ప్రపంచ ప్రఖ్యాత తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవిని మళ్లీ భూమన కరుణాకర్ రెడ్డికే కట్టబెట్టడం వెనుక పెద్ద స్కెచ్చే ఉందనుకోవాలి. వైఎస్ హాయాంలో కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్ గా ఉండేవారు. ఇప్పుడు వైఎస్ కుమారుడు ఆయనకు మరోసారి ఆ అవకాశం ఇచ్చారు. 17 ఏళ్ల గ్యాప్ లో ఈయనకు ఈ అవకాశం వచ్చింది. ఇదీ నిజంగా ఆలోచించదగిన విషయమే అనుకోవాలి. ప్రస్తుతం తిరుపతి ఎమ్మెల్యేగా ఉన్న భూమనకు మంత్రి పదవి ఇవ్వలేకపోవడంతో ఈ విధంగా అకామడేట్ చేశారని చెప్పుకోవాలి. మంత్రి పదవి కంటే ఎక్కువ పోటీ ఉండే టీటీడీ చైర్మన్ పదవి దక్కడం అదృష్టంగా కూడా భావిస్తారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
తొలుత బీసీ సామాజిక వర్గానికి టీటీడీ చైర్మన్ పదవి ఇస్తారని అనుకున్నారు. దాంతో గుంటూరుకు చెందిన బీసీ నేత, ఎమ్మెల్సీ జంగా క్రిష్ణ మూర్తి పేరు ప్రముఖంగా వినిపించింది. ఆ తరువాత చూస్తే నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి వైశ్య సామాజికవర్గానికి చెందిన సిద్ధా రాఘవరావుకు ఈ పదవి ఇస్తారని అనుకున్నారు ఆయన కూడా అనూహ్యంగా రేసులోకి వచ్చారు. వైవీ సుబ్బారెడ్డికే ఇంకో ఛాన్స్ అనుకున్నారు. చివరకు భూమన కరుణాకర్ రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మధ్య పోటీ నెలకొంది. కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్ అయ్యారు. చెవిరెడ్డికి నిరాశ తప్పలేదు. వైఎస్ ఫ్యామిలీకి బాగా కావాల్సిన నాయకుడు కావడంతో భూమనను ఆ పదవి వరించిందని భావిస్తుండగా కుల సమీకరణం కూడా పనిచేసిందని అంటున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రెడ్డి సామాజికవర్గం నాయకులను మంచి చేసుకోవాల్సిన అనివార్యత వైసీపీ అధిష్టానానికి ఏర్పడింది. బలిజ సామాజికవర్గం ఏకమొత్తంగా జనసేన వైపుకు వెళ్తోందని తాజా సర్వేలు చెబుతున్నాయి. పాత ప్రజారాజ్యం పార్టీ బలిజలు అంతా పవన్ కల్యాణ్ వైపు మొగ్గు చూపుతున్నారు. దానితో కుల విభజన సృష్టించి చిత్తూరు జిల్లాను కైవసం చేసుకోవాలని జగన్ ప్లాన్ చేసినట్లున్నారు. చిత్తూరు రెడ్లు అంగబలం, అర్థబలం ఉన్న వర్గం కావడంతో పెద్ద ప్లాన్ లో భాగంగా కరుణాకర్ రెడ్డిని టీటీడీ చైర్మన్ గిరి వరించింది. 2024 ఎన్నికల పోటీ నుంచి తప్పుకోవాలని కరుణాకర్ రెడ్డి అనుకుంటున్నారట. అందుకే ఆఖరి అవకాశంగా ఆయనకు టీటీడీ పదవి ఇచ్చారని చెబుతున్నారు. కరుణ తన అర్థబలం, అంగబలంతో వైసీపీ అభ్యర్థిని గెలిపించాలని టార్గెట్ పెట్టే అవకాశం ఉంది.
తెలుగుదేశం పార్టీ హయాంలో టీటీడీ చైర్మన్లుగా బీసీలకు అవకాశం కల్పించారు. అయితే అలాంటి వారికి అవకాశం కల్పించినప్పుడల్లా వైసీపీ ఏదో వివాదం లేవనెత్తేది. సుధాకర్ యాదవ్ కు అవకాశం కల్పించినప్పుడు ఆయన ఓ క్రిస్టియన్ సమావేశానికి వెళ్లారని బీజేపీ నేతలతో కలిసి రచ్చ చేశారు. క్రిస్టియన్ కూటముల్లో పాల్గొనే వారికి ఇప్పుడు టీటీడీ చైర్మన్ పదవులు ఇస్తున్నా ఎవరూ కిక్కురుమనడం లేదు. భూమన కుమార్తె పెళ్లి క్రిస్టియన్ పద్దతిలో కూడా జరిగింది. భూమన అసలు దేవుడు లేడని ఘాటు వ్యాఖ్యలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఆయన ఒకప్పుడు వామపక్ష భావజాలంతో ఉండేవారు. ఎంతో మందిని ఇబ్బంది పెట్టానని ఇటీవలే సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ సమక్షంలో క్షమాపణ చెప్పారు. అయితే కరుణాకర్ రెడ్డి తనను తాను సంస్కరించుకుని ప్రజా నాయకుడిగా మారారని గత రెండు దశాబ్దాల పరిణామాలు చెప్పకనే చెబుతున్నాయి. కాకపోతే ఇక్కడ మరో కోణం కూడా ఉంది. కరుణాకర్ రెడ్డి తన కుటుంబ సభ్యులకు టికెట్ అడుగుతున్నారట. అన్ని వైపుల నుంచి వత్తిడి చేసి మరీ టీటీడీ చైర్మన్ పదవి తీసుకున్నారట. నిజమో కాదో కొన్ని రోజుల్లో తేలుతుంది
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి..