వన్ నేషన్ వన్ ఎలక్షన్ అని గట్టిగా నినదించిన భారతీయ జనతాపార్టీ ఎందుకోగానీ దాన్నుంచి దూరం జరగాలని చూస్తోంది. జమిలి ఎన్నికలకు కావలసిందే అని పదే పదే పట్టుబట్టిన కాషాయం పార్టీ ఎందుకని జమిలి పేరు చెబితేనే ఇపుడు కంగారు పడుతోంది? దీని వెనుక ఏదో ఒక ఆంతర్యం ఉందంటున్నారు రాజకీయ పండితులు.జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే ఇప్పటికిప్పుడు సాధ్యం కాదని కూడా అనేసింది బిజెపి. దీనికోసం కొన్ని మార్పులు చేర్పులు అవసరమని అంటోంది. ఇదే ఇపుడు దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీస్తోంది.
జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై వివిధ రాజకీయ పక్షాలతో సమావేశమైంది బిజెపి. 40 కి పైగా పార్టీలు హాజరైన ఈ సమావేశంలో మెజారిటీ పార్టీలు జమిలి ఎన్నికలకు సానుకూలత వ్యక్తం చేశాయి. అయితే మిగతా పార్టీలు మాత్రం జమిలి ఎన్నికలను వ్యతిరేకించాయి. ఈ నేపథ్యంలోనే బిజెపి తన వైఖరిని స్పష్టం చేసింది.జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే రాజ్యాంగ పరంగా అయిదు సవరణలు అవసరమని బిజెపి అంటోంది. అయినా కూడా న్యాయ పరంగా కొన్ని చిక్కులు ఉంటాయని అంటోంది.
2014లో బిజెపి అధికారంలోకి వచ్చి నరేంద్ర మోదీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వన్ నేషన్ వన్ ట్యాక్స్ అంటూ జి.ఎస్.టి.ని తెచ్చారు. ఆ క్రమంలోనే వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఉండాలన్నారు. దానికి కారణం కూడా చెప్పారు. లోక్ సభకు, వివిధ రాష్ట్రాల అసెంబ్లీలకూ ఒకేసారి ఎన్నికలు జరగాలని అన్నారు. ప్రస్తుతం అయిదేళ్ల కోసారి లోక్ సభ ఎన్నికలు జరుగుతూ ఉంటే అయిదేళ్లూ దేశంలో ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతూనే ఉంటున్నాయని దీని వల్ల అభివృద్ది పథకాలు అమలు చేయడానికి ఎన్నికల కోడ్ అడ్డు వస్తోందని ఆయన అన్నారు.
బిజెపి ప్రతిపాదించిన జమిలి ఎన్నికల కాంసెప్ట్ ను వివిధ రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. జమిలి ఎన్నికలు మనదేశంలో సాధ్యం కాదని విపక్షాల నేతలు వాదించాయి. అయితే అప్పట్లో బిజెపి జమిలి ఎన్నికలు జరిపి తీరాల్సిందే అంది. అవసరమైతే రాజ్యాంగ సవరణ చేసి అయినా జమిలి ఎన్నికలకు సంబంధించి చట్టం తెస్తామని అంది. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం బలవంతంగా చట్టం తెస్తే దాన్ని వ్యతిరేకిస్తామని బిజెపిని వ్యతిరేకించే మమతా బెనర్జీ, సమాజ్ వాది పార్టీ, కమ్యూనిస్టు పార్టీల వంటివి హెచ్చరించాయి.
జమిలి ఎన్నికలు అయితే దేశమంతా ఓటర్లలో ఒకే మూడ్ ఉంటుందన్నది బిజెపి అంచనా. అప్పట్లో కాంగ్రెస్ పట్ల వ్యతిరేకతతో బిజెపికి పట్టం కట్టారు దేశ వ్యాప్తంగా ప్రజలు. అందుకే బిజెపికి భారీ మెజారిటీ కట్టబెట్టారు. జనం ఆ మూడ్ లో ఉన్నప్పుడే అన్ని రాష్ట్రాలకు, లోక్ సభకు ఎన్నికలు జరిపితే దేశ వ్యాప్తంగా కాషాయం జెండానే ఎగరేయచ్చని కమలనాథులు భావించారు. అయితే అది ఇప్పటి వరకు కుదరలేదు. ఈ ఏడాది చివర్లో అయిదు రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే ఏడాది లోక్ సభ ఎన్నికలతో పాటు మరో అయిదు రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి.
కర్నాటక ఎన్నికలకు ముందు వరకు బిజెపి జమిలి ఎన్నికలపై చాలా పట్టుదలగా ఉంది. ఆఎన్నికల్లో తామే గెలుస్తామని అనుకుంది. అయితే బిజెపి నేతల అంచనాలు తల్లకిందులయ్యాయి. కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ఆ తర్వాత దేశ వ్యాప్తంగా ప్రజల ఆలోచనల్లో మార్పు వస్తోందని సర్వేల్లో తేలడంతోనే బిజెపిలో కంగారు మొదలైందంటున్నారు. పొరపాటున పదిరాష్ట్రాల ఎన్నికలతో లోక్ సభ ఎన్నికలు నిర్వహిస్తే రాష్ట్రాల్లో బిజెపిపై ఉన్న వ్యతిరేకత లోక్ సభ ఎన్నికలపైనా ప్రభావం చూపే ప్రమాదం ఉందని బిజెపి వ్యూహకర్తలు ఆందోళన చెందుతున్నట్లు సమాచారం.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి …..