2024 లో బిజెపి ని కేంద్రంలో అధికారంలోకి రానివ్వకుండా నిలువరించడమే లక్ష్యంగా కూటమి కట్టిన విపక్షాలు అంత ఐక్యంగా ఉన్నట్లు కనపడ్డం లేదు. కీలక నేతలు తలోదారీ పడుతున్నట్లు కనపడుతోంది. కొందరు సీనియర్ నేతలను ఎన్డీయే వైపు ఆకర్షించేందుకు బిజెపి నాయకత్వం ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగిస్తోంది. బాహాటంగానే ఫలానా నేతలు తమతో కలుస్తున్నారని..వారు తమ మనుషులేనని కాషాయ నేతలు ప్రకటిస్తున్నారు. ఇది విపక్ష కూటమిలోనే కాకుండా దానికి మద్దతు నిచ్చే వారిలో గందరగోళం సృష్టిస్తోంది.
పూణేలో తిలక్ స్మార్ మందిర్ ట్రస్ట్ కార్యక్రమానికి మోదీ, పవార్ హాజరయ్యారు. లోకమాన్య తిలక్ జాతీయ పురుస్కారాన్ని ప్రధాని స్వీకరించారు. ఇది ఎంత మాత్రం రాజకీయ కార్యక్రమం కాదు. అయినా…వీరిద్దరి కలయిక ఎందుకు చర్చనీయాంశంగా మారిందంటే…మళ్లీ ఒక సారి ఇండియా కూటమి వైపు చూడాలి. ఆగస్ట్ నెల 25, 26 తేదీల్లో మూడో సారి భేటీ కావాలని కూటమి నిర్ణయించింది. వేదిక ముంబై. ఆతిధ్యం ఇవ్వాల్సింది శరద్ పవారే. ఆయన కూడా అందుకు సై అన్నారు. కానీ అదే శరద్ పవార్ ఇప్పుడు ఆగస్ట్ నెల మధ్య నుంచి… మహారాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నిర్వహించే ర్యాలీల్లో పాల్గొనబోతున్నారు. ఇండియా కూటమి మూడో భేటీకి డేట్ ఫిక్స్ అయిన తర్వాత…శరద్ పవార్ మరో ప్రోగ్రాం ఫిక్స్ చేసుకోవడం వెనుక రీజన్ ఏంటన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఇండియా కూటమి ముంబై భేటీ సమయంలోనే…శరద్ పవార్ మరో కార్యక్రమాన్ని ఎంచుకున్నంత మాత్రాన ఏదో జరిగిపోతుంది అనడానికి వీల్లేదు. అయితే ఎన్సీపీ ని చీల్చి శరద్ పవార్‌కి షాక్ ఇచ్చిన ఆయన మేనల్లుడు అజిత్ పవార్… రెబల్స్ ఎమ్మెల్యేలతో కలిసి రెండు రోజుల్లో రెండు సార్లు శరద్‌పవార్‌ని కలిశారు. పార్టీని చీలిపోకుండా చూడాలని కోరారు. అంటే…మహారాష్ట్రలోని బీజేపీ కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వమని కోరడమే. ఈ భేటీల తర్వాత బెంగళూరులో జరిగిన ఇండియా కూటమి రెండో భేటీకి శరద్ పవార్ హాజరయ్యారు. బీజేపీ పై పోరులో వెనక్కు తగ్గేది లేదన్నారు. కానీ ఇండియా కూటమి మూడో భేటీకి ఆయనే అందుబాటులో లేని పరిస్థితి ఏర్పడింది. దీంతో…రాజకీయంగా రకరకాల ఊహాగానాలకు తెర లేచింది.
ఇండియా కూటమి ఏర్పడి ఎన్నో రోజులు కాలేదు. కానీ…తొలి రోజు నుంచి ఒక అడుగు ముందుకు. రెండు అడుగులు వెనక్కు అన్నట్టుగా పరిస్థితి తయారైంది. కేవలం శరద్ పవార్ ఎపిసోడ్ మాత్రమే కాదు. కూటమిలోని కీలకమైన నేతల వ్యవహారశైలి…అసలు కూటమిలో ఐక్యమత్యం ఎంత అనే ప్రశ్నని పెంచి పోషిస్తున్నాయి. అటు చూస్తే సార్వత్రిక ఎన్నికలకు ఎంతో సమయం లేదు. వ్యూహాలు, ఎత్తులు, పై ఎత్తులు సంగతి తర్వాత. ముందు తమ కేంద్రంగా ప్రజా క్షేత్రంలో ఒక పాజిటివ్ వైబ్రేషన్ క్రియేట్ చేయడం కూటమిలోని పార్టీలకు అత్యంత కీలకం. ఆ దిశగా ఇప్పటి వరకు ఇండియా కూటమి ఏం చేసిందన్న ప్రశ్నకి సమాధానం లేదు.
ఇండియా నేషనల్ డెవలప్మెంట్ ఇంక్లూజివ్ అలియన్స్. క్లుప్తంగా ఇండియా. తమ కూటమికి ఒక పేరు పెట్టే క్రమంలో అందరి దృష్టిని ఆకర్షించడంలో విపక్ష పార్టీలు విజయం సాధించాయి. నిజానికి యూపీఏకి, ఇండియా కూటమికి పెద్ద తేడా ఏం లేదు. అందులో ఉన్న మెజార్టీ పార్టీలే ఇందులోనూ ఉన్నాయి. కానీ…ఒక అటెన్షన్ క్రియేట్ చేయడంలో మాత్రం కొత్త పేరు ఉపయోగపడింది. తమ కేంద్రంగా ఒక వైబ్రేషన్ క్రియేట్ చేయడంలో సక్సెస్ అయిన ప్రతిపక్ష పార్టీలు…ఆ జోష్ని కొనసాగించడంలో మాత్రం కిందా మీదా పడుతున్నాయి. అదే సమయంలో కూటమిలోని మిగిలిన పార్టీల కేంద్రంగా లుకలుకలు బయటపడుతూనే ఉన్నాయి.
మమతా బెనర్జీ. పక్కా ఫైర్ బ్రాండ్. కానీ…ఆ ఫైర్ సొంత కూటమికే సెగలు పుట్టిస్తే ? నితీష్ కుమార్ రాజకీయ వ్యూహాలు పన్నడంలో నేర్పరి. కానీ…ఆ వ్యూహాలు అయిన వాళ్లలోనే ఆందోళన పెంచేస్తే ? ఇండియా కూటమిలో జరుగుతోన్న పరిణా మాలను కాస్త శ్రద్ధగా గమనిస్తే…ఇలాంటి ప్రశ్నలే పుట్టుకొస్తాయి అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఎన్నో ట్రబుల్స్‌ని ఫేస్ చేసిన నేతలు, ఎన్నో సార్లు ట్రబుల్ షూటర్స్‌గా సత్తా చాటిన నేతలు…ఇప్పుడు నాకేంటి అన్న ధోరణితో సొంత కూటమికే ట్రబుల్స్ క్రియేట్ చేస్తున్నారా ?
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి …..