రాహుల్ కి రిలీఫ్

By KTV Telugu On 8 August, 2023
image

KTV Telugu ;-

ఎట్టకేలకు రాహుల్ గాంధీకి  పెద్ద ఊరట లభించింది. అంటే కాంగ్రెస్ పార్టీకి  పెద్ద రిలీఫ్  వచ్చింది. ఈ పరిణామంతో విపక్ష కూటమి ఇండియాకు కొత్త ఊపు వచ్చింది. పాలక బిజెపికి కాస్త నిరాశ వచ్చింది.2024 ఎన్నికల్లో ఎన్డీయేని నిలువరించడానికి  వ్యూహాలతో దూసుకుపోతోన్న విపక్షాలకు కావల్సినంత ధైర్యాన్నిచ్చింది. దేశంలోని సర్వోన్నత న్యాయస్థానం తీర్పుతో దేశ రాజకీయ సమీకరణల్లోనే ఒక మెరుపు వచ్చింది. కొద్ది రోజులుగా ఉన్న విపక్షాల ఆందోళనకు తెరపడింది.

కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి  సూరత్ కోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షపై  సుప్రీం కోర్టు స్టే విధించింది. రెండేళ్ల పాటు జైలు శిక్ష ఎందుకు విధించాల్సి వచ్చిందో కింది కోర్టు ఎక్కడా పేర్కొనలేకపోయిందని సుప్రీం వ్యాఖ్యానించింది. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు ఆయనపై  పడ్డ అనర్హత వేటు అంశాలను క్షుణ్నంగా పరిశీలించామంది సుప్రీం కోర్టు. అనర్హత వేటు పడితే అది రాహుల్ గాంధీ రాజకీయ జీవితంతో పాటు ఆయన్ను ఎన్నకున్న ప్రజల భవిష్యత్తు పైనా ప్రభావం పడుతుందని తాము భావించినట్లు న్యాయమూర్తి చెప్పారు. అందుకే రాహుల్ గాంధీపై విధించిన రెండేళ్ల జైలు శిక్షను నిలిపివేస్తున్నట్లు వివరించింది.

సుప్రీం కోర్టు తీర్పుతో   కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం  వెల్లి విరిసింది. రాహుల్ గాంధీపై రెండేళ్ల జైలు శిక్షను నిలిపివేసిన నేపథ్యంలో  రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వంపై లోక్ సభ సెక్రటేరియట్ వేసిన అనర్హత వేటు కూడా తొలగిపోనుంది. అయితే సుప్రీం కోర్టు తీర్పు  కాపీ లోక్ సభకు అందిన తర్వాతనే దీనిపై లోక్ సభ సెక్రటేరియట్  నిర్ణయం ప్రకటించే అవకాశాలున్నాయి. రాహుల్ గాంధీ తరపున  వాదించిన అభిషేక్ మను సింఘ్వీ  అయితే ఈ వర్షాకాల సమావేశాల్లోనే రాహుల్ గాంధీ పార్లమెంటుకు హాజరు అవుతారని ప్రకటించారు.

2019 ఎన్నికల్లో రాహుల్ గాంధీ గుజరాత్ లో   ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా    దేశంలో  కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టిన దొంగల ఇంటిపేర్లన్నీ మోదీ అనే ఎందుకు ఉంటాయో? అని రాహుల్ గాంధీ  వ్యాఖ్యానించారు. ఐపీఎల్  లో   అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటోన్న  లలిత్ మోదీ, బ్యాంకులకు వేలాది కోట్ల రూపాయల మేరకు రుణాలు ఎగ్గొట్టి  ప్రజాధనాన్ని దోచుకుపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ లను ఉద్దేశించే రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్య చేశారు. అయితే ఇందులో శ్లేష తో ఆయన ప్రధాని నరేంద్రమోదీని అప్రతిష్ఠపాలు చేశారని బిజెపి నేతలు  ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ  సూరత్ కు చెందిన ఓ  బిజెపి నేత న్యాయస్థానంలో  పిటిషన్ దాఖలు చేశారు. వెనుకబడిన వర్గాలకు చెందిన మోదీ ఇంటిపేరును  అవమానించడం ద్వారా బీసీలో మనోభావాలు దెబ్బతీశారని రాహుల్ గాంధీపై  అందులో ఆరోపించారు. రాహుల్ గాంధీపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్ పై నాలుగేళ్ల పాటు విచారణ జరిగింది. ఈ మధ్యనే  సూరత్ కోర్టు రాహుల్ గాంధీని దోషిగా  నిర్ధారించింది. ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ప్రజాప్రాతినిథ్య చట్టం ప్రకారం రెండేళ్లు..అంతకు మించి జైలు శిక్ష పడితే చట్టసభల్లో సభ్యత్వంపై వేటు పడుతుంది.

సూరత్ కోర్టు రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించే సమయంలోనే  రాహుల్ గాంధీ దేశంలోని బిజెపియేతర పార్టీలన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చే మహాయజ్ఞంలో బిజీగా ఉన్నారు. విపక్షాలన్నీ ఐక్యంగా ఉంటే ఎన్డీయేని అధికారంలోకి రానీయకుండా నిలువరించవచ్చునని ఆయన భావించారు. విపక్షాలు కూడా సానుకూలంగా స్పందించి విపక్ష కూటమిలో జోష్ పెరిగిన సమయంలో రాహుల్ గాంధీపై ఏకంగా అనర్హత వేటు పడ్డంతో కాంగ్రెస్ పార్టీతో సహా ఇతర విపక్షాల్లోనూ నిరాశ   ఆవహించింది. సూరత్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీంను ఆశ్రయించారు. ఇపుడు సుప్రీం కోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పు చెప్పడంతో విపక్ష కూటమిలోనూ సంతోషం వ్యక్తం అవుతోంది.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి..