కంసవధకు సిద్ధమైన అభినవ శ్రీకృష్ణుడు!
కేజ్రీవాల్ ఎవరు? ఆమ్ ఆద్మీపార్టీ కన్వీనర్. ఢిల్లీ ముఖ్యమంత్రి. అంతేనా.. ఇప్పుడు తలపండిన రాజకీయనాయకుడు. ఎక్కడ ఏది కావాలో ఒంటబట్టించుకున్న అసలు సిసలు పొలిటికల్ లీడర్. చెయ్యెత్తితే చెంపదెబ్బ కొట్టించుకోవడానికి, బాటిల్ మూతతీస్తే ఇంకు చల్లించుకోవడానికి పాత కేజ్రీవాల్ కానే కాదు. తను ముదిరిపోయాడు. రాజకీయంగా బాగా ముదిరిపోయాడు. ఇప్పుడాయన ఎవరో తెలుసా.. శ్రీకృష్ణ పరమాత్ముడు. కంసుడి వారసులను కడతేర్చేందుకు పుట్టిన కారణజన్ముడు.
గుజరాత్లో టోపీ పెట్టిన కేజ్రీవాల్‌ని ముస్లింల ప్రతినిధిలా చిత్రీకరించే ప్రయత్నం చేసింది బీజేపీ. కానీ కేజ్రీవాల్ సెంటిమెంట్‌తో కొడుతున్నాడు. గుజరాత్లో ఎలాగైతే ఎక్కుతుందో పక్కాగా అదే చేస్తున్నాడు. ఆయన పుట్టిందెప్పుడో తెలుసా.. శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున! ఈ పాయింట్ కూడా కేజ్రీవాల్‌కి ఎన్నికల ప్రచారంలో ప్రధానాస్త్రంగా మారింది. రాష్ట్రంలో అవినీతి, గూండాగిరీ అంతమయ్యేందుకు కంసుడి వారసులను తుదముట్టించే ప్రత్యేక పనిని ఆ దేవుడు కేజ్రీవాల్‌కి అప్పగించాడట! దేవుడి కోరిక తీర్చేందుకు కలిసి పనిచేద్దామని బీజేపీని మించిన భావోద్వేగాలు రగిలిస్తున్నారు.
కేజ్రీవాల్‌ని హిందూ వ్యతిరేకిగా చిత్రీకరిస్తూ గుజరాత్‌లోని పలు నగరాల్లో గో బ్యాక్ పోస్టర్లు వెలిశాయి. వాటి వెనుక ఉన్నదెవరో ఓపెన్ సీక్రెట్. అందుకే బీజేపీ స్పాన్సర్డ్ పోస్టర్లకు పవర్ఫుల్ కౌంటర్లిస్తున్నారు కేజ్రీవాల్. దేవుడిని అవమానించినవారిని గుజరాత్ ప్రజలు క్షమించబోరంటున్నారు. గుజరాత్లో ఆప్ అధికారంలోకి వస్తే ఢిల్లీలో మాదిరిగా భక్తుల అయోధ్య పర్యటన ఖర్చులన్నీ భరిస్తామని హామీఇస్తున్నారు. అంతేనా.. మరో అడుగుముందుకేసి ర్యాలీలో జై శ్రీరామ్ నినాదాలు ఇచ్చారు. తమ పేటెంట్గా భావించే నినాదం కేజ్రీవాల్ నోటెంట రావటంతో బీజేపీ నేతలు ఉడుక్కుంటున్నారు.
ఐఆర్ఎస్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు అంత సీన్లేదని లైట్ తీసుకున్నారు. ఢిల్లీలో చీపురుకట్ట తిరగేసినప్పుడు ప్రత్యర్థులు ఉలిక్కిపడ్డారు. పంజాబ్‌లో ఆప్ విజయంతో బయటికి లెక్చరర్లా కనిపించే ఠాగూర్ అని అందరికీ అర్ధమైపోయింది. అందుకే గుజరాత్లో ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్‌ని బీజేపీ తేలిగ్గా తీసుకోవడం లేదు. ఎక్కడికక్కడ చెక్ పెడుతోంది. సేమ్‌టైమ్ కేజ్రీవాల్ కూడా నేనూ నాలుగాకులు ఎక్కువే చదివానంటూ ముల్లును ముల్లుతోనే తీస్తున్నారు. కటౌట్ చూసి అండరెస్టిమేట్ చేయొద్దని సంకేతాలిస్తున్నాడు. ఆర్నెల్లసావాసంతో వాళ్లు వీళ్లవుతారన్నట్లు ఇన్నేళ్ల ఢిల్లీ రాజకీయంతో ఆ మాత్రం తెలివితేటలు ఒంటబట్టకుండా ఉంటాయా మరి!