వైసీపీకి పల్నాడు భయం …!

By KTV Telugu On 9 August, 2023
image

KTV Telugu ;-

నారా లోకేష్ యువగళం పాదయాత్ర పల్నాడు రాజకీయాలను మార్చేస్తోంది. లోకేష్ ను అడ్డుకునేదుకు వైసీపీ ఎమ్మెల్యేలు వారి అనుచరులు చేస్తున్న ప్రయత్నాలు బెడిసి కొడుతున్నాయి.ప్రజాగ్రహం పెరిగిపోయి వైసీపీ పట్ల వ్యతిరేకత పెల్లుబుకుతోంది. వైసీపీ ఓవరాక్షన్ తో టీడీపీ గ్రాఫ్ అమాంతం పెరిగిపోతోంది. పైగా టీడీపీ వారందరినీ ఒక తాటిపైకి తెచ్చేందుకు లోకేష్ చేస్తున్న ప్రయత్నాలు కూడా ఫలిస్తున్నాయి….

లోకేష్ యువగళం ప్రకాశం జిల్లాను దాటి పల్నాడు జిల్లాలోకి ప్రవేశించింది. పల్నాడులో ప్రతీ చోట వైసీపీ, టీడీపీ మధ్య నువ్వా నేనా అన్న పోటీ ఉండటంతో ఇరు వర్గాల మధ్య కొంత సంఘర్షణ తప్పడం లేదు. లోకేష్ యాత్రను డిస్టర్బ్ చేసేందుకు వైసీపీ ఎమ్మెల్యేలు స్వయంగా రంగంలో దిగి రెచ్చగొట్టేందుకు వెనుకాడటం లేదు. సజావుగా సాగిపోవాల్సిన యాత్రను ఇలా అడ్డుకోవడమేంటని జనం ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ పరిణామం వైసీపీ వారికే ఇబ్బందిగా మారింది. ఎమ్మెల్యేల తీరు తాడేవల్లి ప్యాలెస్ కు చేరడంతో ఏమిటీ పరిస్థితి అంటూ జగన్ ఆరాతీస్తున్నట్లు సమాచారం.

లోకేష్ పాదయాత్ర 2 వేల కిలోమీటర్లు చేరుతున్న నేపథ్యంలో టీడీపీ నేతలు సంఘీభావ యాత్ర నిర్వహించినప్పుడు వినుకొండ వైసీపీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు చేసిన చేసిన ఓవరాక్షన్ తో అధికార పార్టీ పరువు పోయింది. టీడీపీ శ్రేణులను వైసీపీ కార్యకర్తలు నిత్యం కవ్వించారు. ఈ క్రమంలో టీడీపీ ఇంఛార్జ్ అయిన మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు చేపడుతున్న కార్యక్రమాలను అడ్డుకునేందుకు ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు.. తన అనుచరులను ఉసిగొల్పారు. ఆ క్రమంలోనే పోలీసులు గాల్లో కాల్పులు జరిపారు. దీనితో టీడీపీ శ్రేణులు భయపడి తోక ముడిచారని సంతోషపడిన ఎమ్మెల్యే బ్రహ్మనాయుడుకు సామాన్య జనం రియాక్షన్ చూసి మైండ్ బ్లాంక్ అయిపోయిందని అనుచరులు చెబుతున్నారు. ఏమిటీ చిల్లర పనులని వినుకొండ జనం వైసీపీ పట్ల మరింత వ్యతిరేకతను పెంచుకున్నట్లు తెలుస్తోంది. ప్ర‌శాంత‌మైన వినుకొండ అశాంతికి నెల‌వుగా మార‌డం వెనుక క‌క్ష పూరిత రాజ‌కీయాలు ఉన్నాయ‌ని ఇక్క‌డి ప్ర‌జ‌లు భావిస్తున్న‌ట్టు ప‌రిశీల‌కులు చెబుతున్నారు. ఈ విషయంపై జగన్ కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు వైసీపీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

మాచర్ల ఎమ్మెల్యే పిన్నేలి రామకృష్ణారెడ్డి తన నియోజకవర్గంలో మోనార్క్ లా మారిపోయారని టీడీపీ వాళ్లు కనిపిస్తే కొట్టాలన్నట్లుగా మాట్లాడుతున్నారని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే మాచర్ల టీడీపీ ఇంఛార్జ్ బ్రహ్మారెడ్డిపై ఒకటి రెండు పర్యాయాలు దాడులు కూడా జరిగాయి. అప్పట్లో మంత్రి పదవి దక్కలేదని గందరగోళం సృష్టించి జగన్ అసంతృప్తికి కారణమైన ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి నియోజకవర్గంలో వ్యహరిస్తున్న తీరు కూడా జగన్ కు ఏమాత్రం నచ్చలేదని చెబుతున్నారు. ఇక గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి నియోజకవర్గంలో తక్కువ, హైదరాబాద్ లో ఎక్కువగా ఉంటున్నారని జనం jసమస్యలు పట్టించుకోవడం లేదని వార్తలు వస్తున్నాయి. పైగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావును ఇబ్బంది పెట్టేందుకు కాసు మహేష్ ప్రయత్నిస్తూనే ఉన్నారు. మరో పక్క సత్తెనపల్లి ఎమ్మెల్యే అయిన నీటి పారుదల మంత్రి అంబటి రాంబాబుది మరో తీరు . నోటి పారుదల మంత్రిగా పేరు పడిపోయిన ఆయన తాజాగా బ్రో సినిమా వివాదంలో చిక్కుకున్నారు. సినిమాల్లో ఏదో వస్తుందిలే అనుకోకుండా ఆయన ఎదురుదాడికి ప్రయత్నించి స్వయంగా సూప్ లో పడిపోయారు. సోషల్ మీడియా ఇప్పుడాయనను టార్గెట్ చేస్తోంది. ఎందుకీ అనవసర వివాదాలు అన్నట్లుగా జగన్ ఆగ్రహం చెందారన్నది తాడేపల్లి వర్గాల టాక్.

పల్నాడు వైసీపీ ఎమ్మెల్యేలు హద్దు మీరుతున్నారన్న టాక్ ఇప్పుడు వైసీపీ వర్గాల్లోనే బాగా వినిపిస్తోంది. వారిని అదుపులో పెట్టకపోతే జిల్లా చేజారిపోయే ప్రమాదం ఉందని కూడా విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ముందే అక్కడ సామాజిక వర్గాల సమీకరణాలు లెక్కగట్టుకోవాలి. రెడ్డి వర్సెస్ కమ్మకు సంబంధించిన పోటీ ఎక్కువగానే ఉంటుంది. పైగా పల్నాడులోని బీసీ, ఎస్సీ వర్గాల్లో కూడా వైసీపీ పట్ల వ్యతిరేకత పెరుగుతోంది. మరి జగన్ తన అసంతృప్తిని ఎమ్మెల్యేల వరకు తీసుకెళ్లి.. వారిని దారికి తీసుకొస్తారో లేదో చూడాలి..

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి..