తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవిత ఎక్కడ నుంచి పోటీ చేస్తారన్న ప్రశ్నలు మళ్లీ తెరమీదకు వచ్చాయి. సీఎం కూతురు కావడంతో ప్రతీ ఒక్కరూ తమ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని దగ్గరుండి గెలిపించుకుంటామని చెప్పినా… నిజమైన విజయాకాశం ఉన్న చోటే నామినేషన్ వేయించాలని భావిస్తున్నారు. లోక్ సభ, అసెంబ్లీలో కవిత ఎక్కడ నుంచి పోటీ చేస్తారో పార్టీ శ్రేణులకు ఇంకా తెలియకపోయినా కేసీఆర్ కొంత మేర క్లారిటీకి వచ్చినట్లు చెబుతున్నారు..
నిజామాబాద్ లోక్ సభా స్థానం నుంచి కవిత ఓడిపోయిన తర్వాత ఆమె పాపులారిటీ కాస్త మసకబారిన మాట వాస్తవం. లిక్కర్ స్కాంలో పేరు రావడంతో ఆమె రాజకీయంగా మరింత ఒత్తిడికి లోనయ్యారు.కవిత వర్సెస్ అర్వింద్ అన్నట్లుగా నిన్న మొన్నటి దాకా మాటల యుద్ధం నడిచినా ఇప్పుడామెకు వేరే ఆలోచనలున్నట్లు చెబుతున్నారు.అందుకే కేసీఆర్ ఆదేశాల మేరకు కొంత మౌనం పాటిస్తున్నారని వార్తలు వస్తున్నాయి.
ఎన్నికల ఏడాదిలో ఎవరెక్కడ నుంచి పోటీ చేస్తారో అన్న చర్చ రోజువారీ జరుగుతున్నదే. అందులోనూ వీఐపీ అభ్యర్థులైతే ఇక పార్టీ నేతలకు, ప్రత్యర్థులకు అదో టెన్షన్ అనే చెప్పాలి. అధికార పార్టీ అధినేత అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టి ఈ నెల మూడో వారంలో తొలి జాబితా విడుదల చేస్తారన్న వార్తలు వస్తున్న వేళ ఎవరెక్కడ పోటీ చేసే వీలుందన్న విశ్లేషణలు మొదలయ్యాయి. అందులోనూ కల్వకుంట్ల కవిత ఎక్కడ నుంచి బరిలోకి దిగుతారన్న ప్రశ్న తలెత్తుతోంది. ఎమ్మెల్సీ స్థానంతో ఆమె సరిపెట్టుకోరని ఖచితంగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తారని పార్టీ వర్గాలు నిర్ణయానికి వచ్చాయి. కేసీఆర్ మదిలో కూడా అదే ఆలోచన ఉంది.
పసుపు రైతుల సమస్య కారణంగా కవిత పోయిన సారి నిజామాబాద్ ఎంపీ స్థానం నుంచి ఓడిపోయారు. తర్వాతి కాలంలో బీజేపీ కూడా పసుపు రైతులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదు. పసుపు బోర్డ్ నిజామాబాద్ కు రాలేదు. దానితో కమలం పార్టీపై కూడా నిజామాబాద్ ఓటర్లు ఆగ్రహంగానే ఉన్నారు. నువ్వు చేసిందేమిటని నిజామాబాద్ బీజేపీ ఎంపీని కవిత గట్టిగానే నిలదీశారు. దానితో మాటల యుద్ధం సాగింది. ఆమె నిజామాబాద్ నుంచి మళ్లీ లోక్ సభకు పోటీ చేయాలనుకుంటున్నట్లు పార్టీలో చెప్పుకున్నారు. అయితే కేసీఆర్ వ్యూహం మార్చారని అంటున్నారు. కొడుకు కేటీఆర్, అల్లుడు హరీష్ రావు లాగే కవితను కూడా అసెంబ్లీలో కూర్చోబెట్టాలని భావిస్తున్నట్లు ఇటీవలే ఓ వార్త ప్రచారానికి వచ్చింది. ఆ క్రమంలో ఓ నియోజకవర్గం పేరు ఎక్కువగా వినిపిస్తోంది..
కవిత బొగ్గు గని కార్మిక సంఘం నాయకురాలిగా కూడా ఉన్నారు. అందుకే ఈ సారి ఆమె రామగుండం అసెంబ్లీ నుంచి పోటీ చేయాలని ఆక్కడి బీఆర్ఎస్ నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుత రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ సొంత పార్టీ నేతల నుంచే విమర్శలు ఎదుర్కొంటున్నారు.కోరుకంటి చందర్ అవినీతిపరుడని సొంత పార్టీ నేతలే ఆరోపణలు చేస్తుండడం చర్చనీయాంశంగా మారింది. మాజీ మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ, టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, పాలకుర్తి జడ్పీటీసీ సభ్యురాలు కందుల సంధ్యారాణి, పాతిపెల్లి ఎల్లయ్య, మనోహర్‌రెడ్డి లాంటి బీఆర్ఎస్ అసమ్మతి నాయకులు గోదావరిఖనిలో విలేకర్ల సమావేశం పెట్టి మరీ ఈ ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే అనుచరులు బ్రోకర్ల లాగా మారి, ఆర్ఎఫ్సీఎల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని 750 మంది నుంచి వసూళ్లకు పాల్పడ్డారని ఆరోపించారు.ఈ నేపథ్యంలో చందర్ పోటీ చేస్తే ఓడిపోతారని, రామగుండం సీటును కాపాడుకోవాలంటే కవితను రంగంలోకి దించాలని ఆ నేతలంతా కేసీఆర్ కు విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ కూడా అదే ఆలోచనలో ఉన్నారట.
కేసీఆర్ కుటుంబంలో ఉన్న స్పర్థలు కూడా కవిత అసెంబ్లీకి పోటీ చేయాలన్న ఆలోచనకు కారణమవుతోందని ఒక వాదన ప్రచారంలో ఉంది. పెత్తనం మొత్తం కేటీఆర్ చేతుల్లోనే ఉండాలా మాకు వద్దా అని కవిత వర్గం ప్రశ్నిస్తున్నట్లుగా చెబుతున్నారు. అందుకే ఎమ్మెల్యేగా పోటీ చేసి చక్రం తిప్పాలని కవిత కూడా భావిస్తున్నట్లు సమాచారం. కేసీఆర్ కూడా తొలుత కుమార్తెను ఢిల్లీలో ఉంచాలని భావించినా.. తర్వాత రూటు మార్చి ఆమెను అసెంబ్లీకి పోటీ చేయిస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారు. నిజంగా ఆమె రామగుండం నుంచి పోటీ చేస్తారా లేదా అన్నది ఒకటి రెండు వారాల్లో తేలుతుంది. అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి..