రాష్ట్ర విభజన హామీలన్నింటినీ నెరవేర్చేశామని కేంద్రం పార్లమెంట్ లో ప్రకటించింది. కానీ రెండు రాష్ట్రాల ఎంపీలు నోరెత్తలేదు. చేయలేము అని చెప్పడం నెరవేర్చడం ఎందుకు అవుతుందో ప్రశ్నించలేకపోయారు. నిజానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో విభజన చట్టంలో భాగంగా ఇచ్చిన కనీస హామీలు నెరవేర్చలేదు. ఆ విషయం కళ్ల ముందే ఉంది. కానీ ఎందుకు కేంద్రాన్ని నిలదీయలేకపోతున్నారు. చివరికి ఉమ్మడి ఆస్తుల్ని కూడా విభజించలేదు. ఢిల్లీలో ఏపీ భవన్ ను కూడా విభజించలేకపోయారు. మరి కేంద్రం చేసిందేమిటి ? రాష్ట్రాలు ఎందుకు భయపడుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని అన్ని హామీలను నెరవేర్చామని, ఇంకా కొన్ని మాత్రమే మిగిలి ఉన్నాయంటూ కేంద్రం తేల్చేసింది. ఆ మిగిలిన హామీలకు సంబంధించిన పనులు కూడా జరుగుతున్నాయని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ తెలిపారు. రెండు రాష్ట్రాల ఉమ్మడి సమస్యలను వాటి సహకారంతోనే పరిష్కరిస్తామని, తాము కేవలం మధ్యవర్తిత్వం మాత్రమే వహిస్తామని చెప్పారు. ఈ చట్టలపై ఇప్పటికే అనేక సమీక్షలు నిర్వహించామని, చాలా హామీలను నెరవేర్చామని చెప్పేశారు. నిజానికి అసలు నెరవేరినవి వేళ్ల మీద లెక్కబెట్టవచ్చు. అయితే రెండు ప్రభుత్వాలూ ఆశలు వదిలేసుకున్నట్లుగా లైట్ తీసుకుంటున్నాయి.
2014లో ఆమోదం పొందిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని హామీలను కేంద్ర ప్రభుత్వం పదేళ్లలో అంటే 2024 నాటికి పూర్తి చేయాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో విభజన హామీలను అమలు చేయాలని రెండు రాష్ట్రాలు కోరుతున్నాయి. మొదటి ఐదేళ్లు ప్రభుత్వాలు కేంద్రం వెంట పడ్డాయి. కానీ తర్వాత మొత్తం కాడి దించేశారు. చట్టంలో లేకపోయినా ఏపీకి ఇచ్చిన హామీ ప్రత్యేక హోదాతో పాటు కడప లో స్టీల్ ప్లాంట్, గిరిజన, పెట్రోలియం విశ్వవిద్యాలయాలకు అనుమతులు, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ పునరుద్ధరణ అన్నింటికీ మించి పోలవరం అంచనాల సవరణలకు ఆమోదం లభించలేదు. ఏపీ విభజన హామీల్లో భాగంగా ఏపీకి రైల్వే జోన్ ప్రకటించిన కేంద్రం, జోన్ ఏర్పాటుకు మార్గం సుగమం చేస్తూ 2019 ఫిబ్రవరి 27న విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రకటించింది. కానీ అసలు రైల్వే జోన్ పనులు మాత్రం ప్రారంభం కాలేదు. పరిశీలిస్తున్నాం, రైల్వే బోర్డు అధ్యయనం చేస్తుంది అనే సమాధానాలే తప్ప, ఇప్పటికీ స్పష్టమైన సమాధానం రాలేదు. విభజన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో సమాన విద్యావకాశాలు ఉండాలనే ఉద్దేశంతో విభజన చట్టంలోని 13వ షెడ్యూల్లో సమాన విద్యావకాశాల కల్పన కోసం వివిధ కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ట్రిపుల్ ఐటీ, ఐఐటీ, ఐఐఎం, సెంట్రల్ యూనివర్సిటీ, పెట్రో యూనివర్సిటీ, అగ్రికల్చర్ యూనివర్సిటీతో పాటు తెలంగాణ, ఏపీలలో ఒక్కొక్కటి చొప్పున గిరిజన యూనివర్సీటీలు కూడా ఏర్పాటు చేయాలి. దీనికి 354 ఎకరాల భూమిని ఏపీ ప్రభుత్వం కేటాయించింది. కానీ అక్కడ వర్సిటీకి సంబంధించిన నిర్మాణ పనులేవీ ప్రారంభం కాలేదు. కానీ ఏపీ ప్రభుత్వం కిక్కురుమనడం లేదు.
తమకు సంపూర్ణ మెజారిటీ ఇచ్చి గెలిపించందడి.. కేంద్రం మెడలు వంచి విభజన హామీలు సాధించుకు వస్తామని హామీ ఇచ్చిన జగన్.. సాధించింది ఏమీ లేదనే విమర్శలు ఉన్నాయి. అదే విధంగా విభజన చట్టంలోని 8వ షెడ్యూల్ ప్రకారం, 8 మౌలిక వసతుల ప్రాజెక్టులను పూర్తి చేయడంతో పాటు, జాతీయ ప్రాధాన్యం ఉన్న 11 సంస్థలను పూర్తి స్థాయిలో 2024 నాటికి ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇంకా, బుందేల్‌ఖండ్‌లో ఇచ్చిన విధంగా వెనకబడిన జిల్లాలకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీని కూడా పూర్తిగా అమలు చేయలేదు. ఇక షెడ్యూల్ 9, 10 జాబితాలో ఉన్న సంస్థలకు సంబంధించి చట్టపరంగా ఇరు రాష్ట్రాల మధ్య ఆస్తుల పంపిణీ. వాటి విలువ దాదాపు రూ.1,42,601 కోట్లుగా అంచనా. అయితే ఆయా సంస్థలను విభజన చట్టంలో ప్రస్తావించకపోవడం వల్ల, ఆస్తుల పంపిణీ జరగకపోవడంతో ఆంధ్రప్రదేశ్‌కు చాలా నష్టం జరుగుతోంది. ఇక కడపలో స్టీల్ ప్లాంట్ పెడతామన్నారు..దుగరాజపట్నం పోర్టు కడతామన్నారు. కానీ ఏవీ సాధ్యం కాదని తేల్చేసి.. అవే అమలు చేయడం అంటున్నారు.
ఏపీకే కాదు .. తెలంగాణ విభజన హామీలు కూడా ఎక్కడివక్కడే ఉన్నాయి. కానీ తెలంగాణ సర్కార్ తెలంగాణలో పోరాడుతోంది. ఢిల్లీలో మాత్రం సైలెంట్ గా ఉంటోంది .
తెలంగాణ ప్రభుత్వం విభజన హామీలపై కాస్త క్లా రిటీతోనే ఉంది. ఖమ్మంలోని బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేస్తామని కేంద్రం స్పష్టంగా విభజన చట్టంలో పేర్కొన్నది. కానీ ఇంతవరకు ఎలాంటి ముందడుగు పడలేదు. అ ములుగులో గిరిజన కేంద్రీయ విశ్వవిద్యాలయం హామీ తొమ్మిదేండ్లుగా మూలన పడి ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం 331 ఎకరాలను, తాత్కాలిక వసతి కోసం భవనాలను కేటాయించినా కేంద్రం అడుగు ముందుకు వేయడం లేదు. కేవలం డీపీఆర్‌ను సిద్ధం చేసింది. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీని పెడతామని కేంద్రం స్వయంగా విభజన చట్టంలో హామీ ఇచ్చింది. దీనిని సుమారు తొమ్మిదేండ్లు నానబెట్టి.. చివరికి వ్యాగన్ ఉత్పత్తికి అంగీకరించింది. ఇటీవలే ప్రధాని మోదీ ఫ్యాక్టరీ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలోని వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి ఏటా రూ.450 కోట్లు ఇస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. తొమ్మిదేండ్లలో కేవలం నాలుగేండ్లకు మాత్రమే నిధులు ఇచ్చింది. ఇంకా 2014-15, 2019-20, 2021-22, 2022-23కు సంబంధించిన ఐదేండ్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. తెలంగాణలో ఏదేని ఒక నీటిపారుదల ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని విభజన చట్టంలో స్పష్టంగా ఉన్నది. ఈ మేరకు కాళేశ్వరం ప్రాజెక్టుకుగానీ, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకుగానీ జాతీయ హోదా ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం ఎన్నిసార్లు కోరినా ఫలితం లేదు. కానీ నెరవేర్చేశామని కేంద్రం చెబుతోంది.
ఇక ఉమ్మడి ఆస్తుల విభజన తెలంగాణకు చాలా కీలకం. మధ్యవర్తిగా ఉంటూ అనేక అంశాలపై తెలంగాణ, ఏపీ రాష్ర్టాలతో 31 సార్లు సమీక్షలు జరిపామని పార్లమెంట్లో కేంద్రం పేర్కొన్నది. కేవలం నామమాత్రానికే సంప్రదింపులు తప్ప వీటి వల్ల ఒరిగిందేమీ లేదు. రెండు సమస్యలు కూడా పరిష్కారం కాలేదు. షెడ్యూల్ 9, 10 లోని సంస్థల విభజన తొమ్మిదేండ్లయినా త్రిశంకు స్వర్గంలోనే ఎందుకు ఉన్నదన్నది విశ్లేషకుల ప్రశ్న. చర్చలు, కమిటీలు, కాలయాపనలు తప్ప జరిగిందేమీ లేదని మండిపడుతున్నారు. 2014-15లో తెలంగాణకు రావాల్సిన సీఎస్ఎస్ నిధులు రూ.495 కోట్లను కేంద్రం పొరబాటున ఏపీకి బదలాయించింది. వాటిని వెనక్కి ఇప్పించాలని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదు. రూ.500 కోట్లే వెనక్కి తేలేనివారు వందల సార్లు సమీక్షలు, సంప్రదింపులు చేసినా ఫలితం లేదు.
అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో విభజన చట్టంలో భాగంగా పరిష్కారం అయినవి కొన్నే. కానివి ఎన్నో ఉన్నాయి. కాలమే పరిష్కరిస్తుందన్నట్లు కేంద్రం నిమిత్తమాత్రంగా ఉంటుంది. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు రాజకీయ డ్రామాలతో బండి నడిపించేస్తున్నాయి. అంతిమంగా రాష్ట్రాలు నష్టపోతున్నాయి.. ప్రజలు నష్టపోతున్నారు…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి …..