కేశినేని నానికి చెక్ పెడుతున్నారా.. ?

By KTV Telugu On 1 August, 2023
image

KTV Telugu ;-

విజయవాడ రాజకీయాలు మారుతున్నాయి. రాజకీయ చైతన్యం ఉన్న ప్రాంతంలో టీడీపీ అధినేత కొత్త గేమ్ ఆడుతున్నారు. తనను లెక్క చేయని సిట్టింగ్ ఎంపీ కేశినేని నానిని సాగనంపేందుకు సిద్దమయ్యారు. ఈ సారి బెడవాడ ఎంపీ టికెట్ అయన సోదరుడు చిన్నికి ఇవ్వాలని డిసైడైనట్లు ప్రచారం జరుగుతోంది. దానితో నాని కూడా సొంతబలాన్ని పెంచుకునేందుకు పావులు కదుపుతున్నారని సమాచారం.

బెజవాడను ఏపీకి రాజకీయ రాజధానిగా పిలుస్తారు. ఎవ్వరినీ కదిలించినా ముందు రాజకీయాలు మాట్లాడి తర్వాత క్షేమ సమాచారాలు విచారిస్తారని చెబుతుంటారు. టీడీపీ గెలుస్తుందా… వైసీపీ గెలుస్తుందా అన్న ప్రశ్నకు ఖచితమైన సమాధానం చెప్పిన వారికి విజయవాడ వాసులు రాచమర్యాదలు చేస్తారట. అలాంటి బెజవాడలో ఇప్పుడు టీడీపీకి పెద్ద ధర్మసంకటమే వచ్చి పడింది. వరుసగా రెండు సార్లు అక్కడ ఎంపీగా గెలిచిన కేశినేని నానికి టికెట్ ఇచ్చే విషయమై టీడీపీ అధినేత చంద్రబాబు తర్జన భర్జనలు పడుతున్నారు. నానికి వద్దులే సేవా కార్యక్రమాల్లో మునిగిన ఆయన తమ్ముడు చిన్నికి టికెట్ ఇద్దామన్న ఆలోచన కూడా చంద్రబాబు మదిలో గట్టిగా పాతుకుపోయింది.

నాని కాస్త ఎక్కువగా మాట్లాడుతుంటారన్న ప్రచారం చాలా రోజులుగా ఉంది. గత ఏడాది కాలంగా ఆయన ఇచ్చిన స్టేట్ మెంట్స్ పార్టీకి కాస్త ఇబ్బందికరంగానే ఉన్నాయి ఉమ్మడి కృష్ణా జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎవరు నిలబడాలో కూడా నాని డిసైడ్ చేసేస్తున్నారట. పైగా ఫలానా వారికి టికెట్ ఇస్తే ఓడిపోతారని, తాను చెప్పిన నాయకుడికి ఇస్తే మాత్రమే గెలుస్తారని కూడా స్టేట్స్ మెంట్స్ ఇస్తున్నారట.నాని ఎంత ప్రైవేటుగా మాట్లాడినా అది పబ్లిక్ అయిపోతుంది. పైగా తన సోదరుడు చిన్నీకి పార్టీలో ప్రాధాన్యం లభించడం నానికి అసలు నచ్చడం లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే తాను పార్టీని వదిలిపెట్టి వెళ్లాల్సి వస్తుందని నాని హెచ్చరిస్తున్నారు. తాను ఇండిపెండెంట్ గా పోటీ చేసినా గెలుస్తానని, ఆ సత్తా తనకుందని నాని బహిరంగంగానే ప్రకటించారు. ఇదీ ముమ్మాటికి పార్టీ ధిక్కారమేనని ప్రచారం జరుగుతోంది.

కేశినేని చిన్ని కూడా అధినాయకత్వం నుంచి టికెట్ హామీని పొంది ఉంటారని అందుకే ఆయన జనంలోకి జోరుగా వస్తున్నారని అంటున్నారు. కేశినేని నాని సిట్టింగ్ ఎంపీగా ఉండగానే టీడీపీకి చెందిన ఏడు నియోజకవర్గాల నేతలు అంతా చిన్నీతో చెట్టాపట్టాల్ వేసుకోవడం పట్ల కూడా చర్చ సాగుతోంది. చిన్నీ సేవా కార్యక్రమాలు కూడా అధినాయకత్వం గేమ్ ప్లానేనని, ఏదో విధంగా నానికి విసుగుపుట్టించి ఆయనే వెళ్లిపోయేట్టు చేయాలని ప్లాన్ వేశారని చర్చ జరుగుతోంది. టీడీపీ, జనసేన పొత్తు కుదిరితే విజయవాడలో గెలవడం సులభమేనని లెక్కలేసుకుని అప్పుడు నానితో పని ఉండదని చిన్నీని ప్రోత్సహించవచ్చని చంద్రబాబు డిసైడైనట్లు చెబుతున్నారు. ఇక బుద్దా వెంకన్న, బోండా ఉమ లాంటి నేతలతో చిన్నీ నిత్యం టచ్ లో ఉంటున్నారు. చూడాలి ఏం జరుగుతోంది…

 

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి …..