మ‌రో కొత్త జ‌న‌ర‌ల్‌..ర‌ష్యా ప‌రువు నిల‌బ‌డేనా?

By KTV Telugu On 10 October, 2022
image

జ‌న‌ర‌ల్స్ కాదు.. పుతిన్ మైండ్‌సెట్ మారాలి!

బ‌ల‌వంత‌మైన స‌ర్పం చ‌లిచీమ‌ల చేతికి చిక్కిన‌ట్లే ఉంది ఉక్రెయిన్ యుద్ధ‌రంగంలో ర‌ష్యా ప‌రిస్థితి. వారం ప‌దిరోజుల్లో మ్యాట‌ర్ క్లోజ్ అనుకుని ఎంట‌రైంది ర‌ష్యా. కానీ నెల‌లు గ‌డుస్తున్నాయేగానీ యుద్దానికి తెర‌ప‌డలేదు. పైగా పిల్లి పులిమీద తిర‌గ‌బ‌డ్డ‌ట్లు ర‌ష్యాకి వ‌ర‌స‌గా ఎదురుదెబ్బ‌లు త‌గులుతున్నాయి. అణుబాంబు వేద్దామ‌నేంత ఉక్రోషంతో ర‌గిలిపోతున్నారు పుతిన్‌. మ‌రోవైపు యుద్ధ‌క్షేత్రంలో వ్యూహాల‌ను మార్చాల‌నుకుంటున్నారు. జనరల్‌ సెర్గీ సురోవికిన్‌ని ప్రత్యేక మిలిటరీ ఆపరేషన్ ప్రాంతాల్లో జాయింట్ గ్రూపింగ్ ఆఫ్ ఫోర్సెస్ కమాండర్‌గా నియమించారు.
సురోవికిన్‌కు తజికిస్థాన్, చెచెన్యా, సిరియాలో పోరాట అనుభవం ఉంది. ఉక్రెయిన్‌లో పుతిన్‌ సేనలకు ఊహించినదానికంటే గ‌ట్టి ప్రతిఘటన ఎదురవుతోంది. ఉక్రెయిన్‌ దళాలు మెరుపు దాడులతో విరుచుకుపడుతున్నాయి. ఖార్కివ్‌ రీజియన్‌తోపాటు కీలకమైన లేమన్ సిటీని, దక్షిణ ఖేర్సన్‌ ప్రాంతాలను రష్యా నుంచి ఉక్రెయిన్ ద‌ళాలు మళ్లీ స్వాధీనం చేసుకున్నాయి. దీంతో ఉక్రెయిన్ యుద్ధ‌క్షేత్రంలో త‌న సైనిక వైఫల్యాలపై పుతిన్ చిందులు తొక్కుతున్నారు. రక్షణశాఖ డిప్యూటీ మంత్రి జనరల్‌ దిమిత్రి బుల్గకోవ్‌మీద వేటేశారు. ఇప్పుడు కొత్త జ‌న‌ర‌ల్‌ని తెర‌పైకి తెచ్చారు.
క్రిమియా ద్వీపకల్పాన్ని రష్యా భూభాగంతో అనుసంధానించే కీల‌క‌మైన వంతెన‌ని పేల్చేయ‌టంతో ర‌ష్యాకి గ‌ట్టి దెబ్బ‌తగిలింది. ఎన్నో త‌నిఖీల‌ను దాటుకుని పేలుడు పదార్థాల‌ ట్రక్కు ఐరోపాలోనే అతి పొడవైన వంతెనపైకి ఎలా వెళ్లిందో పుతిన్ ఇంట‌లిజెన్స్‌కి అంతుప‌ట్ట‌టంలేదు. క్రిమియా ప్రజలకు నిత్యావసరాలు, ఉక్రెయిన్‌తో యుద్ధం చేస్తున్న రష్యా బలగాలకు ఆయుధాలను చేరవేయడంలో 19 కిలోమీట‌ర్ల పొడ‌వైన కెర్చ్‌ వంతెన ఎంతో కీల‌కం. అలాంటి వంతెన‌నే పేల్చేయ‌టంతో ర‌ష్యాది బ‌లుపుకాదు వాప‌నే విష‌యం ప్ర‌పంచానికి తెలిసిపోతోంది.