రాహుల్ జోడోయాత్రలో రఘువీరా!

By KTV Telugu On 10 October, 2022
image

రాజకీయ సెలవు కొనసాగుతోంది..
త్వరలో ఏపీకి జోడోయాత్ర
రాహుల్ ను కలుస్తానన్న రఘువీరా
భవిష్యత్ రాజకీయాలపై సంచలన ప్రకటన

మాజీ మంత్రి రఘువీరారెడ్డి తన రాజకీయ భవిష్యత్తుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో రాహుల్ జోడో యాత్ర గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత కొన్నేళ్లుగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్న రఘువీరా..అది కంటిన్యూ అవుతుందని స్పష్టం చేశారు గతంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం ఆ మాటకు కట్టుబడి ఉన్నట్లు తన మనసులోని మాట బయటపెట్టారు. అయితే, త్వరలో రాష్ట్రానికి రానున్న రాహుల్ జోడో యాత్రలో మాత్రం పాల్గొననున్నట్లు ప్రకటించారు. ఇందులో ఎలాంటి రాజకీయం లేదన్నారు.

రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర ఈ నెల 18న కర్నూలు జిల్లాలో ప్రవేశించనుంది. యాత్ర దిగ్విజయంగా కొనసాగాలని ఆకాంక్షిస్తూ….. నీలకంఠేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు చేసి, తీర్థ ప్రసాదాలు, వస్త్రాన్ని రాహుల్‌గాంధీకి ఇవ్వనున్నట్లు రఘువీరారెడ్డి చెప్పారు. దీంతో రఘువీరా తిరిగి రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇవ్వనున్నారంటూ ప్రచారం మొదలైంది. గత కొంతకాలంగా ఆయన టీడీపీలోకి వెళ్తున్నారని, వైసీపీలోకి వెళ్లనున్నారనే ఊహగానాలు కూడా వినిపించాయి. అయితే, వాటన్నంటికీ చెక్ పెడుతూ రఘువీరారెడ్డి క్లారిటీ ఇచ్చారు. రాహుల్ యాత్రలో మాత్రమే పాల్గొంటానని, రాజకీయ సెలవు కొనసాగుతుందని స్పష్టం చేశారు. దీంతో, రఘువీరా పొలిటికల్ రీఎంట్రీపై జరుగుతున్న ప్రచారానికి తెరపడినట్లయింది.

శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన సీనియర్ నేత నీలకంఠాపురం రఘువీరారెడ్డి .. ఉమ్మ‌డి రాష్ట్రంలో ఓ వెలుగు వెలిగారు. దివంగ‌త ముఖ్యమంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి కేబినెట్‌లో వ్యవసాయశాఖా మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత పార్టీ ఏపీ అధ్య‌క్షుడిగా కొంత‌కాలం పాటు కొన‌సాగారు. 2019 ఎన్నిక‌ల త‌ర్వాత అనూహ్యంగా పీసీసీ చీఫ్ ప‌ద‌వికి కూడా రాజీనామా చేసి రాజకీయాలకు దూరమయ్యారు. ఆ తర్వాత త‌న సొంతూరు నీల‌కంఠాపురం చేరారు. ఓ సామాన్య రైతులా మారిపోయారు. గ్రామంలో ఆలయాన్ని కూడా నిర్మించారు. అప్పుడప్పుడూ వ్యవసాయ పనులు చేసుకుంటూ, సరదాగా ఈత కొడుతూ కనిపించిన రఘువీరా… ఇటీవ‌లే జ‌రిగిన వైఎస్సార్ వ‌ర్ధంతి కార్య‌క్ర‌మాల్లో మెరిశారు. మళ్లీ రాహుల్ జోడో యాత్రలో కనిపించబోతున్నారు.