకుంటేనే బియ్యం ధరలు అదుపులోకి వస్తాయి. లేకపోతే ప్రజలు బలైపోవాల్సిందే.
భారతీయులు ముఖ్యంగా దక్షిణ భారతీయుల ప్రధాన ఆహారం బియ్యం.. వాటి కొరత ఏర్పడినా.. రేట్లు పెరిగినా ఆకలి చావులే ఉంటాయి. ఇలాంటి పరిస్థితి రావడం దేశానికి అవమానమే .
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి …..