కేంద్ర మంత్రి కాదు.. ప్రధాన కార్యదర్శే..

By KTV Telugu On 31 July, 2023
image

KTV Telugu ; –

బండి సంజయ్ భవితవ్యం ఏమిటి. ఆయన్ను టీబీజేపీ అధ్యక్ష పదవి నుంచి ఎందుకు తొలగించారు. కేంద్ర మంత్రి పదవి ఇస్తారనుకుంటే అది కూడా ఎందుకు దక్కలేదు. ఇప్పుడు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి ఇవ్వడాన్ని ఎలా చూడాలి..

తెలంగాణ బీజేపీలో ఆ ఇద్దరు నేతలకు లభిస్తున్న గౌరవం ప్రశ్నార్థకమే అవుతోంది. బండి సంజయ్ ను తొలగించి ఆయన స్థానంలో కిషన్ రెడ్డిని నాలుగోసారి టీ. బీజేపీ అధ్యక్ష పదవిలో కూర్చోబెట్టడాన్ని పెద్ద జోక్ గా వర్ణించిన వాళ్లు ఉన్నారు. రాష్ట్ర శాఖ అధ్యక్ష పదవి తీసుకోవడం సంజయ్ కు ఇష్టం లేదని ఆయన మాటలు, ఆయన బాడీ లాంగ్వేజ్ ని బట్టే అర్థమవుతోంది. ఇక కేంద్ర మంత్రి పదవి ఇస్తారనుకుంటే బండి సంజయ్ కు మొండి చేయి చూపించారు. ఇప్పుడు జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిని కట్టబెట్టారు. దానితో ఆయన మళ్లీ పార్టీకే పరిమితమయ్యే అవకాశం కనిపిస్తోంది.

బండి సంజయ్ ను టీబీజేపీ అధ్యక్ష పదవి నుంచి ఎందుకు తొలగించారంటే దానికి అనేక కారణాలు చెప్పుకోవచ్చు. అధిష్టానం నుంచి ఎలాంటి వివరణ రాని తరుణంలో ఆ కారణాలన్నీ ఊహాగానాలే అవుతాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ పావులు కదిపి బండి సంజయ్ ను లేపేశారని వాదించే వాళ్లు ఉన్నారు. అందులో నిజం ఉండొచ్చు లేకపోవచ్చు. ప్ర‌త్యేకించి క‌ర్ణాట‌క ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత త‌మ వ్యూహాల‌ను మార్చుకోవ‌డంలో భాగంగా బీజేపీ బండి సంజ‌య్ ను త‌ప్పించిన‌ట్టుగా వార్త‌లు వ‌చ్చాయి. బండి మార్కు రాజ‌కీయం తెలంగాణ‌లో వ‌ర్క‌వుట్ కాద‌నే నిర్ణ‌యానికి అధిష్టానం వ‌చ్చిన‌ట్టుగా విశ్లేష‌ణ‌లు వినిపించాయి.తెలంగాణ‌లో బీజేపీని బండి సంజ‌య్ ఎంతో కొంత బ‌లోపేతం చేసినా, ఆయ‌న‌తో ఇంత‌కు మించి సాధ్యం కాద‌ని బీజేపీ హైక‌మాండ్ భావించి ఉండ‌వ‌చ్చ‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డ్డారు. సంజ‌య్ కు అంత‌కు మించి పెద్ద బాధ్య‌త‌లు ద‌క్కుతాయ‌ని, ఆయ‌న‌ను కేంద్రంలో స‌హాయ‌మంత్రిగా తీసుకోవ‌డం ఖాయ‌మ‌నే ప్ర‌చారం కూడా ఆ స‌మ‌యంలోనే జ‌రిగింది. అయితే ఎన్నిక‌ల‌కు మ‌రెంతో స‌మ‌యం లేదు. ఇప్పుడు బండి సంజ‌య్ కోసం ప్ర‌త్యేకంగా కేంద్రమంత్రి వ‌ర్గంలో మార్పులుచేర్పులు చేయ‌లేమ‌నుకున్నారో.. ఏమో కానీ, ఆయ‌న‌కు జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శుల్లో ఒక‌రిగా చేసింది బీజేపీ అధిష్టానం. పార్టీ బాధ్యతలు చూసుకోవాలని ఆదేశించింది.

కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డిని ఆ పదవిలోంచి ఇంకా తొలగించలేదు. టీబీజేపీ అధ్యక్షుడిగా ఆయన అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నట్లు అనుకోవాలి. తాను రాజీనామా చేయకపోయినా కేంద్రమంత్రిగా లేనని కిషన్ రెడ్డి చెప్పుకుంటున్నారు. అది ఆయనలోని అసంతృప్తికి నిదర్శనంగా భావించాల్సి ఉంటుంది. తనను డిమోట్ చేశారని కిషన్ రెడ్డి భావిస్తుండొచ్చని కూడా వాదనలు వినిపిస్తున్నాయి. మరి బండి సంజయ్ తీరు మరోలా ఉంది. ఇటీవల ఆయన ఢిల్లీ పెద్దలను కలవడంతో కేంద్రమంత్రివర్గంలో చోటు ఖాయమని వార్తలు వచ్చాయి. బండి సంజయ్ పార్టీ మనిషి మాత్రమేనని, ఆయన సేవలు పార్టీకి వినియోగించడమే కరెక్టని నిర్ణయానికి వచ్చినట్లున్నారు. అందుకే ఆయన్ను ప్రధాన కార్యదర్శి పదవిలో కూర్చోబెట్టారు.

బండి సంజయ్ ఇప్పుడేం చేయబోతున్నారు. టీబీజేపీ ఆయన సేవలను మరో విధంగా వినియోగించుకుంటుందా. జాతీయ ప్రధాన కార్యదర్శిగా తెలంగాణ యూనిట్ ను కూడా అభివృద్ధి చేసేందుకు ఆయన ప్రయత్నిస్తారా అన్నది పెద్ద ప్రశ్నే. పైగా అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ కరీంనగర్ ఎంపీగా ఆయన ఎంతో కొంత సమయం ఎన్నికల ప్రచారంలో భాగస్వామి కావాల్సిందే. అప్పుడు సంజయ్ మునుపటి దూకుడును ప్రదర్శిస్తారో లేదో చూడాలి.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి …..