పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరగబోతున్నాయి. ఓ సారి అదే తేదీల్లో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతాయని … లేదు మినీ జమిలి ఎన్నికల కోసం వాయిదాలు వేస్తారన్న ప్రచారం ఉధృతంగా సాగింది. కానీ అలాంటి ఆలోచనే లేదని పార్లమెంట్లో కేంద్రం ఇచ్చిన సమాధానంతో క్లారిటీ ఇచ్చినట్లయింది. ఐదు రాష్ట్రాల ఎన్నికలు యధావిధిగా జరగబోతున్నాయి. అంటే ఇవి సెమీ ఫైనల్స్. ఇందులో బీజేపీ, కాంగ్రెస్ ముఖాముఖి తలపడుతున్నాయి . అందుకే వీటి ఫలితాలపై ఎక్కువ ఆసక్తి ఉంది. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే.. ఆ పార్టీ నాయకత్వంలో ఇండియా బలమైన ప్రత్యర్థిగా ఎన్డీఏ ముందు నిలబడుతుంది. ఫలితాలు తేడా వస్తే మోదీ మరోసారి బాహుబలిలా రంగంలోకి దిగుతారు.
పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఐదురాష్ట్రాల ఎన్నికలు జనం నాడి పట్టిచ్చేవే. కర్ణాటక ఎన్నికల ఫలితాల ప్రభావం ఎంత ఎక్కువగా ఉందో కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది. అందుకే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఫలితాలు ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికలపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. అందుకే వాటిని సెమీ ఫైనల్స్‌గా చెప్పవచ్చు. తెలంగాణ, మధ్య ప్రదేశ్, రాజస్థాన్, ఛత్తిస్ గఢ్ , మిజోరం శాసన సభలకు డిసెంబర్లో ఎన్నికలు జరగనున్నాయి. మిజోరం సంగతి పక్కన పెడితే.. మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో ముక్కోణపు పోటీ ఉంది, మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్, బీజేపీ హోరాహోరీగా పోరాడుతున్నాయి.
పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలంటే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెరుగైన ఫలితాలను సాధించాల్సి ఉంటుంది. కనీసం గట్టి పోటీ ఇవ్వగలం అన్న పరిస్థితి రావాలన్నా.. కూటమి చెల్లాచెదురు కాకుండా నిలబెట్టుకోవాలన్నా… కాంగ్రెస్ ప్రదర్శన చాలా ముఖ్యం. ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో చత్తీస్ ఘడ్, రాజస్థాన్‌లలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఈ రాష్ట్రాలలో అధికారం నిలబెట్టుకోవడం కోసం కాంగ్రెస్ సకల ప్రయత్నాలు చేస్తోంది. కాంగ్రెస్‌ను గద్దె దించి అధికారం సంపాదించడానికి బీజేపీ కూడా అనేక మార్గాలు అన్వేషిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి, బీజేపీకి ప్రధాన వ్యూహకర్త అమిత్ షా అప్పుడే ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. మధ్యప్రదేశ్‌లో బీజేపీ, తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నాయి. బి.ఆర్.ఎస్. తెలంగాణలో తిరుగులేదని చెప్పుకున్నారు కానీ ఇటీవలి కాలంలో కాంగ్రెస్ పుంజుకుంటున్నంద ప్రచారం ఎక్కువగా జరుగుతోంది. ఈ ట్రెండ్ కొనసాగితే అధికారంలోకి వచ్చినా ఆశ్చర్యం లేదని పోల్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లో మళ్లీ అధికారంలోకి రావడం కాంగ్రెస్‌కు చాలా ముఖ్యం. కాంగ్రెస్గెలిస్తే ప్రతిపక్షకూటమిలో నూతనోత్సాహం నింపుతుంది. మధ్యప్రదేశ్‌లో గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీనే విజయం సాధించింది. కానీ మధ్యలో జ్యోతిరాదిత్య సింధియా పార్టీ ఫిరాయించడంతో ప్రభుత్వం కుప్పకూలింది. శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటయింది. అయితే ఇది కాంగ్రెస్ కు మంచే చేసినట్లుగా నివేదికలు వెల్లడవుతున్నాయి. బీజేపీ సర్కార్ పై తీవ్ర వ్యతిరేకత ఉందన్న ప్రచారం జరుగుతోంది. అచ్చంగా కర్ణాటకలో తరహా పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ కూడా వ్యూహాత్మకంగా గిరిజనులు, దళితులు, మహిళల మీద దృష్టి కేంద్రీకరిస్తోంది. సామాజిక న్యాయం అన్నభావన మళ్లీ రంగంమీదికివస్తోంది. కాంగ్రెస్ అధికారం లోకి వస్తే కులాల ప్రాతిపదికన జనగణన ఉంటుందని కాంగ్రెస్ నాయకుడు కమల్‌నాథ్ హామీ ఇస్తున్నారు. కర్ణాటక తరహా గ్యారంటీ హామీల్ని తెరపైకి తెస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్ లో అధికారం నిలబెట్టు కోవడానికి కాంగ్రెస్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తీవ్రంగా శ్రమిస్తున్నారు.. కానీ రాజస్థాన్ లో రెండో సారి మరో ప్రభుత్వానికి అధికారం ఇచ్చే అలవాటు అక్కడి ప్రజలకు లేదు. అలా అధికారం నిలబెట్టుకుంటే కాంగ్రెస్ చరిత్ర సృష్టించినట్లే. . చత్తీస్ ఘడ్లో కాంగ్రెస్ పార్టీ మెరుగైన పరిస్థితులో ఉందని రిపోర్టులు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యమంత్రి భూపేష్ బాఘెల్ పరిపాలన పరంగా ప్రజల్ని ఆకట్టుకున్నారని అంటున్నారు. బీజేపీకి నాయకత్వ సమస్య ఉండటం కూడా కాంగ్రెస్‌కు కలసి వస్తోంది.
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ హవా ఉంటే తర్వాత ఏం జరుగుతుంది ? బీజేపీ తన మేనియా తగ్గలేదని నిరూపించుకుంటే ఏం జరుగుతుంది ?
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా రేసులో ఉంది. నాలుగింటిలోనూ గెలుపు చాన్సులు ఉన్నాయి. కావాల్సింది ప్రజలు కాంగ్రెస్ ను కోరుకుంటున్నారా లేదా అన్నదానిపై స్పష్టత రావడమే. అది ఎన్నికల్లో వస్తుంది. ఈశాన్య రాష్ట్రం మినహా నాలుగు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తే దేశం మొత్తం రాజకీయ వాతావరణం ఒక్క సారిగా మారిపోతుంది. కర్ణాటక ఎన్నికల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఎంత పాజిటివ్ వచ్చిందో.. దేశం మొత్తం కాంగ్రెస్ పార్టీకి అంత క్రేజ్ వస్తుంది. మళ్లీ దేశానికి కాంగ్రెస్ అవసరం అన్న చర్చలు ప్రారంభమవుతాయి. పదేళ్ల మోదీ పాలన వైఫల్యాలు … హైలెట్ అవుతాయి. అవినీతి పరులకు అండగా ఉండి బీజేపీలో చేర్చుకున్న విషయాలు ఊహించనంతగా ప్రచారంలోకి వస్తాయి. బీజేపీ కంటే కాంగ్రెస్ పాలన మెరుగన్న అభిప్రాయానికి జనం రావడానికి ఎక్కువగా ఉంటుంది. అదే జరిగితే చేరికలూ ఆటోమేటిక్ గా పెరుగుతాయి. రాజకీయాల్లో ఇలాంటి ఊరు వచ్చిందంటే.. తిరుగులేని విజయం లభిస్తుంది. ఇంకా ముఖ్యంగా ఇండియా కూటమి బలోపేతం అవుతుంది. గెలుపు వాసన వస్తే కొత్త పార్టీలు వచ్చి చేరడమే కాదు.. ఉన్న పార్టీలు కాంగ్రెస్ నేతృత్వంలో పని చేయడానికి మరింతగా ఆసక్తి చూపిస్తాయి. ఎలాంటి అసంతృప్తి మాటలు వినిపించవు.
అదే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి.. బీజేపీ కనీసం మూడు రాష్ట్రాల్లో అధికారం దక్కించుకుంటే మాత్రం… మోదీ బాహుబలి ఇమేజ్ మరింత పెరుగుతుందనడంలో సందేహం లేదు. కర్ణాటక ఎన్నికల తర్వాత ఆయన గెలిపించలేరన్న ప్రచారం జరిగుతోంది. దాన్ని తుడిచేసుకుంటారు. దేశ ప్రజల్లో మోదీ పై అభిమానం ఏ మాత్రం తగ్గలేదని బీజేపీ ప్రచారం చేసుకుంటుంది. అదే సమయంలో కాంగ్రెస్ పై… రాహుల్ గాంధీపై ఎలాంటి అభిమానం ప్రజల్లో పెరగలేదని.. వారిపై ఇంకా నమ్మకం పెంచుకోలేదని ప్రచారం చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. అదే సమయంలో ఇండియా కూటమిలో లుకలుకలు వస్తాయి. ఇప్పుడు ఇండియా కూటమిలో ఉన్న పార్టీలు కొన్ని జారిపోయే ప్రమాదం కూడా ఉంది. కాంగ్రెస్ నాయకత్వానికి అంగీకరించేవారు తగ్గిపోతారు. ఈ పరిస్థితిని ప్రధాని మోదీ, అమిత్ షా ఎలా ఉపయోగించుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
డిసెంబర్ లోజరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలు అసలైన సెమీ ఫైనల్స్ గా చెప్పవచ్చు. కాంగ్రెస్ , బీజేపీ ముఖాముఖి తలపడనుండటంతో ఈ ఎన్నికలకు మరింత ప్రాధాన్యం లభిస్తోంది. హిందీ బెల్ట్ లో పార్లమెంట్ ఎన్నికల మూడ్ ను ఈ ఫలితాలు ఖచ్చితంగా మారుస్తాయి. అందుకే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో గెలిచిన వారికే… ఫైనల్స్‌లో అడ్వాంటేజ్ ఉంటుంది.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి .