ఆయన్నలా వదిలేయకండిరా…ఇది కేటీఆర్ డైలాగు. ఆయన్ను కంట్రోల్లో పెట్టండిరా…ఇది బండి సంజయ్ డైలాగు. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో ఈ రెండు పార్టీల నడుమ సాగుతున్న మాటల యుద్ధం ఆసక్తికరంగా మారింది. ఫామ్ హౌస్‌లో సీఎం కేసీఆర్ సకుటుంబ సమేతంగా తాంత్రిక పూజలు చేశారు అని బండి సంజయ్ ఆరోపణలు చేశారు. పూజల అనంతరం కాళేశ్వరం వెళ్లి ఆ ద్రవాలను నీళ్లలో కలిపారని చెప్పారు. తాంత్రికుడు సూచనతోనే టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్గా మార్చారని, ఈ విషయం తనకు ఒక స్వామీజీ ద్వారా తెలిసిందని చెప్పారు. మూడు నెలలకు ఒకసారి నల్లపిల్లితో కేసీఆర్ ఈ తాంత్రిక పూజలు నిర్వహిస్తున్నారని బండి సంజయ్ పేర్కొన్నారు. కేసీఆర్‌కు దేవుడిపై నమ్మకం లేదని తాంత్రికుడి మాటలు నమ్మి దయ్యాలను పూజిస్తున్నాడని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రకటనకు ఆ తాంత్రికుడే ముహూర్తం పెట్టాడని చెప్పారు. మంత్రగాళ్ల మాటలు నమ్మి సచివాలయానికి వెళ్లడం మానేశాడని, అతని సూచన మేరకే సచివాలయాన్ని కూల్చేసి కొత్తది కడుతున్నారని విమర్శించారు. బండి సంజయ్ చేసిన ఆరోపణలపై కేటీఆర్ మండిపడ్డారు. ఈ లవంగం గారిని ఇలా వదిలేకండిరా …పిచ్చి ముదిరి తొందర్లో కరవడం మొదలెడతాడేమో…ఎర్రగడ్డలో బెడ్ రెడీగా ఉంది..తొందరగా తీసుకెళ్లి వైద్యం చేయించండి అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌పై బండి సంజయ్ మరో ట్వీట్ చేశారు. ట్విట్టర్ టిల్లు గారి డ్రగ్స్ డోసేజిని కంట్రోల్లో పెట్టండిరా పింకీలు అని సెటైర్ వేశారు. కాపలా కుక్కలా ఉండమని పదవిస్తే…కచరా కుక్కలు పిచ్చెక్కి కరవడానికి ఊరి మీద పడ్డాయని వ్యాఖ్యానించారు. పోయి వెటర్నరీ డాక్టర్‌కు చూపించుకోండి అంటూ బదులిచ్చారు. కంటికి అంజనం అద్దుకొని తిరిగే క్షుద్ర మంత్రగాళ్లు..డ్రగ్స్ సేవించే బ్లాక్ మెయిలర్లు..తైతక్కలాడే లిక్కర్ సీసాలు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ ట్విట్టర్ డైలాగులు ఇంకెంత దూరం వెళ్తాయో చూడాలి.