కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల తెలంగాణకు అప్పల భారం తప్ప .. ఏ విధమైన ఉపయోగం లేదన్న వాదన రోజు రోజుకు బలపడుతోంది. ఎత్తి పోస్తున్న నీరు కంటే… మళ్లీ దిగువకు వదిలేస్తున్న నీరే ఎక్కువగా ఉందని రికార్డులు చెబుతున్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం ఎక్కడ ఏ ప్రాజెక్టులో నీళ్లున్నా కాళేశ్వరంకే క్రెడిట్ ఇస్తోంది. కాళేశ్వరం నీళ్లు వచ్చాయని చెబుతోంది. కానీ నిజం మాత్రం కాళేశ్వరం లేకపోయినా ఆ నీళ్లు వచ్చేవే. కరెంట్ ఖర్చు పెట్టుకుని ఎత్తి పోసుకున్న నీటిని వరదలు రాగానే కిందకు వదిలేస్తున్నారు. ఈ కారణంగానే కాళేశ్వరం గుదిబండ అనే వాదన ఎక్కువగా వినిపిస్తోంది.
తెలంగాణ ప్రజలపై దాదాపుగా లక్ష కోట్ల భారం మోపిన అతి పెద్ద ప్రాజెక్ట్ కాళేశ్వరం. దీని వల్ల ఎంత లాభం అనేదానిపై నిపుణులు చాలా కాలంగా అనేక సందేహాలు వ్యక్తం చేస్తూనే వస్తున్నారు. గోదావరికి వచ్చిన వరదలతో మరోసారి అదే వాదన వినిపిస్తోంది. వరద పోటెత్తుతున్నప్పుడు గోదావరి నీటిని ఎత్తి పోయడానికి బదులుగా ఎత్తి పోసిన నీటిని కిందికి వదిలేస్తున్నారు! వరద పోటెత్తుతున్న సమయంలో నీటిని ఎత్తునకు ఎత్తి పోస్తూ బిజీ బిజీగా ఉండాల్సిన బాహుబలి మోటార్లన్నీ సైలెంట్ గా ఉంటున్నాయి. వరదల సమయంలో కింది నుంచి పైకి రావాల్సిన నీరు.. పైనుంచి కిందికి వెళ్లిపోతోంది. ఈ ప్రాజెక్టు వల్ల ఒక్క ఎకరాకు నీరిచ్చనట్లుగా నిరూపిoచాలన్న సవాళ్లు ఈ కారణంగానే ఇతర పార్టీల నుంచి వస్తున్నాయి.
కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయిందని తెలంగాణ ప్రకటించి దాదాపుగా ఐదేళ్లు అవుతోంది. ఐదేళ్లలో ప్రభుత్వం చెప్పినట్లు కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి దాదాపు వెయ్యి టీఎంసీలను ఎత్తి పోసి .. వాటిని రిజర్వాయర్లలో నింపి ఉండాలి. గోదావరికి వరద పోటెత్తుతున్న ప్రస్తుత సమయంలో కూడా కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి రోజుకు 2 టీఎంసీలను ఎత్తి పోస్తూ.. రిజర్వాయర్లను నింపుతూ ఉండాలి. కానీ మోటార్లను ఆన్ చేయడం లేదు. ఎందుకంటే వరద వల్ల పై నుంచి ఉద్ధృతంగా వస్తున్న నీటిని సముద్రంలోకి వదిలి వేయాల్సి వస్తోంది. అంటే ఎత్తిపోసుకున్న నీరు కూడా కిందకు వెళ్లిపోతోంది. తెలంగాణలోనే ఎత్తయిన ప్రదేశానికి నీటిని ఎత్తి పోస్తారు కనక ముఖ్యమంత్రి కేసీఆర్ డిజైన్‌కు ‘రివర్స్ ఇంజనీరింగ్’గా పేరు పెట్టారు. ఎత్తి పోయాల్సిన సమయంలో కిందికి వదిలేయడం ద్వారా.. ఎత్తి పోసిన నీటిని మళ్లీ గోదావరిలోకే తరలించడం ద్వారా ఇప్పుడు ఇది నిజంగానే ‘రివర్స్’ ఇంజనీరింగ్‌గా పేరు తెచ్చుకుంటోంది.
ఇప్పటి వరకూ ఈ ప్రాజెక్టు వల్ల మెదక్ జిల్లాలోని రంగనాయక్ సాగర్, కొండ పోచమ్మ సాగర్, మల్లన్న సాగర్‌లలో 25 టీఎంసీల వరకూ నిల్వ చేయడం.. ఐదేళ్లలో దాదాపు వెయ్యి టీఎంసీలను ఎత్తి పోయాల్సిన కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పటి వరకూ కేవలం 168 టీఎంసీలు మాత్రమే ఎత్తిపోసింది. ఇందులో మళ్లీ దాదాపు 118 టీఎంసీలను తిరిగి గోదావరిలోకే వదిలేశారు. మిగిలిన 50 టీఎంసీల్లో సగం రిజర్వాయర్లలో ఉంటే సగం సాగుకు వినియోగించారు. ఇటీవల శ్రీరాం సాగర్ పునరుజ్జీవన పథకంలో భాగంగా 2.5 టీఎంసీలను మేడిగడ్డ బ్యారేజీ నుంచి ఎత్తిపోశారు. ఎగువ నుంచి వరద పోటెత్తడంతో ఆ నీటిని కూడా ఇప్పుడు గోదావరిలోకి వదిలేశారు. , జూన్ 21వ తేదీ నుంచి కాళేశ్వరం నుంచి పంపింగ్ ప్రారంభమైంది. రోజుకు అర టీఎంసీ చొప్పున దాదాపు ఏడు టీఎంసీలను ఎత్తి పోశారు. కానీ వరదలతో ఆ నీటిని కూడా దిగువకు వదిలేయాల్సి వచ్చింది.
కాళేశ్వరం ఎత్తిపోతల పథకం చరిత్రలోనే అతి పెద్ద ఇంజనీరింగ్ తప్పిదమని జలవనరుల రంగంలో పేరు మోసిన వారెందరో చెప్పారు. ఇది ఎత్తిపోతల కాదు.. తిప్పిపోతల పథకమని విమర్శలు వస్తున్నాయి. కాళేశ్వరం డీపీఆర్ లో మేడిగడ్డ వద్ద 415 టీఎంసీల లభ్యత ఉందని పేర్కొన్నారు. నీటి లభ్యతను లెక్కించడంలో భాగంంగా ప్రాణహిత, మధ్య గోదావరి, మానేరు నదుల నుంచి వచ్చే నీటిని పరిగణనలోకి తీసుకున్నారు. మధ్య గోదావరి నుంచి వచ్చే నీరంతా ఎల్లంపల్లిని దాటి వచ్చే నీరే. ఆ నీటిని ఎల్లంపల్లి బ్యారేజీ వద్ద నుంచే పంపింగ్ చేసుకోవచ్చు. మానేరు నుంచి గోదావరిలోకి చేరే నీటిని మధ్య మానేరు రిజర్వాయర్ వద్దనే ఎత్తిపోసుకోవచ్చు. ప్రాణహిత నది గోదావరిలో కలసే మేడిగడ్డ వద్ద నీటి లభ్యత కేవలం 182 టీఎంసీలు మాత్రమే. రీ ఇంజనీరింగ్ పేరిట ఎక్కువ ఎత్తు నుంచి కిందికి ప్రవహించే నీటిని తిరిగి అదే ప్రాంతానికి ఎత్తిపోసే తప్పుడు అవగాహనతో ఈ ప్రాజెక్టును నిర్మించారని నిపుణులు వాదిస్తున్నారు. ప్రాజెక్టును మేడిగడ్డకు ప్రాజెక్టును మార్చడంతో ప్రయోజనాలేవీ ఉండవని, వేల కోట్ల అదనపు పెట్టుబడి వ్యయం, విద్యుత్, ఇతర నిర్వహణ వ్యయాన్ని వృథా చేయాల్సి ఉంటుందని ఆధారాలతో సహా నిరూపిస్తున్నారు.
అసలు కాళేశ్వరం నిరర్థక ప్రాజెక్ట్ అనే వాదన ఎక్కువ మంది మేధావుల నుంచి వస్తోంది. దానికి వారు చాలా స్పష్టమైన కారణాలు చెబుతున్నారు. అందులో ప్రధానమైనది ప్రాజెక్టు ఏ మాత్రం ఉపయోగం కానిది మాత్రమే కాదు. నిర్వహణ కూడా అత్యంత ఖర్చుతో కూడుకున్నది కావడమే. కాగ్ ఈ విషయాన్ని స్పష్టం చేసింది.
కాంగ్రెస్ హయాంలో రూ. 38 వేల కోట్ల ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టారు. కేసీఆర్ సీఎం అయిన తర్వాత రీ డిజైన్ చేశారు. తమ్మిడిహట్టి వద్ద నిర్మాణాన్ని పక్కన పెట్టి మేడిగడ్డ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారు. తమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణం చేపడితే గ్రావిటీ ద్వారా నీరు వచ్చేదని నిపుణులు చెబుతున్నారు. కాంగ్రెస్ హయాంలో చేపట్టిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును రంగారెడ్డి జిల్లాకు సైతం నీరు అందించేలా డిజైన్ చేశారు. కానీ రీ డిజైన్ వల్ల ఆ అవకాశం లేకుండా పోయింది. తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత లేదని, 152 మీటర్ల ఎత్తులో అక్కడ బ్యారేజీ నిర్మిస్తే మహారాష్ట్రలో ముంపు సమస్య ఉంటుందని, మేడిగడ్డ వద్ద ఏకంగా 415 టీఎంసీల లభ్యత ఉందని చూపిoచి ప్రాజెక్టును మేడిగడ్డకు మార్చిందనే ఆరోపణలు ఉన్నాయి. మహారాష్ట్రతో చేసుకున్న ఒప్పందంపై అందుకే విమర్శలు కూడా వచ్చాయి. మహారాష్ట్రతో ఒప్పందం మేరకు 148 మీటర్ల బ్యారేజీ నుంచి పూర్తి స్థాయిలో నీటిని ఎల్లంపల్లికి తరలించవచ్చంటున్నారు. కానీ తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ అభ్యంతరాలేమీ పట్టించుకోలేదు. ప్రాజెక్టుని నిర్మించారు.
కాళేశ్వరం ఎత్తిపోతల పథకం పూర్తిస్థాయిలో నడిస్తే విద్యుత్ బిల్లుల ఖర్చే ఏటా 11,359 కోట్లు ఖర్చు అవుతుందని కాగ్ ప్రకటించింది. బిల్లులు, రుణాల చెల్లింపులు కలిపి ఈ ఒక్క ప్రాజెక్టు కోసం ఏటా రూ.25,109 కోట్లు వ్యయం చేయాల్సి ఉంది. ప్రాజెక్టు వార్షిక నిర్వహణకు రూ.272 కోట్లు అవసరం. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో ఒక ఎకరం సాగుకు పెట్టుబడి వ్యయం 6 లక్షల 42 వేలు కానుందని కాగ్ తన నివేదికలో పేర్కొంది. ప్రాజెక్టు నిర్మాణంతో వివిధ రూపాల్లో ఆదాయం వస్తుందని ప్రభుత్వం చెప్పినప్పటికీ వాస్తవ పరిస్థితులు మరోలా ఉన్నాయని, ఆదాయం సమకూరడం లేదని కాగ్ తేల్చింది. పైగాఈ ప్రాజెక్ట్ కరెంట్ ఖర్చు చాలా ఎక్కువ. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో ఒక్క టీఎంసీ నీటిని ఎత్తిపోయాలంటే దూరాన్ని బట్టి వ్యయం పెరుగుతుంది. గత ఏడాది ఆగస్టు నాటికి కాళేశ్వరం ప్రాజెక్టు విద్యుత్ బకాయిలు 3 వేల 600 కోట్ల రూపాయలుగా తేలింది. ఈ ప్రాజెక్టు ద్వారా గత మూడేళ్లలో సుమారు 140 టీఎంసీల నీటిని ఎత్తిపోసి తరలించగా.. ఇందుకు గాను మొత్తం 3,600 కోట్ల కరెంట్ బిల్లు వచ్చింది. బిల్లులను ప్రభుత్వం సకాలంలో చెల్లించకపోవడంతో విద్యుత్ బకాయిలు అలానే పేరుకుపోతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో మొత్తం 20 లిఫ్టులు ఉండగా.. ఇప్పటివరకు కేవలం 8 లిఫ్టులు మాత్రమే ఉపయోగించారు. దీనికే మూడేళ్లలో 3 వేల 6 వందల కోట్ల కరెంట్ బిల్లు వచ్చింది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయిలో ఆపరేషన్ లోకి వస్తే… అన్ని మోటార్ల పని చేస్తే కరెంట్ బిల్లు ఎలా ఉంటుందో ఊహిస్తేనే కళ్లు బైర్లు కమ్మే పరిస్థితి నెలకొంది. గత ఏడాది వచ్చిన వర్షాలకు బాహుబలి మోటార్లన్నీ మునిగిపోయాయి. వందల కోట్ల నష్టం జరిగింది.
కాళేశ్వరంప్రాజెక్టుకు పెట్టిన ఖర్చు ఆ ప్రాజెక్టు వల్ల రైతులకు అందుతున్న నీరు వంటి వాటిని పరిగణలోకి తీసుకుంటే… కనీసం కరెంట్ బిల్లులు కూడా గిట్టుబాటు కావనేది నిపుణుల వాదన. ప్రస్తుతం ఆ దిశగానే బలమైన ఆధారాలు బయటపడుతున్నాయి.
కాళేశ్వరంపై ఎవరూ నెగెటివ్ గా మాట్లాడకుండా.. ఆ ప్రాజెక్ట్ మైనస్‌లు గురించి ఎవరికీ తెలియకుండా ప్రభుత్వం మేనేజ్ చేసుకుంటోంది. ప్రపంచంలోనే అద్భుతమైన కట్టడం అని ప్రశంసలు పొందడానికి ప్రయత్నిస్తోంది. నిర్మాణంలో అద్భుతమే కానీ అసలు దాని వల్ల ఏంటి ఉపయోగం అనేది ఎక్కువ మంది వ్యక్తం చేస్తున్న సందేహం. దీనికి ప్రభుత్వం క్లారిటీ ఇస్తుందా
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి