ఎన్నికలకు సిద్ధమవుతోన్న తెలంగాణా రాష్ట్రంలో చేరికల రుతువు నడుస్తోంది. నచ్చిన పార్టీలోకి నేతలు అమాంతం జంప్ చేస్తున్నారు. ఎవరు ఏ పార్టీలో చేరినా ప్రజాసేవకోసమే పార్టీలు మారుతున్నామని చెప్పుకుంటున్నారు. పేదల అభ్యున్నతే తమ అజెండా అని అంటున్నారు. కాంగ్రెస్, బిజెపి, బిఆర్ఎస్ పార్టీలు మూడూ కూడా వచ్చిన నేతలకు రెడ్ కార్పెట్ పరిచి మరీ స్వాగతిస్తున్నాయి.
భారత రాష్ట్ర సమితి కి గుడ్ బై చెప్పిన పాలమూరు సీనియర్ నేత మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు తో పాటు అదే జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే గుర్నాథ రెడ్డి హస్తిన వెళ్లారు. వాళ్లు వెళ్లింది ఢిల్లీలో సైట్ సీయింగ్ కోసం కాదు. బి.ఆర్.ఎస్. ను వదిలేశారు కాబట్టి ఎన్నికల లోపు ఏదో ఒక పార్టీలో చేరాలి కాబట్టి…తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీలో కాస్త జోష్ ఉంది కాబట్టి..హస్తం పార్టీలో చేరడానికి ఈ నేతలు ఢిల్లీ వెళ్లారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో జూపల్లి కృష్ణారావు, గుర్నాథ రెడ్డి కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు
నిజానికి జూపల్లి కృష్ణారావు కొద్ది వారాల క్రితమే కాంగ్రెస్ లో చేరాల్సి ఉండింది. బి.ఆర్.ఎస్. కు రాజీనామా చేసినపుడు ఖమ్మం జిల్లాకు చెందిన పొంగులేటి శ్రీనివాస రెడ్డితో పాటు బయటకు వచ్చిన జూపల్లి కృష్ణారావు ఆయనతో పాటే కాంగ్రెస్ లో చేరతారని ముందుగా ప్రచారం జరిగింది. ఖమ్మంలో జరిగిన బహిరంగ సభలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ పార్టీ విజయం కోసం కృషి చేస్తానన్న పొంగులేటి బి.ఆర్.ఎస్. ను ఇంటికి సాగనంపడమే తన లక్ష్యమన్నారు.
మహబూబ్ నగర్ లో నిర్వహించాల్సి ఉన్న బహిరంగ సభ రెండు సార్లు వర్షాల కారణంగా వాయిదాలు పడింది. మహబూబ్ నగర్ బహిరంగ సభకు ప్రియాంక గాంధీ వస్తారని..ఆమె సమక్షంలోనే జూపల్లి కృష్ణారావు, గుర్నాథ రెడ్డితో పాటు మరి కొందరు నేతలు కాంగ్రెస్ లో చేరతారని ప్రచారం జరిగింది. అయితే ఆ సభ వాయిదాలు పడ్డంతో జూపల్లి, గుర్నాథ రెడ్డిలను ఢిల్లీకి పిలిపించుకుంది కాంగ్రెస్ అధిష్ఠానం. మల్లికార్జున ఖర్గే ఈ నేతలకు కాంగ్రెస్ కండువాలు కప్పారు. తెలంగాణాలో కేసీయార్ సారధ్యంలో దుర్మార్గ పాలన నడుస్తోందని నిప్పులు చెరిగిన జూపల్లి కృష్ణారావు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తామని ప్రతిజ్ఞ చేశారు.
కాంగ్రెస్ పార్టీలోకి మరి కొందరు కీలక నేతలు రానున్న రోజుల్లో చేరతారని ప్రచారం జరుగుతోంది. ఇక ఇదే సమయంలో భారతీయ జనతా పార్టీకూడా చేరికల కోసం తలుపులు తెరచి పెట్టింది. కొద్ది రోజులుగా సినీ నటి మాజీ ఎమ్మెల్యే జయసుధని పార్టీలో చేర్చుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. దేశ రాజధానిలో తెలంగాణా రాష్ట్ర బిజెపి వ్యవహారాల ఇన్ ఛార్జ్ తరుణ్ చుగ్, తెలంగాణా బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డిల సమక్షంలో జయసుధ బిజెపిలో చేరిపోయారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ తరపున సికింద్రాబాద్ నియోజక వర్గం నుంచి పోటీ చేసి గెలిచిన జయసుధ చాలా కాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు.
ఇతర పార్టీల నేతలు కాంగ్రెస్ వైపు చూస్తోంటే..కొందరు కాంగ్రెస్ నేతలు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. బి.ఆర్.ఎస్.అధినేత కేసీయార్ సొంత జిల్లా అయిన ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నేత సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి బి.ఆర్.ఎస్. లో చేరతారని ప్రచారం జరుగుతోంది.తాజాగా తెలంగాణా అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అసెంబ్లీలోని కేటీయార్ ఛాంబర్ కు తూర్పు జయప్రకాష్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి వెళ్లారు. తన నియోజక వర్గ సమస్యలకు సంబంధించిన విజ్ఞాపన పత్రాలు మంత్రి కేటీయార్ కు ఇవ్వడానికి వెళ్లినట్లు చెప్పారు. అయితే ఈ సందర్భంగానే జగ్గారెడ్డిని బి.ఆర్.ఎస్. లోకి తీసుకు వస్తామంలో ఓ నేత కేటీయార్ కు చెప్పడం చర్చనీయాంశమైంది.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి …..